Monday, December 16, 2024

 *ఇంద్రుఁడు:*

దేవతలకు రాజు. పూర్వదిక్పాలకుఁడు. ఇతఁడు కశ్యపప్రజాపతికిని అదితికిని పుట్టిన కొడుకు. ఈయన రాజధాని - అమరావతి, ఆయుధము - వజ్రము, భార్య - శచీదేవి, ఏనుఁగు - ఐరావతము, సభ - సుధర్మ, గుఱ్ఱము - ఉచ్చైశ్రవము, సారథి - మాతలి, ఉద్యానవనము - నందనము, కొడుకు - జయంతుఁడు.

ఒకప్పుడు ఇంద్రునకు కీడుచేయతలంచి త్వష్ట మూఁడుతలలవానిని ఒక్కని సృజియించి విశ్వరూపనామధేయుంజేసి పంపఁగా అతఁడు ఇంద్రపదవికోరి ఘోరతపంబు చేయుచు ఉన్నదానికి భయంపడి ఇంద్రుఁడు అతనిని తెగఁజూచెను. (ఈబ్రహ్మహత్యపాపమును ఇంద్రుఁడు ఒక విషమవ్రతంబు ఆచరించి సముద్ర, తరు, ధరణీ, స్త్రీ జనంబులయందు విభాగించి పెట్టెను. అది సముద్రమందు నురుగు, చెట్లయందు బంక, భూమియందు చవుఁడు, స్తీలయందు రజస్సును అయి ఉండు.) అంత త్వష్ట మిగుల అలిగి ఇంద్రుని మ్రింగజాలెడు వానిని ఒక యసురుని వృత్రుఁడనువాని పుట్టించి వానిని తన తపోమహిమచే మహాతేజోవంతునిజేసి ఇంద్రునితో యుద్ధముచేయ పంపఁగా వాఁడు పోయి ఇంద్రుని మ్రింగెను. అపుడు ఇంద్రుఁడు తన శరీరమును సంకుచితముగా చేసి వెడలివచ్చియు వాని తేజస్సును చూచి వెఱచి వృత్రునితోడ సఖ్యంబుకల్పింప మునిగణంబులను పంపెను. అంత వృత్రుఁడును మునిజనంబులచే ఆర్ద్రంబైనదానను, శుష్కంబైనదానను, తరువునను, పాషాణమునను, అస్త్రశస్త్రంబులను, దివంబునను, నిశిని వధ్యుండు కాకుండునటుల వరముపొంది ఇంద్రునితో మిత్రభావంబును చెందియుండెను. పదపడి ఇంద్రుఁడు ఒకనాడు సంధ్యాకాలమున సముద్రతీరమున వృత్రునితోడ విహరించుచు ఉండునపుడు ఆర్ద్రమును శుష్కమునుగాని సముద్రపునురుగును తన వజ్రాయుధమునందు చేర్చి తనకు సహాయముగ విష్ణువు అందు ప్రవేశింపఁగా రేయిను పగలునుగాని సంధ్యాసమయంబున ఆయసురుని చంపెను. అట్లు శత్రుసంహారము చేసినను అది కపటస్వభావంబున కావించిన వధంబుగాన ఇంద్రునకు బ్రహ్మహత్యాపాతకంబు సంప్రాప్తంబై దేవరాజ్యమునకు అర్హుఁడు కాకపోయెను. అప్పుడు కొంతకాలము నహుషుఁడు ఇంద్రత్వమును పొంది దేవరాజ్యమును పాలించుచుండెను. పిమ్మట ఇంద్రుఁడు అశ్వమేధయాగముచేసి యా బ్రహ్మహత్య పోఁగొట్టుకొని దేవరాజ్యాధిపత్యమును మరల పొందెను.

మఱియు ఇంద్రుఁడు గౌతమముని భార్యయయిన అహల్యతో జారత్వము చేసినందున గౌతమమహర్షి ఇంద్రునిదేహమున సహస్రయోనులు ఏర్పడునట్లును వృషణహీనుఁడు అగునట్లును శపియించెను. అంత ఆఋషిని ఇంద్రుఁడు మిగుల వేడికొనఁగా అతఁడు అనుగ్రహించి చూచువారికి ఆయోనులు కన్నులుగా అగపడునట్లు ప్రసాదించెను. అది కారణముగ ఇతఁడు సహస్రాక్షుఁడు అనఁబరఁగె. మఱియు దేవతలు ఇంద్రునకు నిర్గతములైన వృషణములకు బదులు మేషవృషణములను తెచ్చి అంటించిరి అని పురాణప్రసిద్ధి. దీనినిబట్టియే ఏదేని తొందర పొసఁగినప్పుడు ఇదియేమి మేషాండము అని జనులు వాడుదురు.

తొల్లి పర్వతములకు అన్నిటికిని ఱెక్కలు కలిగి ఉండెను అనియు, వానివలన కలిగెడు బాధల సహింపఁజాలక ఇంద్రుఁడు ఆఱెక్కలను తెగఁగొట్టెను అనియు పురాణ ప్రసిద్ధి కనుక ఇంద్రునకు గోత్రభిత్తు అను పేరు కలిగెను.

చ్యవనుఁడు అశ్వినీదేవతలకు యజ్ఞభాగమును కల్పించినపుడు ఇంద్రుఁడు అతనిపై వజ్రాయుధము వేయఁబూనఁగా అది ఆ ఋషి తపోమహిమవలన ఇంద్రునిచేయి వదలదయెను. కనుక ఇంద్రునికి దుశ్చ్యవనుఁడు అను పేరుకలిగెను. ఈతఁడు వాస్తుశాస్త్రమునకు అధిదేవత.

No comments:

Post a Comment