*దైవం.....*
*ఏక, రూప నామారాధన ఉత్తమం...*
*భగవంతుడు అనేక రూపాలలో, అనేక నామాలతో భక్తులచే ఆరాధింపబడుతున్నాడు. అన్ని నామములు, అన్ని రూపములు ఆయనవే. సకల మంత్ర, త్రంత స్వరూపుడు, సమస్త విశ్వానికి అధిపతి ఆయనే. అందులో సందేహం లేదు. ఆయన తప్ప సకల చరాచర జగత్తులో మరేదీ స్థిరమైనది కాదు.*
*అందుకే... "అనంత నామధేయాయ, సర్వాకార విధాయనే సమస్త మంత్ర వాచ్యాయ, విశ్వైక పతయేనమః" అంటూ సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తుంటాం. అయితే, అన్ని రూప, నామములు ఆయనవే అయినా.. భక్తులు తమకు ప్రియమైన ఒక రూపాన్ని, ఒక నామాన్ని ఎంపిక చేసుకొని ప్రగాఢ విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తుంటారు.*
*ఏకోన్ముఖం చేయటం వల్ల భక్తిలో గాఢత, తీవ్రత, సాంద్రత పెరుగుతాయి. భక్తులు మైమరచి దైవారాధన చేయగల స్థితి సంప్రాప్తిస్తుంది. ఫలితం సత్వరంగా అందుతుంది. భూతద్దంపై సూర్యకిరణాలు ప్రసరించేలా చేసి, ఆ వెలుగు ఒక కాగితంపై కేంద్రీకృతం చేస్తే ఉష్ణం జనించి కాగితం కాలిపోయే స్థితి వస్తుంది. సూర్యకాంతి కేంద్రీకృతం కావడం వల్లనే ఇలా జరుగుతుంది. భక్తి కూడా అంతే.*
*కానీ... కొంతమంది వారంలో ఒక్కోరోజును ఒక్కో దేవుడికి కేటాయిస్తారు. ఆదివారం సూర్యభగవానుడికి, సోమవారం శివారాధన, మంగళవారం ఆంజనేయ స్వామికి ఆకుపూజ, బుధవారం విగ్నేశ్వరగుడికి, గురువారం దత్తాత్రేయ గుడికి వెళ్లడం, శుక్రవారం అమ్మవారి ఆలయానికి, శనివారం వేంకటేశ్వర స్వామి కోవెలకు వెళ్లి దర్శనం చేసుకోవటం వంటివి చేస్తుంటారు. అన్ని రూప నామములు శక్తిమంతమైనవే అయినా మనకున్న కొద్దిపాటి కాలాన్ని, శక్తిని, భక్తిని ఇలా అనేక దైవరూప నామాలుగా పంచడం సరియైన విధానం కాదు.*
*ఈ సందర్భంగా శ్రీ సత్యసాయిబాబా వారు చెప్పిన సూక్తి స్మరణీయం...*
*పట్టినదేదియో పట్టనేపట్టితివి,*
*పట్టు నెగ్గుడు దాకా అట్టె ఉండు*
*కోరినదేదియో కోరనే కోరితివి,*
*కోర్కె చెల్లెడిదాక కొలచియుండు*
*అడిగినదేదియో అడగనే అడిగితివి, అడిగినదిడుదాక అట్టె ఉండు*
*తలచినదేదియో తలచనే తలచితివి,*
*తలపు తీరెడుదాకా తలరకుండు*
*పోరుపడలేక తానైన బ్రోవవలయు*
*ఒడలుతెలియ నీవైన ఉడుగవలయు.*
*అంతియేగాని మధ్యలో మరలిపోవుట భక్తుని లక్షణముగాదు...*
*చిరస్మరణీయులైన అనేక మంది మహాభక్తుల చరిత్రను పరిశీలించినా ఒకే రూపనామాన్ని అంటి పెట్టుకొని ఉండి జన్మ సాఫల్యం చేసుకోవడం మనకు కన్పిస్తుంది. రోమరోమానారామనామాన్ని పలికించిన ఆంజనేయస్వామి చిరంజీవియైు, తానే దైవం స్థాయికి ఎదిగి లోకానికి పూజనీయుడైనాడు.*
*కలియుగంలో కూడా త్యాగయ్య, అన్నమయ్య, క్షేత్రయ్య, రామదాసు, జ్ఞానదేవ్, నామదేవ్, చైతన్యమహాప్రభు, సక్కుబాయి, మీరాబాయి వంటి మహాభక్తులు ఒకే రూపనామాలను ఆరాధించి ధన్యజీవులైనారు. కనుక మనమంతా మనకు ప్రీతిపాత్రమైన రూప నామాన్ని ఎంపిక చేసుకొని అనునిత్యం ప్రార్థిస్తూ, పూజిస్తూ, ధ్యానిస్తూ ధన్యులమవుదాం...*
*🌹సర్వేజనాః సుఖినోభవంతు🌹*
🍁🍁🍁 🙏🕉️🙏 🍁🍁🍁
No comments:
Post a Comment