🌹కుండలిని సిద్ధ మహా యోగము🌹:
వాగ్రూపాలు 4 రకాలు :
పరా - పశ్యంతి - మధ్యమా - వైఖరులు - వైజ్ఞానిక విశ్లేషణ
📚✒️ భట్టాచార్య
వాగ్రూపాలు 4. అవి పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరులు.
పరా వాక్కు : పరావాక్కు స్థానం మూలాధార చక్రం. సహస్రార మధ్యస్త "ఓంకారము" ఆది ప్రణవము. దానికి "సిద్ధి" అని పేరు. ఈ ప్రణవము మూలాధారమందు అవ్యక్త వాక్కుగా నిలచినది. ఈ వాక్కు శక్తికి అభిన్నము. అవికారి, నిత్యమైనది, ఆత్మానుభూతినిచ్చేది. దీనిలో లయమైన ఋషులు జ్ఞానాన్ని పొందారు., ఇందులో లయమైన ఎవరైననూ అపార జ్ఞానాన్ని పొందుతారు. వారు ఋషులే మరి. పరా వాక్కు యొక్క విభిన్న రూపాలే పశ్యంతి, మధ్యమా, వైఖరులు.
పశ్యంతి వాక్కు :
ఈ వాగ్రూపము అంతర విషయ వాసనలను గ్రహిస్తుంది. యోగులకు, జ్ఞానులకు విద్యుత్ రూపంలో దర్శనమిస్తుంది. త్రికాల జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఈ వాక్కు చిత్తములో ఖల విషయ వాసనలను గ్రహిస్తుంది.
వాక్కు లో రెండవ దశ –తక్కువ ఫ్రీక్వెన్సీ(frequency) ,పరా వాక్కు కంటే మరింత సాంద్రీభవించి ఉన్న వాగ్రూపాన్ని 'పశ్యంతి" అంటారు . "మధ్యమా" కంటే మరింత సూక్ష్మంగా ఉండి, వినడానికి వీలు లేనిదానినే "పశ్యన్తి వాక్కు" అంటారు .పశ్యంతి అంటే సంస్కృతం లో చూడగలిగినది లేక ఊహించ గలిగినది అని అర్ధం .పురాతన గ్రంథాలలో శబ్దం అనుభవైక వేద్యం... అంటే తెలియ దగినది అని ఉన్నది .శబ్దాన్ని ఎలా చూడగలం ?మనం ఎప్పుడైనా కలలో శబ్దం విన్నామా ? ఈ ప్రత్యేక పరిమాణం కల శబ్దాన్నే, కలలో వినబడే శబ్దాన్నే పశ్యంతి అన్నారు .నిజంగా ఇది మానసిక శబ్దం .ఇది చేతన ,పాక్షిక అచేతన స్థితులలో వినిపించనిది .అది ఉప చేతన(సబ్ కాన్షస్ ) శబ్దం .అది మన మానసిక నాణ్యత కు చెందినదే కానీ... పంచేంద్రియ నాణ్యత లకు అంటే నాలుక ,గొంతు ,నోరు ల నాణ్యతలకు అందనిది .
మనం "రామ... రామ..." అంటూ ఉంటే... అది వైఖరి నాదం .మనం మన కళ్ళు ,నోరు లను మూసుకొని ఆ నామాన్ని మానసికంగా ఉచ్చరిస్తే అది మానసికంగా రంగు ,రూపాలను అంతరిక లోచనం తో దర్శించటమే "పశ్యంతి వాక్కు" .బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా వినగలిగిన శబ్దమే పశ్య౦తి .బయటి శబ్దాలన్నీ అంతరించి పోయి , ,పూర్వానుభవ శబ్దాలకంటే వినబడే భిన్నమైన ఒక కొత్త వింత నాదమే "పశ్యంతి" .
