Monday, December 2, 2024

 నారద భక్తి సూత్రములు 
         54 వ సూత్రము 
"గుణ రహితం, కామనారహితం, ప్రతిక్షణ వర్థమానం 
అవిఛ్చినం సూక్ష్మతరం అనుభవరూపం"  
ఈ భగవత్ ప్రేమ త్రిగుణాతీతము, ఈ ప్రేమ కోరికలు లేనిదీ,క్షణం క్షణం ప్రవర్ధమానం అవ్వటం దీని స్వభావం,భక్తి అవిచ్చిన్నమై, భక్తి మనసులో ఉన్నంత సేపు స్థూలంగా ఉండి ,హృదయానికి చెరేసరికి సూక్ష్మతరమవుతుంది. తుదకు పరాభక్తిగా పరిణమిస్తుంది.  ఇది అవిరాళంగా,అవిరామం గా అమృతమై ప్రవహిస్తుంది.ఇది సూక్ష్మాతి సూక్షం,అనుభవైక వేద్యం.అది ఎప్పుడు నిశ్చలంగా,నిర్మలంగా నిలకడగా ఉంటుంది. పొంగుట క్రుంగుట అనేది ఈ భక్తి ప్రేమ ప్రవాహానికి ఉండదు. ఇది సహజ సిద్దమైన భగవత్ ప్రేమ స్వరూపం అందువల్ల ఇది గుణరహితం.
 ఈ దివ్య భక్తి ప్రేమనే ఆత్మగా భావించి ఋషులు ఈలా వివరించారు:
ప్రేమ మూర్తి అయిన ఆత్మ అణువుకంటే సూక్షం,అత్యంత సువిశాలం, ఇది జీవుల హృదయ పద్మంలో అతి సూక్ష్మ రూపంలో ప్రకాశిస్తూవుంటుంది, దీన్ని అనన్య భక్తి ద్వారా శోకరహితులై ,జితేంద్రియులై,కర్మత్యాగులై మాత్రమే దర్శించగలరు.
         55 వ సూత్రము 
"తత్ప్రాప్య తదేవావలోక యతి తదేవ శృణోతి తదేవ భాషయతి తదేవ చింతయతి"

ఈ భగవత్ ప్రేమ ప్రాప్తిఞ్చన భక్తుడు, ఆ పరమ మూర్తేనే వీక్షిస్తూ ఉంటాడు.ఆ మోహనమూర్తి నామ కీర్తనే వింటాడు,ఆ మధుర మూర్తికి సంబంధించిన భాషణలే కావిస్తాడు,ఆ దేవదేవుని దివ్య సుందర పాదారవిందములనే చింతన చేస్తాడు.
దివ్య ప్రేమ భక్తిరసం లో నిమగ్నునైన భక్తునికి సర్వత్రా ప్రేమ స్వరూపుడైన భగవంతుడే కనిపిస్తాడు, మారో ఆలోచన కానీ,వీక్షణ కానీ ఆ మహనీయుడికి ఉండదు.
పరమాత్మ భక్తి లో సర్వం మరిచిన భక్తుడు నిత్య పరిపూర్ణుడు అవుతాడు,లోకం దృష్టి లో జడుడు వలె ఉంటాడు,కానీ అతడు ఆధ్యాత్మికం గా జడత్వం లేని మహోన్నత మూర్తి.           

No comments:

Post a Comment