*చంద్రుఁడు:*
ఒక గ్రహము. అత్రి కొడుకు. తల్లి అనసూయ. ఇతఁడు నక్షత్రములకు, బ్రాహ్మణులకు, ఓషధులకు, యజ్ఞములకు, తపస్సుకు అధిపతి. ఈతనికి దక్ష ప్రజాపతి కొమార్తలు అగు అశ్విన్యాదులు ఇరువదియేడుగురు భార్యలు అయిరి. అందు రోహిణి ప్రియభార్య. వీరినే నక్షత్రములు అందురు. చంద్రునికి బృహస్పతి భార్య అగు తారయందు బుధుఁడు పుట్టెను. ఇందుఁడు, సోముఁడు ఇత్యాదులు చంద్రునకు నామాంతరములు. చంద్రుఁడు సముద్రమథనమప్పుడు పాలసముద్రమునందు పుట్టెను అనియు పురాణములు చెప్పుచున్నవి. (ఇది కల్పభేదమువలన కలిగినది అని కొందఱు చెప్పెదరు.) మఱియు ఇతనియందు కుందేలు ఉన్నది అనియును జింక ఉన్నది అనియును కావ్యములయందు వర్ణింపఁబడుటచేత ఇతనికి శశాంకుఁడు, మృగాంకుఁడు అను నామములును కలవు. అమృతకిరణుఁడు అగుటచే ఇతని కిరణములను దేవతలు పానము చేయుదురు. కనుక విధుఁడు అనియు అనఁబడును. అందఱు భార్యలందును సమముగా ప్రవర్తింపక రోహిణియందు మాత్రము ప్రీతి గలవాఁడైనందున దక్షుఁడు ఇతనికి క్షయరోగము కలుగుఁగాక అని శపించెను.
No comments:
Post a Comment