*ప్రయత్నం-అప్రయత్నం*
ఎవరికి సాక్షాత్కరించాలో...
ఆత్మే ఎన్నుకొంటుంది అన్నది కఠోపనిషత్తు....
ఆ వాక్యం చాలా అద్భుతమైనది....
ఆ ఎన్నుకోవడం మన ప్రయత్నాలతో...
సాధనలతో ముడిపడి లేదు.
భక్తులు చెప్పే "భగవదిచ్ఛ"అనే మాట కూడా...
దానికి సరిసమానమైనదే.
ఏ అర్హతా లేకపోయినా...
అనుగ్రహించే నియంత భగవంతుడు.
అయినప్పటికీ...
అర్హతను బట్టి అనగా సాధనను బట్టి కూడా... భగవంతుడు అనుగ్రహించిన ఘటనలు లేకపోలేదు...
ఆత్మ చేత మనం ఎన్నుకోబడడానికి...
మనకు ఉండవలసిన అర్హత - ఆర్తి, శ్రద్ధ...
పువ్వులో మకరందం ఉంటే...
భ్రమరం దానికదే వచ్చి ఆస్వాదిస్తుంది...
మనలో ఆర్తి ఉంటే...
ఆత్మ దానికదే వచ్చి ఆవహిస్తుంది...
లావొక్కింతయును లేదు...
అని గజేంద్రుడు మొరపెట్టినప్పుడు...
సిరికి కూడా చెప్పకుండా...
పరుగున వచ్చి కాపాడాడు మహావిష్ణువు...
నీ ఆర్తి నిజమే అయితే....
భగవంతుడు నీ ఇంటి పై కప్పు పగలుగొట్టుకొని మరీ నీ ముందు సాక్షాత్కరిస్తాడు.
నాకు శ్రద్ధ ఉందిగానీ గురువు దొరకలేదు...
అన్నమాట కూడా సరికాదు.
గురువు దొరకడమే నీకు శ్రద్ధ ఉన్నందుకు గుర్తు.
శ్రద్ద ఉన్నప్పుడు...
నీవున్న చోటుకే వచ్చి నిన్ను అనుగ్రహిస్తాడు గురువు.
అంతేగాని దారినపోయేవాళ్లందరినీ పిలిచి బోధించడు.
అలాంటి విధి, కర్తవ్యం ఏ గురువుకూ లేదు.
అడగండి ఇవ్వబడుతుంది అంటారు క్రీస్తు.
అడిగి పొందినవాడు - శ్రీరామకృష్ణులు.
అడగకనే పొందినవాడు - అరుణాచల రమణులు.
ఆత్మే ఎన్నుకొంది రమణుణ్ణి.
రామకృష్ణులే ఆత్మను పొందారు ప్రయత్నంతో.
ఇద్దరి శైలి వైవిధ్యమైనది.
అందువల్లనే ఇరువురు ఆత్మసాక్షాత్కారానికి చెప్పిన ఉపాయాలు వైవిధ్యంగానే ఉంటాయి.
"ఊరికే ఉండు" అన్నారు రమణులు.
"కామినీకాంచనములు జయించు" అన్నారు రామకృష్ణులు.
ఒకటి అప్రయత్నం.
మరొకటి ప్రయత్నం.
రెండూ సరియే ఆత్మవస్తువు దొరకడానికి.
రెండూ గురియే జ్ఞానఫలాన్ని కొట్టడానికి.
మన సాధనను బట్టి దైవానుగ్రహం లభిస్తుందా?
దైవానుగ్రహాన్ని బట్టి మన సాధన ఉంటుందా?
అని అడిగితే తేల్చి చెప్పడం కష్టం.
రెండూ సరియే.
మొదటివారు కర్మయోగులు.
రెండవవారు భక్తియోగులు.
ఒకడికి కర్మే భక్తి.
మరొకడికి భక్తే కర్మ.
No comments:
Post a Comment