Monday, December 2, 2024

 *మార్పు-పూర్ణం*

ఏ పరిస్థితి వచ్చినా, పోయినా...
వచ్చేదాన్ని పోయేదాన్ని చూస్తూ ఉండండి...
లేదంటే చూడడం మానేయండి...
ఆకాశంలో మబ్బులు వస్తూ ఉంటాయి...
పోతూ ఉంటాయి...
చూడాలనిపిస్తే చూడండి... 
లేదంటే చూడడం మానేయండి...
అంతేగానీ
మబ్బులు రావాలి అనిగానీ...
రాకూడదు అనిగానీ అనుకోవడం యెందుకు?

ఆధ్యాత్మికం అంటేనే... 
లాభనష్టాలు లేని వ్యాపారం...
వ్యాపారం చేయడంవలన లాభమూ లేదు...
చేయకపోవడం వలన నష్టమూ లేదు...
చేయాలనిపిస్తే చేయండి...
వద్దనుకుంటే ఊరికే ఉండండి...

వ్యాపారం చేసేవాడు సాధకుడు...
ఊరికే ఉండేవాడు సిద్ధుడు...

పూర్ణంలో పూర్ణం కలిపినా పూర్ణమే...
పూర్ణంలో పూర్ణం తీసేసినా పూర్ణమే...
పూర్ణం సదా పూర్ణంగానే ఉంటుంది...

ఆకాశం ఒకచోట చిక్కగానూ...
మరోచోట పలుచగానూ ఉంటుందా...
బ్రహ్మమూ అంతే...
ప్రతి అణువూ...
ప్రతిక్షణమూ...
పూర్ణంగా ఉన్నది...

నీ విషయంలోగాని...
జగత్తు విషయంలోగాని...
దేవుని విషయంలోగాని...
నీవిప్పుడు నడుంకట్టి...
మార్పు తేవలసిన అవసరంగానీ...
అవకాశంగానీ...
లేనేలేదు...
ప్రతీది సహజంగా, పూర్ణంగా ఉన్నది...

దేనికీ ఆశ్చర్యపడకు...
దేనికీ సంతోషించకు...
దేనికీ గుండెలు బాదుకోకు...
దేనినీ ప్రేమించకు...
దేనినీ ద్వేషించకు...
దేనినీ సమర్థించకు...
దేనినీ విమర్శించకు...

అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఒకరమే...
అక్కడ ఇక్కడ ఎక్కడా ఏకమే...
కళ్లు తెరిస్తే అనేకం...
కళ్లు మూస్తే ఏకం...
కళ్లు తెరిస్తే ప్రపంచం...
కళ్లు మూస్తే స్వరూపం...

నిద్ర నిన్ను ఆవహించినట్లే...
మెలకువా నిన్ను ఆవహిస్తుంది...
అజ్ఞానము నిన్ను ఆవహించినట్లు...
జ్ఞానమూ నిన్ను ఆవహిస్తుంది...
సాధన నిన్ను ఆవహిస్తే సాధకుడు అవుతావు...
సిద్ధి నిన్ను ఆవహిస్తే సిద్ధుడు అవుతావు...
సాధన చేస్తే చేయి, మానితే మాను...
ఏదీ నీ స్వాధీనంలో లేదు...
అని తెలుసుకుంటే చాలు...
నువ్వు మహాజ్ఞానివే.

No comments:

Post a Comment