Monday, December 2, 2024

 *కన్నయ్యమీదే ఎందుకంత ప్రేమ?* 
   🌱🌿🎋

ఆళ్వార్లందరు కృష్ణావతారం లోనే ఎందుకు అంతలా మునిగి తేలారు? రామావతారం కదా,  తాను నరుడిగానే అవతారమెత్తి, సామాన్య మానవుడిగా జీవించి చూపినది. రాజపట్టాభిషేకానికి తయారయ్యే  క్షణంలో అన్నిటినీ త్యజించి అడవికి వెళ్ళడం, పిరాట్టి వియోగం, కాలినడకన సముద్రమునుదాటి రావణాసుర వధ, అందునా రామ రావణయుద్దం, అన్నట్లు భయంకర యుద్దం. మరి రామావతారముకదా, చాలా గొప్పది.

మరి ఆళ్వార్లు కృష్ణావతారములో ఎందుకు అంతలా ఆర్ద్రత చూపుతారు?  రాముని తలవంగానే రాముడు పడిన కష్టాలే గుర్తుకువస్తాయి. కృష్ణుని తలవంగానే మనస్సు తేలికైపోయి మన పెదవులమీద చిరుదరహాసం వెలుగుతుంది! ఏమిటీ వింత?   మన పూర్వాచార్యుల సమాధానమేమిటి దీనికి !


రాములవారు అవతరించినది మహా రాజ వంశములో.    దశదిశలా రథగమనముచేసే దశరథుని జ్యేష్ఠపుత్రునిగా! రాజ్యమంతా కోలాహలము, మాణిక్యపుటూయల!పట్టుపరుపులు! అంతా ఆర్భాటమే! రాజ్యమంతా పండుగే! 

రాకుమారుడిగా బాల్యము.  సీతారామ కల్యాణము! తరవాత వనవాసము.

వనవాసములో జానకీమాత తన నాథుడితో పరిపూర్ణ సాంగత్యాన్ని ఆనందాన్ని అనుభవించినది. ఏకాంత అనుభవము ఇద్దరికీ!

ఆఖరు పదినెలలు రావణాసుడి చెరలో పిరాట్టి- రామవియోగముతో, రాములవారు - సీతా వియోగముతో  దుఃఖించారు.      తరువాత తిరిగి అయోధ్యచేరడము పట్టాభిషేకము , రామరాజ్యము !

మరలి వైకుంఠానికి వెళ్ళడము , పుల్లెరుంబాదిగళెల్లాం — అంటూ చరాచరముట్రవుం — కోలాహలంగా  చరాచరములను కూడా తనతో తీసుకొని వెళ్ళిన వైనము !

ఎక్కడా ఒంటరిగా విడువబడలేదు . గుహుడు, సుగ్రీవుడు, విభీషణుడు, నీడలా నిలచిన లక్ష్మణుడు! బంటుగా నిలిచిన హనుమ!  యుద్దంలోనూ దేవతల సహకారము, రథము , మాతంగుడు, గరుడుడు!

ఎప్పుడూ  కూడి ఇరుందు కుళిర్ న్దు  — అంటే కృష్ణునికంటే రాములవారికే ఆ భాగ్యము .

కన్నయ్య అవతరణము  చెఱసాలలో, కలకండ పంచే వారూ లేరు ! నల్లని చీకటి , కార్మేఘవణ్ణన్ - శిశువు ! చతుర్భుజములతో వెలిగే శంఖుచక్రములతో విలసిల్లినందువల్ల ,  శిశువును చూడగలిగారు దేవకీ వసుదేవులు! పోనీ అక్కడన్నా తల్లి పొత్తిళ్ళలో హాయిగా వున్నాడా! లేదే ! కారుమబ్బులు , కుంభవృష్టి , యమునానది దాటిస్తున్నప్పుడు చలిగాలులు !

వెళ్ళి గోకులములో యశోదపక్కన చేరారు! రాజవంశపు బిడ్డ ఆవులను మేపుకొని పాలుపితికి —- అడవులంట కోనలంటా తిరిగి —- పోనీ అలా అన్నా సుఖంగా వున్నాడా ? 

పసిప్రాయములోనే తల్లిగావచ్చి రాక్షసి పాలిచ్చి చంబోయిందా! శకటాసురుడు దొర్లుకొంటూ వచ్చాడా, వృత్తాసురుడు, కపిథ్థాసురుడు, బకాసురుడు,  ఎప్పుడు ఏ రూపములో రాక్షసుడు ప్రత్యక్ష మౌతాడో తెలియదు. ఆయుధాలులేని రిక్త హస్తము , ఊనషోడషవర్షాయ - అంటాడే దశరథుడు రాములవారిని, ఇక్కడ కన్నయ్యో… పసితనపు ఛాయలు కూడా పోని వయస్సులో , ఎంతెంతమంది రాక్షసులతో , ఆయుధాలేమీ లేకయే ఎదిరించడము !

