Monday, December 2, 2024

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️

32. తపన్తం న నింద్యాత్

సూర్యుని
నిందించరాదు(యజుర్వేదం)

ప్రకృతిలో జరిగే ప్రతి మార్పుకీ ఒక ప్రయోజనం ఉంటుంది. దానిని పరిశీలిస్తూ పోతే ప్రకృతి 'అమ్మ'గా, పరమేశ్వరశక్తిగా సాక్షాత్కరించి దాని ముందు వినమ్రులమౌతాం.

ఎండా, వానా, గాలీ - అన్నీ మనకు ప్రాణదాతలే. వీటిని గమనిస్తే, ప్రకృతి
జడపదార్థం కాదనీ, ఇందులో ఏదో దివ్యత్వం ఉందనీ స్పష్టమౌతుంది. ఆ దివ్యత్వాన్ని దర్శించిన మహర్షులు, వాటిపట్ల మనిషి ప్రతిస్పందన ఎలా ఉండాలో తెలియజేసిన వేదవాక్యాలలో ఇది ఒకటి.

మనిషి అసహనంతో (తట్టుకోలేనితనంతో)- ఎక్కువైన ఎండల్ని నిందిస్తాడు,అధికమైన వానల్ని నిందిస్తాడు.

కానీ సూర్యకాంతి ఒక రెండు రోజులు సోకకపోతే కలవరపడేదీ, వాన చినుకు లేకపోతే వేదన పడేదీ ఇతడే. అవి ఎక్కువైతే నిందించేదీ ఇతడే. ఇదే మనిషి ఆలోచనలోని లోపం.

భగవంతుని కారుణ్యం ప్రకృతిలో పరమ స్పష్టంగా కనిపిస్తుంది. మండుటెండల్లోనే చలువదనాన్నిచ్చే ఫలపుష్పాలని సృష్టించాడు. మనిషికి తనని తాను రక్షించుకునే బుద్ధి శక్తులనిచ్చాడు. వాటిని వినియోగించుకొని తాత్కాలిక వేదననుండి కాపాడుకోగలిగితే శాశ్వత ప్రయోజనాన్ని పొందగలడు.

ప్రకృతిని ఎట్టి పరిస్థితుల్లోనూ విసుగుకోవడం, నిందించడం పనికిరాదని సనాతన ధర్మశాసనం.

మానవునికీ, ప్రకృతికీ ఉన్న ఆత్మీయతా బంధాన్ని అవగాహన చేసుకోగలగాలి.ప్రకృతికి మనస్సు ఉంది. మన మనఃస్పందనలకి ప్రతిస్పందిస్తుంది.

ఉత్తముడైన ధార్మికుని సంకల్పంతో బీడు నేలపై అమృతవర్షం కురుస్తుంది.
అతివృష్టి సైతం ఆగిఆహ్లాదాన్నిస్తుంది. దానికి దాఖలాలు ఎన్నో మన ప్రాచీన సంస్కృతిలో కనబడతాయి. రాగాలతో గాలులూ, వానలూ, ఎండలూ కూడా మారుతాయి.
యజ్ఞాలతో ప్రకృతిలో మార్పులొస్తాయి. అంటే మానవ స్పందనలకి, ధర్మాలకి అనుగుణంగా ప్రకృతి ప్రతిస్పందిస్తుంది.

ప్రకృతిలో జరిగే పరిణామాలకు అసలైన ప్రయోజనం లోకక్షేమమే. సూర్యుడు అధికంగా జలాన్ని గ్రహించేలా ఉష్ణాన్ని వెదజల్లకపోతే తదనంతర కాలంలో మేఘనిర్మాణం సాధ్యపడదు. జలధారలు ముమ్మరంగా లేకపోతే సూర్యతాపాన్ని
ఎదుర్కొనగలిగే నీటి వనరులూ కరువౌతాయి.

ఇలా ప్రకృతి అంతా ఒక ప్రణాళికాబద్ధంగా సాగుతుంది.

మరో విషయం - ఈ ప్రకృతి కేవలం మనిషి కోసం మాత్రమే సృష్టించబడలేదు.ఈ పృథ్విపైనున్న సమస్త జీవరాశి కోసం ఇది పనిచేస్తోంది. కేవలం మన అవసరాలకు సరిపోలేదనో, లేదా అధికమయ్యిందనో నిందించడం తగదు.

మనం విసుక్కొనే బురద మనకు అనవసరమేమోగానీ, దానిలో బ్రతికే జీవరాశికి అది ప్రాణాధారం. ప్రకృతికి సర్వజీవకోటి ప్రధానమే. కానీ తాను అధికుడిననే భ్రమలోనున్న మానవుడు సాధిస్తున్న ప్రగతి అంతా ప్రకృతిని పీడించడంలోనే సాగుతోంది.

పంచభూతాలు, నక్షత్రాలు, గ్రహాలు, వీటివల్ల మనం పొందుతున్న ప్రయోజనాలనే గమనిస్తున్నాంగానీ వాటితో ఆప్యాయతని ఏర్పరచుకోలేకపోతున్నాం.

కానీ ప్రకృతిని కూడా శాంతిగా ఉండాలని కాంక్షించే సనాతన యజ్ఞ సంస్కృతిలో చైతన్యవంతమైన ప్రకృతి హృదయాన్ని స్పందింపజేయగలిగే ఆరాధనా దృష్టి
గోచరిస్తుంది.

అమ్మ ఏ అవస్థలోనైనా బిడ్డ క్షేమాన్నే కోరినట్లుగా - ఎండలూ, వానలూ, గాలులూ జగదీశ్వరి అనుగ్రహాలుగా దర్శించిననాడు, తప్పకుండా ఏ విలయమూ లేని పరిసరాలు మనచుట్టూ ఏర్పడతాయి.      

No comments:

Post a Comment