జాగ్రత్స్వప్న జగత్తత్ర లీనం బీజ ఇవ ద్రుమః ౹
తస్మాదశేషజగతో వాసనాస్తత్ర సంస్థితాః ౹౹152౹౹
152. విత్తనమునందు వృక్షము లీనమై ఉన్నట్లే జాగ్రత్స్వప్న జగత్తులు సుషుప్తియందు లీనమై ఉన్నవి.అదే విధముగ అశేష జగత్తు యొక్క వాసనలు మాయయందు సుప్తములై ఉన్నవి.
యా బుద్ధివాసనాస్తాసు చైతన్యం ప్రతిబింబతి ౹
మేఘాకాశవదసృష్టి చిదాభాసోఽ సుమీయతామ్ ౹౹153౹౹
153. బుద్ధియందు అట్లు సుప్తావస్థయందున్న జగద్వాసనలపై కూటస్థ చైతన్యము ప్రతిఫలించును. అస్పష్టత వలన అది అనుభవమునకు రాకున్నను దాని ఉనికిని అనుమానింపవచ్చును. మేఘమునందలి నీటి కణములలో ఆకాశప్రతిఫలనము ఊహించినట్లే.
సాభాసమేవ తద్బీజం ధీరూపేణ ప్రరోహతి ౹
అతో బుద్ధౌ చిదాభాసో విస్పష్టం ప్రతిభాసతే ౹౹154౹౹
154. ఆ కూటస్థ చైతన్య ప్రతిఫలనముతో కూడిన మాయాబీజమే పెరిగి బుద్ధిరూపము దాల్చును.ఆపై బుద్ధియందు చిదాభాసము,చైతన్య ప్రతిఫలనము,స్పష్టముగ అహంతయై కనిపించును.
వ్యాఖ్య:- ఆత్మయైన తాను జాగ్రత్స్వప్న సుషుప్తు లనియెడు త్రివిధావస్థల నెరుగు చుండుటచే తానే చిద్రూపాత్మయై యున్నాడు.
జాగ్రత్స్వప్నములలో తప్ప సుషుప్తియందు ఆత్మ దేనిని గూడా తెలిసికొనదుగాన జడమని నిశ్చయించగూడదు.
సుషుప్తి యందు ఏ వస్తువునుగూడ తెలిసికొనలేదు అని చైతన్య సహాయంతో తెలుపు జ్ఞానము ఉండనే వున్నది.
అలాగే జాగ్రత్స్వప్న జగత్తులు సుషుప్తి యందు లీనమై పోయి చైతన్యము ప్రతిఫలించును.
అస్పష్టత వలన అనుభవము తెలియకున్నను ఏమీ తెలియలేదనేది బుద్ధి యందు తెలుయునది కూటస్థచైతన్య ఉనికిగా ఊహించవచ్చును.
మేఘమునందు వున్న నీటి కణములయందు ఆకాశప్రతిఫలనము ఊహించి నట్లుగానే.
ఆ కూటస్థ చైతన్య ప్రతిఫలనముతో కూడిన మాయాబీజమే పెరిగి బుద్ధిరూపము దాల్చును. చైతన్యము బుద్ధియందు ప్రతిఫలించి తద్వారా ఇంద్రియములను,ఇంద్రియముల ద్వారా బాహ్య వస్తువులను ప్రకాశింపజేయును.
అంతఃకరణమును,ఇంద్రియములును పరిచ్చిన్నములైయున్నవి. ఎయ్యది పరిచ్ఛిన్నమో అయ్యది ఘటమువలె కార్యమై యున్నది.ఏది కార్యమో అది జడము కాన ఈ చిద్రూపాత్మయే అంతఃకరణమందు ప్రతిఫలించి ఇంద్రియములను,ఇంద్రియముల ద్వారా బాహ్య జగత్తును ప్రకాశింపచేయుచున్నది.
స్పష్టముగ అహంతయై కన్పించుచున్నది.
అల్పతరమగు "అహంతను"నిరోధించి
"సర్వము నేనే" లేక
"నేను అత్యంత సూక్ష్మముగా, స్వతంత్రముగా ఉన్నాను";
అనుభావనను కలిగి శ్రేష్టతరమగు
"అహంత"ను ఆశ్రయింపవలెను.
కనుక "ఇది సత్యము",
"ఇది సత్యము కాదు"అను పేర్కొన గల్గిన విభాగమేదియు లేదు.అపరిచ్ఛిన్న చైతన్యపు అద్భుతమగు అభివ్యక్తం తప్ప.
No comments:
Post a Comment