యోగసిద్ధి
సుయోధనుడి రాచమర్యాదలను వద్దని- విదురుడి పూరింట సుఖంగా విడిది చేశాడు శ్రీకృష్ణుడు. 'ఆయన యోగీశ్వరేశ్వరుడు' అంది గీత. మైసూర్ మహారాజు ఆతిథ్యాన్ని కాదని- పేదింట గంజిని సంతోషంగా స్వీకరించారు రమణులు. ఆయనను 'మహర్షి' అంది లోకం. భోగాలపట్ల యావ లేకపోవడం వారిద్దరి మధ్యా సామ్యం. వారు పతంజలి యోగ సూత్రాల్లోని 'వీతరాగులు'. 'సంగములు సర్వమును కల్గి-సంగి(లోబడినవాడు) కాడు, భోగములు సర్వమును చెంది భోక్త కాడు' అన్న కవి వాక్కుకు అలాంటివారే అర్థతాత్పర్యాలు. అర్ధనగ్నంగా ఉన్న అప్సరసలు వ్యాసమహర్షిని చూసి చెట్ల చాటుకు పరుగులు పెట్టారు. 'నవయౌవనంతో మెరిసిపోతున్న నా కుమారుడు శుకమునిని చూసినప్పుడు లేని కలవరపాటు- వయోవృద్ధుణ్ని, నన్ను చూస్తే ఎందుకు కలిగింది' అని అడిగారాయన. 'నీ కొడుకు నిర్మలుడు, నిస్సంగుడు' అన్నారు అప్సరసలు. నవ శిశువును జాషువా 'నోరు లేని యోగి' అన్నది అలా ఉన్నందుకే! 'ప్రతి నిమేషంబు పరబ్రహ్మను ఈక్షించి మది చొక్కి...' బాహ్య ప్రపంచాన్ని మరిచి పోయేవాణ్ని 'ఆరూఢుడు'(బ్రహ్మజ్ఞాని) అంటారు. నిజమైన యోగులందరూ- వీతరాగులు, నిస్సంగులు, ఆరూఢులు, ఆత్మవిదులు!
మదించిన ఏనుగే అయినా, మచ్చికైతే మావటి చెప్పుచేతల్లో ఉంటుంది. మనసుదీ అదే దారి. మనసును మచ్చిక చేసుకోవాలంటే యోగసాధనకు మించిన మంత్రదండం లేదు. యోగుల యోగ్యతలు మన కొలతలకు అందవు. 'ఉర్విజనులు పరమ యోగీశ్వరుని చూచి తెగడు వారె కాని తెలియలేరు' అన్నాడందుకే- వేమన 'యోగి'. ఆ మర్మం తెలిసినవారికి-'కిరీటం పెట్టుకో' అనే సందేశాన్ని, 'నారచీరలు కట్టుకో' అనే ఆదేశాన్నీ రాముడు ఒకేలా ఎలా స్వీకరించాడో తెలిసిపోతుంది. మంచినీళ్ల కోసం వెళ్లిన మహాయోధులైన తమ్ముళ్లు శవాల్లా పడిఉన్నప్పుడు దిగ్భ్రాంతికి గురికాకుండా, స్థిరచిత్తంతో 'నరునకు ఆత్మ ఎవ్వడు?' వంటి నివ్వెరపరిచే ప్రశ్నలు- నూట ఇరవై నాల్గింటికి ధర్మజుడు సరైన జవాబులు ఎలా చెప్పగలిగాడో అర్థమవుతుంది. యోగసాధన పట్ల గట్టి గురి కుదురుతుంది. దాని లక్ష్యం బోధపడుతుంది. యోగ సాధన మనల్ని లేనిపోని భ్రమలనుంచి విడుదల చేస్తుంది. అహంకారం, ఆడంబరం, ఆధిపత్య భావనల నుంచి కాపాడి... అంతర ప్రపంచాల నుంచి ఆత్మవిముక్తిని కలిగిస్తుంది. 'తస్మాత్ యోగీభవ అర్జునా!' అన్న కృష్ణుడి ఆదేశంలోని అంతరార్థాన్ని అవగతం చేస్తుంది.
యోగసాధనలో ప్రధానమైన చిన్ముద్రలో- బొటన, చూపుడువేళ్ల కలయిక-జీవాత్మ పరమాత్మల సంయోగానికి ప్రతీక. నిటారుగా ఉండే మూడువేళ్లు-కర్మ భక్తి జ్ఞాన యోగాల కూడిక. 'మేనిలో పువ్వులు ఆరింటన్ పూజలు ఒనర్తును' అనే సంకల్పంలోని ఆరుపూవులు- షట్చక్రాలు. అవే 'షడాధార కమలాలు! 'ఓంకారంబు హృద్వీధియన్ మింటన్ మ్రోయు...' హృదయాకాశంలో ఓంకారం గంట మాదిరి మారుమోగడం- పరిపూర్ణ యోగసిద్ధి! 'జ్ఞాన వైరాగ్య నిశ్చల ఆనంద పూర్ణులై, జీవన్ముక్తులౌట' సాధనకు తుదిమెట్టు. అదే జీవన్ముక్తి అనే తేనెపట్టు. జీవన్ముక్తులంటే- త్యాగయ్య మాటల్లో 'పులక శరీరులై ఆనందపయోధి నిమగ్నులు అయినవారు. వేమన మాటల్లో 'నియమాది సంగుడై నిలిచిన తత్త్వంబు- తామసంబగు నిద్ర తొలగచేయు, నిద్ర(అజ్ఞానం) తొలంగిన నిర్భీతి నొందించు, శమమున ఆనంద సమితి పుట్టు.' చివరికి ఆ దివ్యానందమయ స్థితిలో 'విశ్వమంతయు తానగు! తాను విశ్వంబైన తత్త్వమగును!' అదీ- యోగ సాధనకు పరమ లక్ష్యం! నడమంత్రపు సిద్ధులతో విరగబడేందుకో, మురిసిపోయేందుకో కాదది-ముక్తి పొందేందుకు! విశ్వనరుడిగా నిలిచేందుకు!
ఎర్రా ప్రగడ రామకృష్ణ
No comments:
Post a Comment