☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
30. జీవాజ్యోతిరశీమహి
శరీరధారులమైన మేము విశిష్ట జ్యోతిని పొందుదుము గాక(సామవేదం)
మానవ శరీరాన్ని ఒక భోగానుభవయోగ్య వస్తువుగా కాక, అమృతత్వ ప్రాప్తికి సాధనంగా దర్శించారు వైదిక ఋషులు.
'జ్యోతి'ని సాధించడమే జీవిత పరమార్థం.
'దేహమే మనం' అని కాకుండా, దేహం ఆత్మకు ఒక వేదికగా దర్శించడమే
అసలైన దృష్టి. దీనితో భోగాలు అనుభవిస్తూ సమయాన్ని వృధా చేయడం కాదు.
జ్యోతి అంటే కాంతిపుంజం. ఆ కాంతి జ్ఞానానికి సంకేతం. అదే విద్య.
జ్ఞానమయమైన జ్యోతిని సంపాదించడంలోనే భారతీయ తాత్విక చింతన అంతా నిమగ్నమయ్యింది.
(వైరాగ్యం మనస్సుకి క్రమశిక్షణ. ఇది మానసికమైన ఎన్నో రుగ్మతలని
తొలగించగలదు. సత్యం వైపు స్థిరంగా చూపునుంచడమే వైరాగ్యం. అది
జ్ఞానానికి దూరంగా మసలే నైరాశ్యం కాదు.)
భౌతికమైన సంపద్ వృద్ధినీ, లాలననీ నిరసించి, ఆత్మజ్యోతిని ఆవిష్కరించుకోవడమే ఉత్తమపథమని భారతీయ ప్రాచీన మార్గాలన్నీ ప్రబోధిస్తున్నాయి.
విద్య, జ్ఞానం - అనేవి లౌకిక, పారమార్థిక అనే రెండు భేదాలతో ఉంటాయి. ఈ రెండూ అవసరమే. లోకవ్యవహారానికి లౌకిక విద్యల, భౌతిక విజ్ఞానం అవసరమే.అయితే అవి పారమార్థిక ప్రయోజనాన్ని విస్మరించరాదు. దానినిప్రధానోద్దేశంగా
పెట్టుకొని సాగే లౌకిక జీవితం నియమబద్ధంగా ఉంటుంది. ఆ నియమమే ధర్మం.
ఆ ధర్మపాలనకు ఒక సాధనగా ఉపకరించేది శరీరం - అని ఆర్షభావన. అంటే శరీరాన్ని ధర్మానికి పరికరంగా ఉపయోగించాలి తప్ప, భోగానికి వేదికగా కాదనిమన సనాతన మతం.
వ్యక్తికి తాత్కాలిక భౌతిక ప్రయోజనాపేక్ష కాక, శాశ్వత పారమార్థిక ప్రాప్తిపై దృష్టినుంచేదే ధర్మం. ఇది సామాజిక, ప్రాకృతిక భద్రతనీ ప్రసాదిస్తుంది.
ధర్మదృష్టిలేని సమాజం స్వార్థం కోసం ఎంతటి అకృత్యానికైనా తెగిస్తుంది. దాని పరిధి చాలా చిన్నది. భౌతిక విజ్ఞాన విస్తృతి ఔన్నత్యం అనిపించుకోదు. పదార్థాన్నీ,
పరమార్థాన్నీ విస్మరించినప్పుడు భౌతిక ప్రగతి సాధించేది ఏమీ ఉండదు. ఎంత ఎదిగినా ఇంద్రియలాలస తప్పనప్పుడు అది అభివృద్ధి ఎలా అవుతుంది!
ఇది దృష్టిలో ఉంచుకొనే పలువిధాలైన భారతీయ విజ్ఞానం ఒకే పరమార్థం వైపు సాగింది. ఇక్కడ ఏ విద్యకైనా లక్ష్యం - ఆత్మ(సత్య)జ్యోతి సాక్షాత్కారం. ప్రతివిద్యకీ
ధార్మికమైన నియమపాలన అత్యవసరం అన్నారు. ఏ విద్యా ఒక దానికొకకటి విభేదించుకోవు. పైగా పరస్పర సంబంధం కలిగి ఉంటాయి.
జ్యోతిషము, యోగమూ,సంగీతమూ, సాహిత్యమూ, శిల్పమూ, నాట్యమూ,
వైద్యమూ - అన్నీ 'జ్యోతి' సాక్షాత్కారమే పరమ ప్రయోజనం అని చాటి చెప్పాయి.
ఈ దేశం ఆదినుండీ భౌతిక లాలసకి కాక, ఆత్మోన్నతికీ, ఉత్తమ గుణాభివృద్ధికీ ప్రాధాన్యమివ్వడానికి కారణం అదే. జ్ఞానం, వైరాగ్యం కలిసి మెలసి ఉండవలసినఅవసరం ఉంది.
వైరాగ్యం మనస్సుకి క్రమశిక్షణ. ఇది మానసికమైన ఎన్నో రుగ్మతలని
తొలగించగలదు. సత్యం వైపు స్థిరంగా చూపునుంచడమే వైరాగ్యం. అది జ్ఞానానికి దూరంగా మసలే నైరాశ్యం కాదు.
జ్ఞానంతో సహవాసం చేసే వైరాగ్యమే మనిషిలోని స్వార్థ సర్పఫణాచ్ఛాయ (స్వార్థమనే పాము పడగనీడ) సమాజం మీద పడకుండా చేస్తుంది.
సత్యజ్యోతి వైపు సాగే జీవనపయనమే ధర్మంతో జత కలిసి, జ్ఞానదృష్టితో కూడిన వైరాగ్యం. ఇది అభివృద్ధిని నిరోధించదు. దానికొక దిశను, గమ్యాన్ని నిర్దేశిస్తుంది.
గమ్యమే జ్యోతి (సత్యం, ఆత్మసాక్షాత్కారం)గా స్పష్టపరచింది వైదికమతం.
No comments:
Post a Comment