Monday, December 2, 2024

 *✍🏼 నేటి కథ ✍🏼*

*స్నేహం*

శాంతిపురంలో రాము, సోము, ఆది అనే పిల్లలు ముగ్గురూ మంచి స్నేహితులు. ఒకరి కష్టసుఖాల్లో ఒకరు పాలు పంచుకుంటూ, శాంతిపురం వీధుల్లో సంతోషంగా ఆటలాడుతూ ఉండేవాళ్ళు. బడిలోనూ, బయటాకూడా ముగ్గురూ ఒక జట్టుగా ఉండేవాళ్లు. అయితే, ఇంటి దగ్గర వాళ్ల పరిస్థితులు వేరుగా ఉండేవి.

రాము పేదవాడు. పాపం, చదువుకోవటానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవికావు. రాము తల్లిదండ్రులు ఎలాగో శ్రమ పడి అతన్ని ఎనిమిదో తరగతి వరకు చదివించారు. అయితే అతను ఎనిమిదిలో ఉండగా వాళ్ల నాన్న పాముకాటుకు గురై మరణించాడు. ఇక రాము తల్లి అతన్ని చదివించలేక, బడి మాన్పించి పనిలో‌పెట్టాలనుకున్నది. కానీ రాముకి మాత్రం చదువుకుందామని ఉండేది.

ఇక ఆది, ధనవంతుని కొడుకు. రాము కష్టాలన్నీ తెలుసుకొని, ఆది వాళ్ళ నాన్నని అడిగి ఐదువేల రూపాయలు అప్పుగా తెచ్చి ఇచ్చాడు. దీనికి మొదట్లో ఆది వాళ్ళ నాన్న సమ్మతించకపోయినా, కొడుకు స్నేహపూర్వకమైన హృదయాన్ని అర్థం చేసుకొని, ఉదారంగా అంగీకరించాడు.
సోమూ వాళ్లు మధ్య తరగతి వాళ్లు. సోము చాలా కాలంగా తను హుండీలో దాచుకున్న డబ్బు రెండువేల రూపాయలను తెచ్చి ఇచ్చాడు రాముకు. అలా స్నేహితుల ప్రోత్సాహంతో, రాము తన తల్లిని ఒప్పించి, బడి చదువులు కొనసాగించాడు. కాలం గడిచేకొద్దీ వాళ్ల స్నేహం మరింత బలపడింది. ఆర్థికంగా ఉన్న హెచ్చుతగ్గులు వాళ్ళ మనసుల్ని ఏమాత్రం మలినం చేయలేక పోయాయి.

బడి చదువులు ముగిసిన తరువాత ముగ్గురు స్నేహితులూ విడిపోయారు. రాము పై చదువులకు ప్రభుత్వం వారి ఉపకార వేతనం లభించింది. ఇక సోము, ఆది వేరు వేరు చోట్ల చదువులు కొనసాగించారు. చదువుల పట్ల శ్రద్ధతో బా‌ధ్యతగా వ్యవహరించిన రాము డిగ్రీ పూర్తి చేసుకొని, ఆపైన సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి ఐఏఎస్ అధికారి అయ్యాడు. సోమూ ఇంజనీరయ్యాడు; ఆది తండ్రి వ్యాపారాన్ని కొనసాగించాడు.

'నేను అనుభవించిన దారిద్ర్యాన్ని ఏ పిల్లలూ అనుభవించకూడదు' అన్న భావనతో రాము ప్రభుత్వబడులకు ఎన్నో వసతులను ఏర్పరచాడు; పేద పిల్లలకోసం హాస్టలు వసతులు ఏర్పాటు చేశాడు; పిల్లల విజ్ఞానాభివృద్ధికోసం లైబ్రరీలు, ప్రయోగశాలలు ఏర్పరచాడు; పిల్లల శారీరక శిక్షణకోసం ఆటస్థలాలను ఏర్పాటు చేయించాడు. తాను చిన్నప్పుడు ఆది వద్ద, సోము వద్ద తీసుకున్న అప్పును తిరిగి చెల్లించటంకోసం తమ ఊరికి వెళ్లిన రామూ మంచితనాన్ని అందరూ ప్రశంసించారు.
సోము,ఆది అన్నారు -"రామూ! మన స్నేహాన్ని చెడగొట్టాలని ఆ రోజుల్లోనే ఎందరు అడ్డుపడినా, మనం మాత్రం విడిపోలేదు. మన మధ్యనున్న నమ్మకం, ప్రేమ అలాంటివి. అలాంటి మన మైత్రిని డబ్బుతో వెలకట్టకు. ఈ డబ్బును వేరే పేద పిల్లలు చదువుకునేందుకు గాను నీకు నచ్చినట్లుగా ఖర్చు చెయ్యి. నీ కృషికి తోడ్పాటుగా మేం మరింత ధన సహాయం చేసేందుకు కూడా సిద్ధం!'అని.
అలా ముగ్గురు స్నేహితులమధ్య మైత్రి మరింత బలపడి, సమాజ శ్రేయస్సు దిశగా పయనించింది. వీరి స్నేహం ఆదర్శంగా మరెందరో మిత్రులు తయారవ్వాలని ఆశిద్దాం.

*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

No comments:

Post a Comment