Sunday, December 1, 2024

 Vedantha panchadasi:
నిత్య జ్ఞాన ప్రయత్నేచ్ఛా గుణానీశస్య మన్వతే ౹
అసఙ్గస్య నియంతృత్వ మయుక్తమితి తార్కికా ౹౹109౹౹

109.  ఈశ్వరుడు అసంగుడగుటచే అతని నియంతృత్వము అసంగత మని తార్కికులు నిరాకరింతురు. నిత్యమైన జ్ఞానప్రయత్న ఇచ్ఛ అనే గుణములను వారు ఈశ్వరునకు అన్వయింతురు.

పుం విశేషత్వమప్యస్య గుణై రేవ న చాన్యథా ౹
సత్యకామః సత్యసంకల్ప ఇత్యాదిశ్రుతిర్జగౌ ౹౹110౹౹

110.  ఈ గుణముల చేతనే ఈశ్వరుడు విశిష్ట పురుషుడగుట సిద్ధించును.మరొకవిధమున సిద్ధింపదు.సత్యకాముడు సత్యసంకల్పుడు ఇట్లు శ్రుతి వర్ణించుచున్నది.
ఛాందోగ్య ఉప.8.1.5;8.7.1-3

నిత్యజ్ఞానాదిమత్వేఽ స్య సృష్టి రేవ సదాభవేత్ ౹
హిరణ్యగర్భ ఈశోఽ పి లిఙ్గదేహేన సంయుతః  ౹౹111౹౹

111. కానీ ఈశ్వరుడు నిత్యజ్ఞానాది గుణన్వితుడైనచో సృష్టియే నిత్యముగా ఉండవలసి వచ్చును.కనుక తార్కికులు ఈశ్వరుడనునది నిజముగ లింగశరీరముల సమిష్టియగు హిరణ్యగర్భుడే.

వ్యాఖ్య: సూక్ష్మ దేహం అనాదియైనది.ఇది అవిద్యా బలంతో జగత్కర్తయైన ఈశ్వరుని ద్వారా ఏర్పడి జీవునికి ఉపాధియై ఉన్నది.జీవుని కర్తృత్వ భోక్తృత్వములకు అధ్యాస మూలకమున ఇదియే కారణమై యున్నది.

ఈశ్వరుడు సత్యకాముడు, సత్యసంకల్పుడు ఇట్లు శ్రుతి వర్ణించుచున్నది.ఆత్మ యొక్క సత్యకామములు అసత్యముచే కప్పబడి యున్నవి.

సమస్త జీవుల లింగదేహముల యొక్క సమిష్టి రూపము ఈశ్వరునికి ఉపాధిగా యున్నది. ఇట్టి ఉపాధి గలిగినప్పుడు ఈశ్వరుడు హిరణ్య గర్భ (బ్రహ్మదేవుడు)నామముతో పిలవబడుచున్నాడు.

లింగదేహం యొక్క వ్యష్టిరూపాన్ని జీవుడును,సమిష్టి రూపాన్ని ఈశ్వరుడును ఉపాధులుగా గలిగి యున్నారు.

శుద్ధ బ్రహ్మమునందు మూలాజ్ఞానము లేదు. తూలాజ్ఞానము(మన అజ్ఞానము) లేదు.స్థూలసూక్ష్మ వ్యష్టి సమిష్టి మొదలగునవి ఏవీ లేవు.నిత్య స్వయం ప్రకాశమయిన బ్రహ్మము నందు జాగరణ నిద్రాదులుండవు.

సూర్యునకు ఉదయాస్తమములుగా అంతా మన బుద్ధి విలాసమే.
ఈశ్వరుడు గుణాన్వితుడైనచో సృష్టియే నిత్యముగా ఉండవలసి వచ్చును.వేదాంతులిట్లు తార్కికుల వాదమునందు దోషమును చూపి వారి వాదమును తమ వాదముతో సమన్వయించుకొనుచున్నారు.

సంబంధ రహితుడు ఆత్మ ఒక్కటే.సజాతీయ వస్తువులు లేవు.అలాగే ఆత్మకు విజాతీయ వస్తువులు కూడా లేవు.ఉన్నవి మిధ్య గదా?స్వగతంగా ఏభేదమూ లేదు.ఆకాశము వలె నిరవయవము.
వస్త్రమునకు-దారమునకు స్వగత భేదము.అటువంటిదాత్మకు లేదు.

మిధ్యా వస్తువులున్నా వాటితో ఆత్మకు ఎటువంటి సంబంధము వికారము ఏర్పడదు.ఎండమావిలో కనబడిన నీరు వలన ఎండమావి తడవదు(బురదకాదు).
ఇట్టి "ఆత్మ"నీవే.   

No comments:

Post a Comment