Friday, June 26, 2026

 నాయకులు... ప్రతినాయకులు

మనకు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారనడం పరిపాటి. నిజానికి వారు సంఖ్యాపరంగా 33 కోట్ల మంది కాదు. ముప్పైముగ్గురు మాత్రమే. వర్గీకరణంలో 33 సమూహాలను కోట్లుగా చెబుతారు. యజుర్వేదం, అధర్వణ వేదం, శతపథ బ్రాహ్మణం ఈ ముప్పైమూడు కోట్ల దేవతల గురించి తెలియజేస్తాయి. హిందూ శాస్త్రాల్లోనే కాదు-బౌద్ధ, పార్శీ మతాల్లో కూడా ఈ ప్రస్తావన ఉంది. కోటి అంటే సంఖ్యను సూచించే పదమే కాదు. విధం, వర్గం అనే అర్థాలు కూడా ఉన్నాయి. కాబట్టి 33 విధాలైన లేదా వర్గాలైన దేవతలు అని. వాళ్లే ద్వాదశాదిత్యులు(12), ఏకాదశ రుద్రులు(11), అష్టవసు వులు(8), ఇద్దరు అశ్వినీ దేవతలు. వీళ్లందరూ దేవతలు కాబట్టి మంచి చేస్తారు. మనుషుల కోరికలు తీరుస్తారు.

దేవతల దగ్గర దైవ శక్తి ఉంటుంది. కానీ, వారిని మానవులే తృప్తిపరచాలి. దేవతా ప్రీత్యర్థం మనుషులు వారి వారి ఇష్టాలను, పూజా విధానాన్ని, తత్వాన్ని బట్టి ఆరాధిం చాలి. వారు సూక్ష్మ దేహాలతో తిరుగుతుం టారు. ఎప్పుడూ లోక కల్యాణానికే పాటుప డుతుంటారు. దేవతలకు మనుషులకు మంచి సంబంధాలు ఉంటాయి, ఉండాలి. లేకపోతే మానవులకే నష్టం. అందుకే మాన వులు దేవతలను పూజించి, ప్రార్దిస్తూ ఉంటారు. దేవతలను దూషించకూడదు. మనుషులు భక్తితో, ప్రేమతో ఏది సమర్పిం చినా స్వీకరిస్తారు దేవతలు.

ఉత్త స్తుతులు, స్తోత్రాలతో ఆరాధించాలి.
రాక్షసుల్లో దైత్యులు, దానవులు, అసురులు అని మూడు వర్గాలు. వీరు ధర్మవిరుద్ధ కార్య కలాపాలకు పాల్పడతారు. చెడు చెయ్యడం వీళ్లకి ఇష్టం. దేవుళ్లు నాయకులైతే వీళ్లు ప్రతినాయకులు. దేవతలను, ప్రజలను పీడిస్తారు. లోకకంటకులుగా మారతారు. ఉదా హరణకు రావణాసురుడు, నరకాసురుడు, బకాసురుడు, మహిషాసురుడు మొదలైన వారు. వీళ్లలోనూ త్రిజట, విభీషణుడు లాంటి మంచివాళ్లు కొందరుంటారు.

ఇప్పుడు భూలోకంలోని ఒక ప్రత్యేకమైన జాతి గురించి చెప్పుకొందాం. వాళ్లు మనుషులు. వీళ్లలో దేవుళ్లుంటారు, రాక్షసులుంటారు, మానవత్వంతో పరిమళించే మంచి మనుషులుంటారు. మనుషులంతా మానవ స్వభావంతో ఉంటారా అంటే, లేదు. కొమ్ముల్లేని రాక్షసులుగా దానవ స్వభావంతో ఉండి బయటికి మనుషుల్లాగా కనిపిస్తూ సాటివారిని పీల్చి పిప్పి చేసేవారూ ఉంటారు.

మనిషి జన్మకి ఓ ప్రత్యేకత ఉంది. మానవ శరీరంతోనే జ్ఞానోదయం పొంది, ఆత్మా నుభూతి చెంది దైవంతో సరిసమానమైన స్థితిని పొందవచ్చు. దేవతలు, రాక్షసులు, యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వులు సైతం మానవజన్మ పొందితేనే తప్ప ఈశ్వర ఐక్యం చెందలేరని ఉపనిషత్తులు చెబుతున్నాయి.

అందుకే మనిషి తనని తాను తెలుసుకోవాలి. దైవం సంతృప్తి చెందే మంచి పనులు చేయాలి. సాటి మానవుల పట్ల దయ, జాలి కలిగి ఉండాలి. అలా జీవించగలిగితే దేవతల కన్నా, రాక్షసుల కన్నా మానవుడే మహనీయుడని విశ్వం కొనియాడుతుంది. అటువంటి మనుషులు తయారుకావాలి. సంకల్పబలం ఉంటే తప్పక తయారవుతారు.

ఆనందసాయి స్వామి

No comments:

Post a Comment