మధ్యమా వాక్కు :
పరా ,పశ్యంతి ల కంటే తక్కువ ఫ్రీక్వెన్సీలు (frequencies) కలిగి ,వైఖరి వాక్కు కంటే మరింత సూక్ష్మమైనది, మధ్యమ వాక్కు .వైఖరి శబ్దం మిక్కిలి సూక్ష్మ అభివ్యక్త ధ్వని. కానీ మధ్యమా, వైఖరుల కంటే మరింత సూక్ష్మమైన నాదం .గుసగుస శబ్దంగా వినిపించేది మధ్యమ శబ్దం .అది వినికిడి ప్రభావం చూపలేదు .మధ్యమ శబ్దం లో అతి తక్కువ కంపనాలు కలిగి గుస గుస శబ్దమే వినిపిస్తుంది .రెండు వస్తువుల ఘర్షణ వలన శబ్దోత్పత్తి జరుగుతుంది .కాని "మధ్యమా నాదం" లో ఏ రెండు వస్తువుల తీవ్ర రాపిడి వలనకూడా వినబడేటంత శబ్దం జనించదు. "ఠక్ ఠక్" అనేట్లు శబ్దం పుట్టించితే, దాన్ని స్థూల శబ్దం అంటారు . మధ్యమ అంటే మధ్యగా ఉన్నశబ్దం .... .రెండిటికి మధ్య గా ఉన్నదే లేక మధ్యలో ఉన్నదే, "మధ్యమా" .మధ్యమా శబ్దమే గుసగుసలుగా వినిపిస్తుంది . ఇది ఆకాశంలో సంచారం చేస్తూ ఉంటుంది. నిరంతర జప శీలుర పరిణతుల స్థాయిని బట్టి ఇది ఆకాశంలో వ్యాప్తి చెందుతుంది. సాధకుల/యోగుల స్థాయిని బట్టి, కొన్ని ఆమడలు, సూక్ష్మ దేహాన్ని దాటి వ్యాప్తి చెందుతుంది.
వైఖరి వాక్కు :
నాలుగవ వాక్ దశనే "వైఖరి" అంటారు . "వైఖరి" లో శబ్దం వినిపిస్తుంది ,ఉత్పత్తి అవుతుంది కూడా .మనం మాట్లాడే భాష అంతా వైఖరి యే.....వైఖరీ వాక్కు కఠినంగా ఉంటుంది. కఠోరంగా కూడా ఉంటుంది. రెండు వస్తువుల ఘర్షణ వలన వైఖరి "శబ్దోత్పత్తి" జరుగుతుంది .వీటి ఫ్రీక్వెన్సీలు(frequencies) ఒక నిర్దుష్ట పరిమితిలో ఉంటాయి .
మొత్తం మీద మనకు తెలిసింది ఏమిటి అంటే –పరా అంటే ఆత్మ నాదం .మధ్యమ అంటే స్వర అవయవాల సూక్ష్మమైన నాణ్యత .వైఖరి కూడాభౌతిక అవయవాల వలన ఏర్పడిన సూక్ష్మ శబ్దమే .
నిత్యమైన శబ్దబ్రహ్మం మనం నోటితో ఉచ్చరించి, చెవులతో వినే లౌకిక శబ్దంగా పరిణమించడంలో నాలుగుదశలు చెప్పారు.
1.పరా, 2. పశ్యంతీ, 3.మధ్యమా, 4. వైఖరీ.
పరా పశ్యంతీ దశలలోని శబ్దాన్ని ఉన్నత స్థాయి యోగులు తప్ప మన సాధారణ ఇంద్రియజ్ఞానంతో మనం గ్రహించలేకపోచ్చును. జపాదులవల్ల మధ్యమాదశలోని వాక్కును గుర్తించవచ్చును. ఇక వైఖరీవాక్కు ఒక్కటే మనకందరికీ తెలిసింది.
పరావాక్కు నిత్యతత్త్వం :
శబ్దబ్రహ్మము మూలాధార చక్రంలోని కుండలిని దానిస్థానం. దీనినే 'నాదం' అనికూడా అన్నారు. పశ్యంతీ వాక్కు బొడ్డుదగ్గర ఉండే స్వాధిస్థాన చక్రంలో ఉంటుంది. ఈ పరా, పశ్యంతీ వాక్కులు రెండూ సూక్ష్మస్ఫోట. హృదయ ప్రదేశంలోని అనాహత చక్రం మధ్యమా వాక్కుకు నెలవు. కంఠ ప్రాంతంలోని విశుద్ధ చక్రంలో ఆవిర్భూతమయ్యే వైఖరీవాక్కు బాహ్యము.
వాక్ప్రపంచం మొత్తంలో నాల్గవ వంతు మాత్రమే మానవులమైన మనం వింటున్నాం. కాని, వృక్షాలు (Plant Kingdom) పరావాక్కును, పక్షులు - పశ్యంతీ వాక్కును, జంతువులు (Animal Kingdom) మధ్యమా వాక్కును కూడా వినగలవు!