ఆఖరికి సహాయముకోరిన దేవతలే శత్రు రూపములో ప్రత్యక్ష మయ్యారే ! ఇంద్రుడు రాళ్ళవర్షము కురిపించడమేమిటి  మొత్తము గోకులముపైనా! బ్రహ్మ గోపబాలురను మాయము చేయడమేమిమిటి ? కాళీయమర్థనము ? ఎంత పసిబాలుడు! 

అవతరించంగానే కన్నతల్లిని వదిలి గోకులానికి వచ్చారు, పదోవయస్సులో అదీ వదలి మధురకు వచ్చారు ! మధురనుంచి  సాందీపుని వద్దకు వెళ్ళారు ! మళ్ళీ మధురకు.
జరాసంధుడి దండయాత్రలను తప్పించి ప్రజలను కాపాడడానికి , ద్వారకకు వెళ్ళారు! 
పోనీ అక్కడాస్థిమితంగాలేరు  !పాండవులకోసరమని ఇంద్రప్రస్థానికి వెళ్ళారు! యుద్దమో కురుక్షేత్రములో ! ఓరీతిగా హమ్మయ్య ముగిసిందనే లోపల సముద్రము ద్వారకను ఆక్రమిస్తుందని ప్రాభాసానికి వెళ్ళారు . ప్రాభాసములోనూ —- వున్నది చాలు వైకుంఠానికి వచ్చేయ మని బ్రహ్మ పిలిస్తే వైకుంఠానికి వెళ్ళిపోయారు! ఎక్కడైనా స్థిమితంగా వుండగలిగారా??? 


ఎవ్వరూ స్నేహితునిగా కూడనే వుండలేదు ! ఎవ్వరి సహాయముూ ఏ రాక్షసుని ఎదిరించినప్పుడూ లేదు! 

రాములవారికి ఒక్కొక్క తమ్ముడూ ఒక్కొక్కసేన ! కన్నయ్యకో వున్న ఒకే ఒక అన్న ! బలరాముడు!!! 
మహాభారత యుద్ధం వచ్చినప్పుడు తమ్ముని వదిలి తీర్థయాత్రంటూ వెళ్ళిపోయాడు! 

పోనీ బుద్దిమతి చెప్దామని తానేసంకల్పించి అర్జునునికి చెప్పినా — ‘మామేకం శరణం వ్రజ’ - అన్నా అర్థంచేసుకొని శరణాగతి చేసాడా!! లేదే ! విశ్వరూపముచూపినా,  తన బావే ననుకొన్నాడాయె !
వారికోసరము అతినీచమైన దూతగా కూడా వెళ్ళాడే ! యుద్ధములో నైనా ఆయుదాలు ధరించగలిగాడా! ఎవడో దుర్మార్గుడడిగాడని ఆయుధాలు లేకుండా రథసారథిలా కాళ్ళతో రథి తన్నిన దిక్కుకు రథమును తోలుతూ! అంతా అర్జునుడి పరాక్రమమే అన్నట్లుగ తానే రథచాలనములో అతనికి విజయమును చేకూర్చి , తాను విజయుడయ్యీ, అర్జునునికి విజయుడిని పట్టముకట్టి , తాను పార్థ సారథి అయ్యాడే!!!

అందరూ ఆడిపోసుకొన్న వాళ్ళే ! గోకులములోని వనితలు పాలు పెరుగు దొంగ అన్నారా? శిశిపాలుడు 100 తిట్లు తిట్టాడా ! దుర్యోధనుడు !!! ఎందరిచేత అవమానించ బడ్డాడు!

వైకుంఠానికి తరలి వెళ్ళడము ? ఎవరైనా చూశారా? ప్రక్కన వున్నారా ఎవడికో వరమిచ్చానంటూ అతని బాణపు ములుకు సాకుగా , దెబ్బ తిన్నట్లు — వైకుంఠము చేరారుకదా ! అవతరించిన దినమునుండి కష్టాలనుభవించినది కృష్ణయ్యే ! ఆఖరుకి అతిగా ప్రేమించే తల్లీ రోటికి కట్టి పడేసిందా !!!

అందుకే ఆళ్వారాచార్యులకు కృష్ణుని యందు పరమ ప్రీతి ! 

అంతెందుకు! కృష్ణావతారములో తన భక్తుల రక్షణలో అమితానందము పొందాడు కన్నయ్య! వారి స్పర్శ, ప్రేమ వారిని ఎంతలా ఆకట్టుకొందంటే ప్రళయజలధిలోనూ తాను చిన్ని కన్నయ్యగానే దర్శనమిచ్చాడు!!! 

అందుకే సౌలభ్యపరాకాష్టగా ఆళ్వారాచార్యులు ఈ అవతారాన్ని అందులోని పరమాత్మ గుణాను భవాలనూ అంతగా జుర్రుకొన్నారు ! తన్మయులయ్యారు.

“పత్తుడై ఎళియవర్కు ఎళియవన్“                                                      “వెణ్ణైయుండవాయన్ “ “ కణ్ణన్ కழలిణ —- తిణ్ణం నారణమే॥

 జగద్గురువు ! మన చిన్నికన్నయ్య ! అదీ కృష్ణానుభవములోని అమృతము 
.          * శ్రీకృష్ణార్పణమస్తు*.                      

No comments:

Post a Comment