Monday, December 2, 2024

 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍃🌿🍃 🌿🍃🌿 🍃🌿🍃
               *విజయ సారథ్యం*

*లోకంలో ప్రతి మనిషీ తన సంకల్పం సఫలీకృతం కావాలని, తన ప్రయత్నం విజయవంతం కావాలనే ఆకాంక్షను బలంగా కలిగి ఉంటాడు. కృషి ప్రారంభించకుండానే, ఫలితాలను ముందుగానే తమకు అనుకూలంగా ఉంటాయని కొందరు ప్రకటిస్తుంటారు. సర్వసాక్షి, సర్వేశ్వరుడు అహంకారం లేశమంత ఉన్నా సహించడు. ఆ దేవుని ఆత్మకాలుష్యం గిట్టదు. గర్వం తలెత్తినప్పుడల్లా ఎంతటి భక్తుడికైనా గుణపాఠం నేర్పకమానడు. అర్జునుడు, బలరాముడు ఇలాంటి పాఠాలు నేర్చినవారే. మహాశివ భక్తుడైన రావణుడు, అహంకారంతో కైలాసగిరిని తలకెత్తుకుని, తలకిందులు కాక తప్పలేదు. భక్తిలో సర్వశరణాగతి తప్ప ఇంకేమీ ఉండకూడదు. భక్తి ఒక మహామధుర భావన. దానిలో నలుసంత స్వార్థం కలిసినా మాధుర్యం కోల్పోతుంది.* 

*అందుకే సాధకులు, బంగారం కొలిమిలో కాల్చిన విధంగా అనేక కఠిన పరీక్షల్ని తట్టుకుని, చెదరని బుద్ధితో ఉండగలగాలి. దేవుడు మనలను పరీక్షలకు గురిచేస్తున్నాడంటే, ఆయన మనల్నెంతో ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ప్రతి పరీక్షకూ మూల్యాంకనం ఉంటుంది. అది నూటికి నూరు కాగానే ఇక పరీక్షలుండవు. మనం దేవునికి ఆంతరంగికులమైపోతాం. అదృష్టవంతులకు ఆయన నిత్య జీవితంలో ప్రమేయం పెట్టుకుంటున్న సందర్భాలు అనుభవంలోకి వస్తాయి. కొందరు వాటిని తమ అదృష్టమనుకుంటారు.*
 
*దైవానుగ్రహమే మన అదృష్టంగా రూపొందుతుంది. అద్భుతాలు చేయగలవాడు సర్వేశ్వరుడు ఒక్కడే. ఇతరులు గారడీలు మాత్రమే చేయగలరు. గారడీ అంటే భ్రమావిష్కరణ. అది అంతలోనే అదృశ్యమైపోతుంది. మన జీవితంలో ఎక్కువ భాగం నమ్మకం- అపనమ్మకం, సందేహాలు, సంకోచాల ఊగిసలాటలో గడిచిపోతుంది. నిజభక్తులు బహుకొద్దిమందే ఉంటారు. పరమాత్మ ప్రతినిధులుగా ఇహంలో శ్రమిస్తున్నవారంతా అనేక పద్ధతుల్లో పరమసత్యాన్ని, దివ్యజ్ఞానాన్ని అందరికీ అందించాలని ఎంతో శ్రమిస్తూ ఉంటారు. ప్రసాదం రుచికరంగా ఉందని సంబరపడతారేగానీ, అందులోని దివ్య భావనను గ్రహించరు.*

*ప్రసాదం అంటే పరమాత్మ అనుగ్రహం. భౌతిక భావన నుంచి ఆధ్యాత్మికంలోకి వెళ్తే- పరమాత్మ మందహాసం, అనుగ్రహవదనం ప్రసాదంలో అనుభవానికి వస్తాయి. అలా వచ్చినప్పుడు ప్రసాదం దివ్య ఆధ్యాత్మికానుభవాన్ని కలిగిస్తుంది. ఇహానికి ప్రాధాన్యం ఇచ్చినంతకాలం ‘పరం’ అర్థంకాదు. ‘పరం’ అర్థమయ్యాక’, ఇహం’ మీద విరక్తి కలుగుతుంది. ‘భక్తి’ అనే పాయసంలో విశ్వాసమనే కుంకుమపువ్వు రుచి, రంగులీనుతూ ఉంటుంది. అర్జునుడు, దుర్యోధనుడు కురుక్షేత్ర యుద్ధానికి ముందు సహాయంకోసం శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లిన సన్నివేశం ఎన్నో సందేశాలకు నిలయం. ఎక్కడ తప్పుచేస్తాడోనని ముందుగా కోరుకునే అవకాశాన్ని అర్జునుడికే ఇస్తాడు కృష్ణుడు. ఒకవేళ ముందుగా దుర్యోధనుడు తననే కోరుకుంటే, పాండవులు నిస్సహాయులు, వ్యర్థులుకాక తప్పదు, అందుకే, తాను ముందుగా చూశాననే వంకతో అర్జునుడికి అవకాశం ఇస్తాడు.* 

*ఆయుధం ధరించననడం- దుర్యోధనుడిని చిత్తభ్రమకు లోనుచెయ్యడానికే. అతడు దైవస్వరూపుడైన శ్రీకృష్ణుని ఒక సామాన్య వ్యక్తిగా భావించాడు తప్ప జయాపజయాలను శాసించగల సర్వేశ్వరుడిగా గ్రహించలేకపోయాడు. అర్జునుడు అలాకాదు. స్థిరభక్తితో శ్రీకృష్ణుడినే కోరుకున్నాడు. అందుకే అన్నీ తానేఅయి కురుక్షేత్రంలో సంఖ్యాబలం తక్కువగా ఉన్నా పాండవులకు ధర్మవిజయాన్ని అనుగ్రహించాడు. సంఖ్యాబలాన్ని, యోధుల్ని నమ్ముకున్న దుర్యోధనుడు సర్వనాశనం కాకతప్పలేదు. ప్రతి మనిషీ ప్రపంచమనే కురుక్షేత్రంలో రణవీరుడే. నమ్ముకోవాల్సింది ధన, జన బలాలను; అధికార హోదాలను కాదు. అంతరంగంలో కొలువుండి, అనుక్షణమూ మార్గదర్శనం చేయగల దేవుని. ఆయన విజయసారథ్యమే మన జన్మలను సార్థకం చేస్తుంది.*
🍃🌿🍃 🌿🍃🌿 🍃🌿🍃
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*

🌴⛳🌴 ⛳🌴⛳ 🌴⛳🌴

No comments:

Post a Comment