Friday, June 26, 2026

 నీలో నలుగురు.
మనలోనే నలుగురు ఉన్నారు — శరీరం, మనసు, బుద్ధి, అహంకారం. వీరి మధ్య జరిగే అంతర్గత చర్యలే మన జీవితంగా బయట పడతాయి. ఈ దేహం ఒక ఆటస్థలం అయితే, మనసు, బుద్ధి, అహంకారం, అనేవి ముగ్గురు ఆటగాళ్లు. వారందరికీ సాక్షిగా నిలిచేది ఆత్మ. ఈ ఆటకు అంతిమ నియంత్రకుడు దైవం.

సమస్య ఏమిటంటే, ఈ నలుగురి మధ్య సమన్వయం లోపిస్తుంది. నలుగురిలో ప్రతి ఒక్కరూ తామే యజమానులమని భావిస్తారు. శరీరం సుఖాలను అడుగుతుంది. మనసు కోరికలు కోరుతుంది. అహంకారం గుర్తింపు, గౌరవం కోసం ఆరాటపడుతుంది. బుద్ధి మాత్రం ఏది శ్రేయస్కరమో నిర్ణయించడానికి ప్రయత్నిస్తుంది. ఈ అంతర్గత విభేదాలే అసంతృప్తికి, ఆందోళనకు, దుఃఖానికి కారణమవుతాయి.

మనసు మరియు అహంకారం చేతులు కలిపినప్పుడు బుద్ధి ఒంటరిగా మారిపోతుంది. బుద్ధి మనసును హెచ్చరిస్తున్నా మనసు బుద్ధి మాట వినదు. మనసూ అహము మధ్య స్నేహం పెరిగినప్పుడు కోరికలు అదుపు తప్పుతాయి. తప్పు చేస్తున్నావని మనసుని బుద్ధి హెచ్చరించినా, మనసు పట్టించుకోదు.  కోరికలు గుర్రాలయి మనసుపై అదుపు సాధించి మనిషిని తన నిజమైన గమ్యాన్ని మరచిపోయే తట్లు చేస్తాయి. జీవితంలో పతనం అక్కడి నుంచే ప్రారంభమవుతుంది.

ఉపనిషత్తులు మనిషిని ఒక రథంతో పోలుస్తాయి. శరీరం రథం. ఇంద్రియాలు గుర్రాలు. మనసు కళ్ళెం. బుద్ధి సారథి. ఆత్మ రథికుడు. గుర్రాలు నియంత్రణలో ఉంటే రథం సరైన దిశలో ప్రయాణిస్తుంది. కానీ గుర్రాలు అదుపు తప్పితే ప్రమాదం తప్పదు.

కోరికలు కూడా అలాంటి గుర్రాలే. అవి నియంత్రణలో ఉంటే మనిషిని అభివృద్ధి వైపు తీసుకెళ్తాయి. అదుపు తప్పితే అగాధంలోకి నెట్టేస్తాయి. మద్యం, వ్యసనాలు, అధిక సంపాదన పట్ల దురాశ, అధికార మదం, కోపం, అసూయ – ఇవన్నీ అదుపు తప్పిన గుర్రాల రూపాలే.

గమ్యం లేని గుర్రపు స్వారీ ఎంత ప్రమాదకరమో, వివేకం లేని కోరికల వెంట పరిగెత్తే జీవితం కూడా అంతే ప్రమాదకరం. కోరికల గుర్రాలపై మనసు స్వారీ చేస్తుంటే, వాటి వెనుక బంధింపబడి మనిషి కూడా పరుగెత్తాల్సి వస్తుంది. చివరికి అతను చేరేది తప్పుడు తీరానికే.

అయితే మనిషి జీవితంలో, బుద్ధి మాటను మనసు వినడం ప్రారంభించినప్పుడు మార్పు మొదలవుతుంది. మనసు అహంకారం ప్రభావం నుండి బయటపడినప్పుడు అంతరంగ శాంతి పెరుగుతుంది. బుద్ధి మాట విన్న మనసు, ఆత్మ సాక్షితో చేయి కలిపినప్పుడు జీవితం సరైన దిశలో ప్రయాణిస్తుంది.

ధ్యానం, స్వాధ్యాయం, సత్సంగం, సేవ, ఆత్మపరిశీలన వంటి సాధనలు మనసును బుద్ధికి దగ్గర చేస్తాయి. క్రమంగా అహంకారం బలహీనపడుతుంది. మనసు సంస్కారవంతమవుతుంది. కోరికలు నియంత్రణలోకి వస్తాయి. బుద్ధి నాయకత్వాన్ని స్వీకరిస్తుంది.

అప్పుడు మనిషి బయట ప్రపంచాన్ని గెలవడానికి ప్రయత్నించడు; ముందుగా తనను తాను గెలుస్తాడు. ఇదే నిజమైన విజయం. భగవద్గీత చెప్పే స్థితప్రజ్ఞత్వం ఇదే. బుద్ధుడు చెప్పిన నిర్వాణ మార్గం ఇదే.

మనసు మరియు అహంకారాన్ని విడదీసి, మనసును బుద్ధితో జతచేసినప్పుడు అహంకారం నిష్క్రమిస్తుంది. బుద్ధి మనసును సంస్కరిస్తుంది. సంస్కరించిన మనసు ఆత్మ వైపు తిరుగుతుంది. ఆత్మను దర్శించినప్పుడు మనిషి తన అసలు స్వరూపాన్ని గుర్తిస్తాడు.

అప్పుడు అతడు జీవిత ఆటలో ఓడిపోయిన ఆటగాడు కాదు. తనను తాను తెలుసుకున్న విజేతగా నిలుస్తాడు. జీవితంలో గొప్ప విజయం ప్రపంచాన్ని జయించడం కాదు; తన మనసును జయించడమే. అదే ఆత్మవిజయం. అదే మానవ జన్మ యొక్క పరమార్థం.

అందుకే ఆధ్యాత్మిక దృష్టిలో “నలుగురిలో ఒకడుగా బ్రతకడం” అంటే, ఈ నలుగురిలో ఎవరో ఒక్కరి బానిసగా కాకుండా, వారందరి ఉనికిని గుర్తించి, వారి మధ్య సమన్వయం సాధిస్తూ జీవించడం.

శరీరం తన పని చేయాలి. మనసు తన భావాలను వ్యక్తం చేయాలి. బుద్ధి మార్గనిర్దేశనం చేయాలి. అహంకారం వ్యక్తిత్వాన్ని కాపాడే పరిమిత పాత్రలో ఉండాలి.. ఆత్మ సాక్షిగా నిలవాలి.
అదే సమతుల్య జీవితం. అదే ఆధ్యాత్మిక జీవితం. అదే  ‘నలుగురిలో ఒకడుగా బ్రతకడం’ అనే మాటకు నిజార్ధం.

ఆచార్య డా అనిల్ ప్రసాద్
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం 👏

No comments:

Post a Comment