☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
31. న కశ్చిన్నాపరాధ్యతి
అపరాధం చేయనివాడెవడు(వాల్మీకి రామాయణం)
ఇది సహనశీలి సీతమ్మ చెప్పిన చల్లని మాట.
రావణ వధానంతరం ఆ రామవిజయ వార్తను సీతతో చెప్పి ఆనందింపజేయడానికి
వస్తాడు హనుమంతుడు. తల్లికి శుభవార్తలన్నీ వినిపించాక, అక్కడే ఉన్న రాక్షస స్త్రీలను చూసిన హనుమకు ఆగ్రహం కలుగుతుంది.
గతంలో తాను సీతను వెదుకుతూ వచ్చి అశోక వృక్ష శాఖలలో దాగి గమనిస్తుండగా, ఆ తల్లిని నానా దుర్భాషలాడిన రాక్షస స్త్రీలు వీరు! సీతమ్మను అంత కఠినంగా మాట్లాడి ఎంత నొప్పించారు! అవి కూడా శూలాల్లాంటి మాటలు, కర్ణకఠోరవాక్కులు.
(తప్పు ఎవరైనా చేస్తారు! కానీ ఎందుకు అలా చేశారో అర్థం చేసుకోవాలి. దానికి ప్రతీకార దృష్టి పనికిరాదు. అయితే అవతలివాడు అధర్మం చేస్తున్నా చూస్తూ ఊరుకోమని కాదు. అలాగైతే రామరావణ యుద్ధమే లేదు. కానీ తాను చేసిన తప్ప తెలుసుకొని పశ్చాత్తాపపడితే క్షమించగలిగే ఔదార్యం ఉండాలి. శౌర్యం, ఔదార్యం -ఈ రెండూ ఏవి, ఎప్పుడు చూపాలో రామయ్యతండ్రికి తెలుసు, సీతమ్మతల్లికి తెలుసు. ఆ సంయమనం ఉన్ననాడే నిజమైన ధర్మప్రతిష్ట జరుగుతుంది.)
అటువంటి దుర్మార్గులైన ఆ దైత్య స్త్రీలు ఇప్పుడు, రాముని విజయంతో హనుమంతుని చూసి గడగడలాడుతూ ఓవైపు నిల్చున్నారు. వారిని చూసి “ఆనాడు మా అమ్మను నానా దుర్భాషలాడినవారు వీరే”నని - "అమ్మా! ఈ స్త్రీలు నిన్ను ఎంతగా బెదిరిస్తూ హింసించారో! నువ్వు ఆజ్ఞాపిస్తే వెంటనే వారిని సంహరిస్తాను" అంటాడు హనుమ.
“ఒకప్పుడు అపకారం చేశారని తిరిగి మనం అపకారం చేయదగదు.
కార్యం కరుణమార్యేణ న కశ్చిన్నాపరాధ్యతి|| కారుణ్యం చూపడమే ఉత్తముల లక్షణం. లోకంలో అపరాధం చేయనివాడెవడు?” అని పలుకుతుంది. ఎంత గొప్ప
మాటలివి! ఎంత గొప్ప వ్యక్తిత్వం ఆ వైదేహిది! కరుణామయుడైన శ్రీరామునికి తగిన ఇల్లాలు!
నిజానికి రావణ లంకలో రాక్షస స్త్రీల వికృత భీకర వాక్య విన్యాసాల మధ్య ఎంత యాతన పడిందో ఆ బంగారు తల్లి! కానీ తిరిగి తనకు అవకాశం వచ్చినా,క్షమించి విడిచిపెట్టింది. వ్యక్తిని ఏవిధంగానైనా హింసించరాదన్నది భారతీయ
ధర్మసిద్ధాంతం. అందుకే 'సీతను అప్పగించి శరణు వేడితే రావణుని సైతం రక్షిస్తాను' అంటాడు సర్వ సమర్థుడైన శ్రీరాముడు.
అంటే - రావణునిపై ఆయనకు వైరభావం లేదన్న మాట. ఎవరిపైనా వైరత్వం తగదు. కానీ ధర్మరక్షణ కోసం అధర్మాన్ని శిక్షించాలి. ప్రయోజనం - ధర్మరక్షణ.అదే జరిగిననాడు అనవసరపు హింస ఎందుకు?
తప్పు ఎవరైనా చేస్తారు! కానీ ఎందుకు అలా చేశారో అర్థం చేసుకోవాలి. దానికి ప్రతీకార దృష్టి పనికిరాదు. అయితే అవతలివాడు అధర్మం చేస్తున్నా చూస్తూ ఊరుకోమని కాదు. అలాగైతే రామరావణ యుద్ధమే లేదు. కానీ తాను చేసిన తప్పు తెలుసుకొని
పశ్చాత్తాపపడితే క్షమించగలిగే ఔదార్యం ఉండాలి. శౌర్యం, ఔదార్యం - ఈ రెండూ ఏవి, ఎప్పుడు చూపాలో రామయ్య తండ్రికి తెలుసు, సీతమ్మతల్లికి తెలుసు. ఆ సంయమనం ఉన్ననాడే నిజమైన ధర్మప్రతిష్ఠ జరుగుతుంది.
అందుకే సీతమ్మ ఈ మాట అన్నది.
సృష్టిలో ఎవరైనా తప్పు చేస్తారు. అందుకు శిక్షిస్తూ పోతే ఎవరూ మిగలరు.అందుకే మార్పు కోసం శిక్షించినా, తప్పు తెలుసుకున్న వారిని మన్నించాలి.
ఇలా ఒక కరుణ ధర్మాన్ని ఇందులో మనం చూడవచ్చు.
అదలా ఉంచితే, మరోవైపు జగజ్జనని అయిన జానకీదేవి కారుణ్య, వాత్సల్య
భావాలు ఇందులో ద్యోతకమౌతాయి.
జీవుడు నిజానికి అపరాధి. వివిధ పాపాల సమాహారం చేత ఎన్నో దోషాల నాచరిస్తాడు. మరి తరించడం ఎలా?
ఈ ప్రశ్నకు తల్లియొక్క ఈ మాటే 'ఆప్తవాక్య'మై అభయమిస్తుంది. 'ఎవరైనా తప్పు చేస్తారులే! పశ్చాత్తాపపడి, శరణు వేడితే క్షమించి కరుణిస్తాను' అనే అపారమైన
అనుకంప ఈ వాక్యంలో వెల్లువౌతోంది.
ఇటువంటి దేవతామూర్తిని కొలుచుకుంటే ఇంక దిగులేముంది. సీతారాములది పరిపూర్ణ కరుణామయ హృదయం. వారు 'దయా సముద్రులు' - అందుకే శత్రు
సోదరునికి అభయమిస్తూ - "అభయం సర్వభూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ” అని అన్నాడు రామచంద్రుడు. ఇప్పుడు సీతమ్మ ఇలా అంది. పిల్లల్ని క్షమించగలిగేది తల్లి హృదయమే కదా! కనుకనే -
అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశం మయా
పుత్రోమియతి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి!
"నిత్యం వేలాది అపరాధాలు చేస్తున్నాను. అయినా నీ బిడ్డనైన నన్ను క్షమించి పవిత్రుని చేయమ్మా" అని అపరాధ క్షమాపణ నమస్సులర్పిస్తాం.
No comments:
Post a Comment