వాక్ప్రపంచంలో నాల్గవ వంతు మాత్రమే మనుష్యులు వినగలరు. అన్నట్లు గానే, భౌతిక ప్రపంచం మొత్తంలో నాల్గవ వంతు మాత్రమే మనుష్యులు చూడగలిగేది .మిగిలిన మూడు భాగాలు లోపలే వుంటాయి' అని పురుష సూక్తం చెబుతోంది.
వాక్కు కు సంబంధించిన నాలుగు స్థితులను ఆధునిక మానవునికి గాని, శాస్త్రజ్ఞానికి గానీ అర్థమయ్యేలాగా చెప్పాలంటే క్రింది ఉదాహరణ చెప్పుకోవచ్చును.
ఒకడు ఒక పుస్తకాన్ని చూశాడు. వెంటనే ఇది ఒక పుస్తకము అని చెబుదామనుకున్నాడు. ఇలా చెబుదామనుకున్న సంకల్పం ఉచ్చరించే వాక్కు రూపంలో వుంది. ఈ స్థితిలోని వాక్కును "పరా వాక్కు అంటారు. దీన్ని ' సంకల్పం గా గాని 'ఉచ్చరించేవాడు (బ్రహ్మ) గా గాని సమన్వయ పరచుకోవచ్చును.
సంకల్పం కలగంగానే దాన్ని ఒక 'భావం లోకి మార్చుకోడం జరుగుతుంది. భావంలోకి మార్చబడిన వాక్కును పశ్యంతి వాక్కు' అంటారు..
భావంలోకి మార్చబడిన దాన్ని వ్యక్తం చెయ్యడానికి సంకేతాలతో ఒక 'భాష" లోకి మార్చుకోడం జరుగుతుంది. మనస్సులోనే జరిగే ఈ సంకేతాల భాషారూపంలో వున్న వాక్కును మధ్యమా వాక్కు అంటారు.
మనస్సులో ఒక భాషలో వున్న వాక్కును భౌతికంగా నోటితో ఉచ్చరిస్తే - అప్పుడు వ్యక్తమయ వాక్కును ' వైఖరీ వాక్కు అంటారు. ఈ స్థితిలో వున్న వాక్కునే ఎదుటివారు వినగలరు. ఇంతకు పూర్వం మూడు స్థితులలోని వాక్కును వినలేరు. ఈ నాలుగు స్థితులను వరుసగా - పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరీ వాక్ స్థితులంటారు.
పరాస్థితిని - సంకల్పము గాను, పశ్యంతి స్థితిని - భావము గాను, మధ్యమా స్థితిని సంకేతము గాను, వైఖరి స్థితిని - ఉచ్చారణ గాను - సమన్వయ పరచుకోవచ్చును.
లలితా సహస్ర నామావళిలో, అమ్మవారి ఒక నామం "వైఖరీ రూపా" అని ఉంటుంది.
సాధారణంగా మనిషి 20 Hz నుండి 20,000 Hz ల వరకు మాత్రమే వినగలడు అని ఆధునిక సైన్సు చెబుతోంది. మరి 20 Hz లోపు ధ్వనులను పరశ్రావ్యాలు అని, 20,000 Hz పైగా ఉన్న ధ్వనులను అతి ధ్వనులు అంటారని సైన్సు చెబుతోంది.
మధ్యమా వాక్కు రూపము ఈ 20 hz లోపు, 20,000 Hz పైన ఉండవచ్చును. లేదా పరిశోధనార్హం. ప్రాచీన భారతీయ విజ్ఞానాన్ని-ఆధునిక సైన్సుతో compare చేయాలి. తులనాత్మక విశ్లేషణ చేయాలి.
శబ్దములు కంపనములు కనుక అవి స్పష్టమైన రూపాలను జనింపజేస్తాయి. అదృశ్య జగత్తులో ప్రతి శబ్దం ఒక రూపాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఒక నిర్దిష్టమైన మంత్రాన్ని సరైన రీతిలో, సరైన ఫ్రీక్వెన్సీలో ఉచ్ఛారణ చేసినపుడు, జపించినపుడు... ఏర్పడే శబ్ద తరంగాల ప్రకంపనాలు అత్యున్నత దశలో ప్రత్యేకమైన దేవతా రూపాలను సృజిస్తాయి.
