Monday, December 2, 2024

 Vedantha panchadasi:
ఉద్గీథబ్రాహ్మణే తస్య మాహాత్మ్యమతి విస్తృతమ్ ౹
లోంగ సత్త్వేపి జీవత్వం నాస్య కర్మాద్యభావతః ౹౹112౹౹

112.  హిరణ్యగర్భుని మహిమ ఉద్గీథ బ్రాహ్మమున విస్తరింపబడినది.సూక్ష్మదేహముల సమిష్టియైనను కామకర్మాదులు హిరణ్యగర్భునకు లేవు కనుక అతడు జీవుడనుటకు వీలులేదు.
బృహదారణ్యక ఉప. 1.3

వ్యాఖ్య: జీవుడిని పరమేశ్వరుని అంశమని నిర్ధారిస్తే,
సంసారిత్వం ఉండే జీవుని 
సుఖ-దుఃఖాలు పరమాత్మలో కలిసి పరమాత్మను తదంశాలయిన, మిగతా జీవులను దుఃఖభాగాలను చేసే ప్రమాదం ఉంటుంది. అందువల్ల సంసారంలో ఉండటమే 
సమ్యగ్దర్శనం కన్నా మంచిదనిపించవచ్చు.

పరమేశ్వరుడు అవిద్యాకృతమైన దుఃఖాదులకు అతీతుడు.
జీవునికే దేహాభిమానం దానితో పాటు పుత్ర-పౌత్రాదుల మీద పెంచుకున్న అభిమానం.

నామరూపాల చేత ఏర్పడిన దేహేంద్రియాద్యుపాధులు వేరు,
నేను అనబడే నా ఆత్మ వేరు అని గ్రహించలేక పోవడమే దీనికి ముఖ్యకారణము.

అందువల్ల జీవుడనుభవించే సుఖ-దుఃఖాలు,నేను-నాది-నావారు అనే మిథ్యాభిమానం వలన కలుగుతున్నవని తెలుసుకోవలసి ఉంటుంది.

పరమేశ్వరుడికి దేహాది ఆత్మభావం కాని,దుఃఖాభిమానం కాని ఉండదు కదా!
నిత్యచైతన్య స్వరూపమూ, అసంగుడూ,ఏ కోరికలు లేని పరమేశ్వరుడికి ఇతరుల  సుఖదుఃఖాదులు సంక్రమించటం ఉండదు.

యదార్థంగా ఆకాశంలో చలనం ఉండదు.ఇదే విధంగా,శరీర మనోబుద్ధ్యాధి ఉపాధుల వలన జీవాంశము దుఃఖిస్తున్నా మూలమైన ఈశ్వరుడు దుఃఖించడు.

"తత్త్వమసి" వంటి వేదాంత బోధనలు పురుషుడిలో అవిద్యాకృత మిథ్యాభావాలను విద్యతో నిర్మూలించి, బ్రహ్మతత్త్వాన్ని ప్రతిపాదించటానికే ఉద్దేశించబడ్డవి.    

No comments:

Post a Comment