*భగవత్కృపకు మనం పాత్రులమైనప్పుడు మనం చేసే ప్రతీ పని వెనుక ఆయన ఆశీస్సులు తప్పక ఉంటాయి.*
*భగవంతుని ఆశీస్సులను మనం పొందితే ప్రతి చోటుకీ వాటిని తీసుకువెళ్ళగలం.*
*అన్ని సమయాల్లో అవి మన వెన్నంటే ఉంటాయి.*
*ఒకవేళ పొరపాట్లు చేసినా దాని వలన ఏమీ ఇబ్బంది కలగదు. కారణం మనల్ని నిలిపి ఉంచేదాన్ని మనం కనుగొన్నాం గనుక. దీన్ని మనం విశ్వాసం ద్వారానే పొందగలం.*
*కనుకనే విశ్వాసానికి అంత అద్భుతమైన ప్రాముఖ్యత ఉంది. అది చాలా విలువైనది. దాన్ని మనం నిజాయితీ, చిత్తశుద్ధి ద్వారానే పొందగలం.*
*_స్వార్థచింతనే ప్రధాన గుణంగా నడుస్తున్న ఈ రోజుల్లో స్వార్ధమే తనకుతాను పెద్దపేట వేసుకుని దీవిగా కూర్చుంది._*
*_పూర్వం ఏమాత్రం పరిచయం లేని వాళ్లపట్ల కూడా మన పెద్దలు నిజాయతీగా వ్యవహరించేవారు. ఆత్మ వారికి 'ఆత్మసాక్షి 'గా ఉండేది. తప్పుచేస్తే నిలదీసేది. అసలు, తప్పువైపు ఆలోచించనిచ్చేది కాదు._*
*_ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. జీవితం ఆత్మరహితం, ఆత్మీయ రహితమూ అయిపోయింది. అద్దం లాంటి ఆత్మ, స్పటికం లాంటి ఆత్మ మన అనుమతి లేకుండానే మన అవకతవకల్ని ముద్రించుకుంటుంది. ఆ పంధాలోనే మన ప్రయాణమూ సాగుతుంది. ఈ ఆవకతవకల ప్రయాణంలోనే నాకెవరున్నారు అనే ఆలోచనలోంచే నాకెవరూ లేరు అనే అసంతృప్తి మొదలవుతుంది._*
*_నీవెవరికీ ఏమీ కానప్పుడు, ఎవరికోసము ఏమీ చేయలేనప్పుడు నీకు ఎవరు మాత్రం ఎందుకుంటారు.?_*
*_అందుకే... మనం మన పక్కవారి గురించి కొంచెం ఆలోచించాలి. ఎంతో కొంత పంచిపెట్టాలి. వారి అవసరాలు చూడాలి._*
*_ఒకే ఒక్క టెంకలో మొలిచి ఫలించిన మామిడి చెట్టు ఎందుకలా వందలాది పళ్లు కాస్తుంది.!_*
*_విత్తనం నాటినవారి అవసరాలకు సరిపడా కాస్తే సరిపోదా.?_*
*_సరిపోదు.! వాటిని అందరూ పంచుకుతినాలి. మనిషి మామిడి పళ్లతోనే జీవించలేడు. అతడికి ఎన్నో కావాలి. అన్నీ కావాలి... ఇదే పని అందరూ చేయాలి.!_*
*_సమాజం కోసం, లోకం కోసం ఒకే మనిషి అన్ని పనులూ చేయలేడు. అన్నీ ఉత్పత్తి చేయలేడు. కానీ అతడికి ఎన్నో కావాలి. అన్నీ కావాలి. తన అన్ని అవసరాల్ని ఒంటరిగా తీర్చుకోలేడు._*
*_అందుకే ఎవరికి చేతనైనదాన్ని వారు ఉత్పత్తి చేసుకుని దాన్ని అందరూ పంచుకునే అవకాశాన్నిచ్చాడు భగవంతుడు._*
*_ఈ పంచుకోవడమనే ప్రక్రియ, పక్కవాళ్ల కష్టాన్ని పంచుకోవడమనే ప్రవృత్తి- గర్భస్థ శిశువు నుంచే ప్రారంభమవుతుంది._*
*_గర్భంలో ఉన్నది కవల పిల్లలైతే రెండోవాడి అవసరాలు గుర్తించి నడుచుకుంటుందట శిశువు. రెండోవాడి కదలికలకు అనుగుణంగా తాను కదులుతుందట. తల్లికి అధిక ప్రయాసకాని పద్ధతిలో ఆ ఇద్దరి కదలికలుంటాయట. పనినైనా ప్రయాసనైనా పంచుకుని జీవించే తత్వం గర్భస్థ శిశువునుంచే ప్రారంభమవుతుంది._*
*_మరి పెరిగి పెద్దయ్యాక ఏమిటీ స్వార్థం.!! తనదైన విశాలతత్వాన్ని తల్లి గర్భంలోనే వదిలి వస్తున్నాడా మనిషి.? ఇరుకైన తల్లి గర్భంలో విశాలంగా ఉన్న ఆ శిశువుకు ఇక్కడ విశాల ప్రపంచమే ఇరుకైపోయిందా.?_*
*_ఈ ప్రకృతి యావత్తు పంచుకోవడాన్నే సూచిస్తుంది, ప్రోత్సహిస్తుంది._*
*_ఒక కాకి కూడా ఏదైనా ఆహార పదార్ధం దొరికితే ‘కావు కావు ’మంటూ తన బంధుబలగాన్ని ఆహ్వానిస్తుంది. ఉన్నంతలో విందు చేస్తుంది. ఒక కోయిల గూటిలో గుడ్లు పెట్టిపోతే వాటిని పొదిగి పిల్లల్ని అందించే బాధ్యతను తీసుకుని కాకి తన ఔదార్యాన్ని చాటుకుంటుంది._*
*_ఒక పామును మూకుమ్మడిగా కమ్ముకుని కరిచి చంపే సామర్ధ్యమున్న చీమలు కూడా పాముకు నివాసాల్ని ఏర్పాటు చేసి ఇస్తాయి._*
*_మనం మనుషులం.!మనకేమిటి ఇంత లోభం... ఇంత స్వార్ధం.!_*
*_ఆస్తిని విశాలం చేసుకోవడం కాదు. ఆంతర్యాన్ని విశాలం చేసుకోవాలి._*
*_మనిషి మృగ దశ నుంచి మానవుడిగా ఎదిగే క్రమంలో మళ్ళీ మృగమే అవుతున్నాడంటే... మానవుడు మహనీయుడు కావడం లేదు.!_*🤔.
No comments:
Post a Comment