Thursday, December 12, 2024

 ఏతస్మాత్మిమివేంద్రజాలమపరం యద్గర్భవాసస్థితం 
రేతశ్చేతతి హస్తమస్తకదప్రోద్భూతనానాఙ్కరమ్ ౹
పర్యాయేణ శిశుత్వయౌవనజరావేషై రనేకైర్వృతం పశ్యత్యతతి శృణోతి జిఘ్రతి తథా గచ్ఛత్యథాగచ్ఛతి ౹౹147౹౹

147.  గర్భవాసమందలి రేతస్సు ఒక చేతనవంతమైన వ్యక్తియగును.చేతులు కాళ్ళు తల మొదలగు మొగ్గలు తొడుగును. క్రమముగా శైశవము యౌవనము వార్ధక్యము ఆదిగా గల అనేక వేషములను ధరించును. చూచును,సంచరించును,వినును,వాసన చూచును అట్లే పోవును పిదప వచ్చును.దీనికంటే అద్భుతమైన ఇంద్రజాలము మరియేది కలదు?
వ్యాఖ్య:- బల్బులో విద్యుచ్ఛక్తి ఉంటూ కాంతి వ్యక్తమవుతున్నట్లే ఆత్మచైతన్యం కూడా శరీర కర్మలుగా వ్యక్తమవుతొంది.

శరీరం స్థూలమైనది.యీ ఉపాధులన్నిటిద్వారా ఆత్మే వ్యక్తమౌతూ కర్మలను చేయిస్తొంది.

బల్బులోపల విద్యుచ్ఛక్తి లేకపోతే బల్బు ద్వారా కాంతి వ్యక్తమే కాదు.

ఆత్మే(చైతన్యం) సూక్ష్మంగా ఉంటూ శరీరానికి ఆధారమైనది. ఏవిధముగా బల్బునకు విద్యుచ్ఛక్తి ఆధారంగా ఉంటూ పనిచేయిస్తుందో అదే విధంగా శరీరక ఉపాధులకు ఆత్మచైతన్యం ఆధారంగా ఉంటూ నియమిస్తొంది.

ఆత్మచైతన్యం గర్భస్థ శిశువుగా వ్యక్తమవుతూ స్థూల అవయవములు ఏర్పరుచుకొంటూ ఆ అవయవముల ద్వారా చూడటం,వినటం,సంచరించటం,వాసన చూడటం,బుద్ధిలోని చైతన్యం ద్వారా ఆలోచించటం,

క్రమముగా శైశవ దశ,యౌవన దశ, వార్ధక్య దశ ఇలా అనేక వేషములు ధరించుచూ ఈ శరీరమే నేనుగా ఆత్మగా పొరబడడానికి మించిన అజ్ఞానం మరోది వుండబోదు.

చైతన్యం లేకున్న  స్థూలశరీరము జడమే.
మాటవరసకు జడపదార్థములనుండి చైతన్యము జనించెనే అనుకొందాము.వెలుగు చీకటుల వలె పరస్పర విరుద్ధములైన జడచైతన్యములకు కార్యాకారణ సంబంధమును ఎట్లు అన్వయింపగలము?

శరీరానికి పరిమిత ఆకారంవుంది. కానీ ఆత్మ సర్వవ్యాపకం.
శరీరమో అనుక్షణం మార్పు చెందుతూనే ఉంటుంది.అటువంటి 
ఈ శరీరమే నేనని ఏవిధంగా అనుకోగలము?ఇంతకు మించిన అజ్ఞానము మరేదైనా ఉంటుందా?
ఇంతకంటే అద్భుతమైన ఇంద్రజాలము మరియొకటి వున్నదా?
నా "గేదే"నేను అని చెప్పడం తెలివితక్కువ కాదా?

చైతన్యమే దేహాన్ని పనిచేయిస్తొంది.మనో బుద్ధులను నియమిస్తోంది.చైతన్యమే లేకపోతే శరీరము,మనస్సు,బుద్ధి అన్నీకూడా జడమైపోతాయి.

ఆత్మచైతన్యం శరీరము లోపలవుంది.ఆ చైతన్యముంటేనే అన్ని ఉపాధులు పనిచేస్తాయి.
అత్మచైతన్యం సూక్ష్మమైనది.దీనిలో జీవిత లక్షణాలయిన బాధలూ భయాందోళనలూ మొదలయినవేవీ లేవు.

చైతన్యం మార్పులేనిది.
నాశం లేనిది.
అమరమయిన తత్త్వమిది.ఏ విభాగాలూ లేని నిష్కళమైన ఆ "ఆత్మనే నేను".   

No comments:

Post a Comment