*దేవుడు-దైవ సేవ*
దేవుణ్ణి పొందాలి....
అని ఎవరైనా గురువును అడిగితే...
దేవుణ్ణి ఏంచేసుకుంటావు...?
అని అడుగుతారు...
దేవుణ్ణి ఒక్కరోజు భరించగలవా...?
అని నవ్వుతూ ప్రశ్నిస్తారు.
పొద్దున లేచి...
సుప్రభాతసేవ నుంచి...
ప్రతిపూటా నైవేద్యాలు సమర్పించడం నుంచి...
రాత్రి పవళింపుసేవ వరకు...
ఎంత డబ్బు ఖర్చు అవుతుంది...?
ఎంత సమయం కేటాయించాలి...?
నీవు చేసే ఉద్యోగం కూడా చేయలేని పరిస్థితి వస్తుంది...
నీ కుటుంబ సభ్యులతో కాసేపు గడపడానికి కూడా వుండదు...
నిన్ను ఒక్క నిమిషం కూడా ఎడంగా ఉండనీడు...
నిన్ను అట్టే అంటిపెట్టుకుని ఉంటాడు...
నీ సమస్యలు వినడు...
నీకేమీ వరాలు ఇవ్వడు...
నేనుకావాలన్నావుగా...వచ్చాను...అంతే...
అంటాడు...
నీకు తప్ప ఎవడికీ కనబడడు...
నీవు దేవుడితో మాట్లాడుతున్నప్పుడల్లా...
నీ వాళ్లే నిన్ను పిచ్చివాడిలా చూస్తారు...
నీకు తాయెత్తులు కడతారు...
ఇలా ఎంతకాలం భరిస్తావు దేవుణ్ణి...?
ఇంతవరకు "దేవుణ్ణి పొందటం ఎలా?"
అనే పుస్తకాలే చదివుంటావు....
ఇక ఇప్పట్నుంచి...
"దేవుణ్ణి వదిలించుకోవడం ఎలా?"
అనే పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయా?
అని గ్రంథాలయాల్లో వెతుకుతావు...
లోకం నిన్ను పిచ్చివాడిలాగా చూస్తుంది.....
"లాగా" ఏంటి...
నిజంగానే పిచ్చివాడివయిపోతావు...
ఇప్పుడు చెప్పు ...నీకు దేవుడు కావాలా......?
అందుకే గురువు అంటాడు-
దేవుణ్ణి దేవుడిగా భరించలేవు కాబట్టే...
దయామయుడైన ఆ దేవుడు...
నీకు అత్యంత దగ్గరగా గడపాలని...
నీ తల్లిదండ్రుల రూపంలో...
భార్య రూపంలో...
భర్తరూపంలో...
బిడ్డల రూపంలో...
అవతరించి ఉన్నాడు...
నీ కుటుంబానికి నీవెంత సేవ చేయగలవో చేయి...
అదంతా దేశ సేవే అవుతుంది...
దైవ సేవే అవుతుంది...
ఎవడి వాకిలి వాడు శుభ్రం చేసుకుంటే...
ఏకకాలంలో ఊరంతా శుభ్రం అయినట్టుగా...
ఎవడి కుటుంబానికి వాడు న్యాయం చేయగలిగితే...
ఏకకాలంలో దేశం సుభిక్షంగా తయారవుతుంది...
మహనీయులు సంసారాన్ని వదలమని చెప్పారంటే...
కుటుంబాన్ని వదలమని కాదు...
ఇహ-పర సుఖాలను పొందటానికి...
ఋషులు ఏర్పర్చిన సువ్యవస్థయే కుటుంబం...
సంసారం వేరు...
కుటుంబం వేరు...
కర్తృత్వభావనే సంసారం...
కర్తృత్వభావనను వదలమని చెప్పారు...
భగవంతుని చేతిలో తానొక పనిముట్టు...అంతే.
పనిముట్టు ప్రయోజనం పనిముట్టుది కాదు...
దానిని ఉపయోగించేవాడిది...
గాంధీ సత్యంతో ప్రయోగం చేయడం కాదు...
సత్యమే గాంధీతో ప్రయోగం చేసింది...
రమణుడు జ్ఞానాన్ని పొందడం కాదు...
జ్ఞానం రమణుణ్ణి పొందింది.
మనకు ఏదీ విశేషణం కాదు...
భగవంతునికున్న విశేషణాలే సకలమూ...
తన పరిమితుల్ని గుర్తించడమే శరణాగతి...
కర్త తాను కాదని తెలుసుకోవడం కర్మయోగం.
భగవంతుని చేతిలో తానొక పరికరం అన్న జ్ఞప్తియే భక్తియోగం.
సంయోగ వియోగములకు వీలుకానిది జ్ఞానయోగం.
No comments:
Post a Comment