Sunday, December 1, 2024

 *చిన్నప్పుడు.. అవును బాగా చిన్నప్పుడు...*
*రకరకాల బ్రేక్ఫాస్ట్లు తెలీవు, డబ్బు ఖర్చు కూడా తెలీదు,* *అలాగని పొదుపూ తెలియదు..!!*
*పోల్చుకోవడాలూ... ఆడంబరాలు అసలే తెలీదు...*

*పొద్దు పొద్దున సరిగ్గా ఆరు గంటలకి  బన్స్  అంటూ ఒక పొడవాటి రేకు ట్రే లో బన్స్ ని పెట్టుకుని మా వాడకట్టు లో  ఒక కుర్రాడు అమ్మేవాడు.*

*అప్పటికే స్నానం చేసి, పూజ చేస్తున్న నాన్న చేతి లో జపమాల పట్టుకుని బయటకొచ్చి ఆ కుర్రాణ్ని పిలిచేవాడు.*
*నాకూ అక్కకు పావలా కి రెండు బన్ను లు కొనేవారు. అప్పటికే మెలకువ తో ఉన్న దొంగ నిద్ర పోయి, చంగున లేచి కూర్చునేదాన్ని.*

*పళ్లు తోముకుని, ఫ్రెష్ అయ్యి, ఆ బన్ను నా చేతికెప్పుడిస్తారా అని కూర్చునేదాన్ని.*

*మా అమ్మ పెద్ద గలస్ లో చాయ్ తో పాటు బన్ను కూడా  తెచ్చి, ముందు పెట్టేది.*

*ప్రతి రోజూ పావు లీటర్ బర్రె(గేదె) పాలు మాత్రమే తీసుకునేది అమ్మ. అందులోనే రెండు పూటలా చాయ్ మరియు మజ్జిగ.*

*మరి రంగు, రుచి, చిక్కదనం, గడ్డ పెరుగు అంటే ఏవిటో తెలీదు. వంకలు పెట్టడం, అది బాలేదు, ఇదిలాగే ఉండాలి అని కూడా తెలీని అమాయకత్వం.*

*అమ్మ ఏది వడ్డిస్తే అది ఆవురావురంటూ తినేయడం. మహా అంటే మొదటి వాయి నాన్న కలిపిచ్చేవారు.*

*ఇక స్కూల్(ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల) కి వెళ్ళేటప్పుడు,  నిన్న రాత్రి మిగిలిన చద్దన్నం లో నూనె వేసి మిరప్పండు తొక్కో(పచ్చడి) చింతకాయ తొక్కో కలిపి నాకూ, అక్కకి పెద్ద పెద్ద లడ్డూల్లా చేసి చేతి లో పెట్టేది  అమ్మ...*

*గబ గబా తింటూ మధ్యలో ఉస్స్స్ ఉస్స్...(కారం, ఘాటు) అని సౌండ్స్ చేస్తూ తినేసి స్కూల్కి వెళ్ళేవారిమి.*

*మధ్యాహ్నం ఒంటిగంటకి ఇంటి బెల్ కొట్టగానే వచ్చేసి, అమ్మ వడ్డించే భోజనం (ఒక్కటే కూర లేదా పప్పు, చల్ల) తినేసి ఒకయిదు నిమిషాలు కూర్చుని అమ్మని చూసేదాన్ని.*

*అప్పటికే పనంతా (ఇల్లు శుభ్రం, అంట్లు, బట్టలు, వంట, ఆవిడ భోజనం) చేసేసి, విశ్రాంతి దేవత లా చిరి చాపలో ఒక మెత్త(తలగడ) పై తల ఆనించి హాయిగా సిలోన్ లో వచ్చే పాటల్లో మధ్యలో తన గొంతు కలుపుతూ వింటూ ... విశ్రాంతి తీసుకునేది.*

*మళ్లీ మధ్యాహ్నం స్కూల్ కి వెళ్లి, సరిగ్గా నాలుగ్గంటలకు ఇంటికి రాగానే.. మధ్యాహ్నమ్  మిగిలిన అన్నం కాస్త కలిప్పెట్టి, చాయ్ ఇచ్చేది.*
*అవి కానిచ్చేసి,  ఆడుకొవడానికి వీధిలోకెళ్లేదాన్ని.*

*మమ్మల్ని చూస్తూ అరుగు మీద గోడకు ఆనుకుని, మా నాన్న కోసం ఎదురు చూస్తూ నుంచునేది అమ్మ. అలా ఆడుకునే మమ్మల్ని చూడటమే ఆమెకి కాలక్షేపం.*

*ఆరింటికి లోపలికెళ్లి దేవుడికి సంధ్య వేళ అని దీపం వెలిగించి, పొయ్యి మీద(కట్టెలా పొయ్యి) రాతిరి భోజనం కోసం బియ్యం పెట్టేది.*

*ఈలోపు నాన్న వచ్చేసేవారు.. నాన్న చేతి సంచీలో  ఏవుందా అని కాచుకుని చూసేదాన్ని.. ప్రతిరోజూ సాయయంత్రపు దేవుడి ఆరగింపు కోసం వస్తూ వస్తూ  ఏదో ఒక రకమైన పండు తెచ్చెవారు.*

*అసలు మాకప్పుడు ఎన్ని రకాల ఫ్రూట్సో, సలాడ్సో ఇవేమీ తెలీదు.* 

*ప్రతి నెల తనఖా(సాలరీ) రాగానే ఒక కొవాబిళ్ల ల స్వీట్ పాకెట్ తెచ్చేవారు నాన్న… అది కూడా ఆరగింపు చేసి అందరికీ సమానంగా పంచేవారు. ఆయనకెమీ మిగుల్చుకోకుండా..*

*"నాన మరి నీకూ" అని అడిగితే.. "నువ్వు తింటే నేను తిన్నట్టే అమ్మీ" అని నవ్వుతూ తల నిమిరేవారు...*
*ఏదీ ఆశించని ప్రేమ.. ఒక స్వచ్ఛత ఆయన కళ్ల లో...*

*కాసేపయ్యాక, అమ్మ కోవా బిళ్ల లో సగం నాన్నకిచ్చి చేరిసగం తినేవారు.*
*"అమ్మ నీకు సగమే చాలా " అంటే... "నాన్న తింటే నేను తిన్నట్టే" అనేది.. నవ్వుతూ...!!*

*ఉన్నంత లో తినడం, ఉన్నదాంట్లో పంచుకోవడం... మనకు లేనిది, లేమి అనేదే తెలియకపోవడం..!!*

*అలా కాలక్షేపంగా మాట్లాడుతూ.. రేడియో లో పాడి, పంట కార్యక్రమం అవగానే భోజనాలు, ఆ వెంటనే నిద్ర..!!*

*ఎంత అందమైన అమాయకమైన బాల్యం... కారణాలు తెలీదు, అంతరాలు, అంతస్తులూ తెలీదు... దోపిడీ తెలీదు,*

*కుటుంబము, వీధిలో ఆడుకునే దోస్తులూ పండక్కి నాన్న కుట్టించిన బట్టలు వేసుకున్నప్పుడు కలిగే మురిపం తప్ప ఇంకే ప్రపంచమూ తెలియదు.*

*ఆ బాల్యపు ఒడిలో.. స్వచ్చమైన ప్రేమ లో, కల్మషం లేని చిరునవ్వు లో నేనెప్పటికీ పసి పాపనే..!!*

No comments:

Post a Comment