వాక్కు దేవతా రూపం. కాబట్టి వాక్కును జాగ్రత్తగా ఉపయోగించాలి.
శబ్ద బ్రహ్మము నుండి పుట్టిన పరా వాక్కు, మరల పశ్యంతిగా ఆవిర్భవించింది. మరల మధ్యమగా మారి వైఖరిగా విస్తరించింది.
పరా-పశ్యంతి-మధ్యమా-వైఖరికి సంబంధించి మరొక కోణం చూద్దాం. మొదట మనకు సంభాషణ చేయాలి అన్న తలంపు పుడుతుంది. అంటే స్పందన ప్రారంభం అవుతుంది. ఈ శక్తి సహస్రారంలో ఉన్న చంద్ర మండలంలో గల శక్తి. మాటలాడాలన్న ఇచ్ఛా శక్తికి, జ్ఞాన శక్తి + క్రియా శక్తి...తోడవ్వాలి కదా! యోగ పరంగా ఈ స్పందనా శక్తి "ప్రాణ శక్తి". ఈ శక్తిని లలిత గానూ, శబ్ద బ్రహ్మం గానూ భావిస్తారు. సహస్రారంలో పుట్టిన ఈ శక్తి మూలాధారాన్ని చేరుతుంది. మూలాధారం నుండి మరల, ఒకానొక శక్తి రూపంలో పైకి బయలుదేరుతుంది. ఇది వాక్కు యొక్క మూల రూపం. ఈ స్థితిలో ఉన్న శక్తి పేరు "పరా". ఇదే మొదటి వాగ్రూపము. ఈ శక్తి స్వాధిష్ఠానానికి వస్తే, ఆ రూపం "పశ్యంతి". ఈ స్థితిలో శబ్ద శక్తి మనస్సు ఆధీనంలో ఉంటుంది. మనస్సు సంకల్ప వికల్పాత్మకం. ఈ ప్రభంజనంతో ఆ వాగ్రూప శక్తి విశుద్ధ చక్రం వైపుకు పరుగు తీస్తుంది. ఈ విశుద్ధ చక్రం చేరేలోగా...ఈ శక్తిని బుద్ధి అడ్డుకుంటుంది. ఈ స్థాయిలో వాక్కును "మధ్యమా" అంటారు. ఇక్కడ మనస్సు చెప్పే మాటకు బుద్ధి ఒక రూపం కల్పిస్తుంది. భాషా స్వరూపం కూడా ఇక్కడే తయాలవుతుంది. మధ్యమా రూప స్పందనా శక్తి...పూర్తి వాక్య రూపం ధరిస్తుంది. ఇక్కడే అకారాది...క్షకారాంత రూపం తయారవుతుంది. ఇలా పూర్తి అయిన మధ్యమా రూపం విశుద్ధ చక్రం వైపుకు పయనిస్తుంది.
ఈ విశుద్ధ చక్రంలోనే... శబ్ద బ్రహ్మ రూపమైన శక్తి...వైఖరీ వాక్కుగా మారుతుంది. ఇంతవరకు పూర్తి అర్థవంతంగా తయారైన శబ్దం...వరుస క్రమంలో బయటికి వస్తూ...ఒక్కో కండరాన్ని కదిలిస్తూ...మనం వినే శబ్ద రూపంగా బయటకు వస్తుంది. ఏ వైఖరితో రావాలో నిర్ణయిస్తుంది కనుక, ఇక్కడ దీని రూపం "వైఖరీ వాక్కు".
మన ఋషులకు వాక్కు యొక్క నాలుగు రకాలు, నాలుగు దేవతా రూపాలుగా దర్శనమిచ్చాయి.అయితే ఈ వాక్కు అనేది మనుజులకే కాదు. సృష్టిలో స్థావర జంగమాలన్నిటికీ ఉన్నది. రాయి,రప్ప , ఖనిజంలో "పరా" రూపంలోనూ, చెట్టు, చేమ, వృక్షాలలో "పశ్యంతి" గానూ, జంతువులలో "మధ్యమా" గానూ కూడా ఉంటుంది అని అధ్యాత్మ శాస్త్రవేత్తల అవగాహన.
No comments:
Post a Comment