*వాసుదేవ అంటే ఏమిటి.?*
*విష్ణువుకు అనేక నామాలున్నాయి. వాటిలో వాసుదేవ అనే నామం ఉంది. అది కూడా ఇతర నామాలవలె విశిష్టమైనది. సర్వమూ వాసుదేవుడే అని అనుభూతి పూర్వకంగా, అపరోక్షంగా, స్వానుభూతిపూర్వకంగా గ్రహించగలిగిన మహాత్ములే జ్ఞానులు. ఇలాంటివారు చాలా అరుదు అంటుంది భగవద్గీత. అటువంటి నామం గురించి కొన్ని వివరాలు తెలుసుకోవడం ఎంతైనా అవసరం. సర్వం వాసుదేవుడే అన్నప్పుడు ఆయనకు ‘వసుదేవ సుతుడు' అనిపరిమితమైన అర్థం చెప్పటంలో సామంజస్యం కనిపించదంటారు కొందరు. త్రికాలాతీతుడూ, గుణాతీతుడూ, సర్వ వ్యాపీ, ఆదిమధ్యాంతరహితుడూ అయిన పరమాత్మను ఒక్క అవతారానికే వర్తింపజేసి వసుదేవ పుత్రుడుగా పిలవటం ఎలా పొసగుతుంది అని వారి సందేహం.*
*విష్ణు సహస్రనామంలో వాసుదేవ అనే నామం మూడు సార్లు వస్తుంది. ఒకే నామానికి ఒకే అర్థం రెండు మూడు సార్లు వాడటం సంప్రదాయం కాదు. అందువల్ల తమ విష్ణుసహ స్రనామ భాష్యంలో ఆదిశంకరులు ఆ మూడు పదాలకు మూడు అర్థాలు చెప్పారు. సర్వ జగత్తును వసనం లేక వా సనం లేక ఆక్రమించి ఉండేవాడు అని ఒక చోట చెప్పారు. (వాసుడు దివ్ అనే ధాతువుకు క్రీడించటం, విజయేచ్ఛ కలిగి ఉండటం, నియంత్రించడం, ప్రకాశించటం అనే అర్థాలు ఉన్నాయి. ఇవన్నీ చేసే వాడిని వాసుదేవుడు అంటారు. వాసుడు అయిన దేవుడు వాసుదేవుడు. అంటే చరాచర విశ్వాన్ని సూర్యకిరణాల ద్వారా సూర్యుడు కప్పి ఉంచినట్లు సర్వత్రా ఆక్రమించి వ్యాపించి ఉండేవాడు అని అర్థం). ఇక రెండో చోట వసుదేవ నామానికి వసుదేవుని పుత్రుడని, మూడో చోట మాయ చేత జగత్తును ఆచ్ఛాదన చేసి ఆవరించి ఉండేవాడని అర్థం చెప్పుకోవచ్చన్నారు.*
*┈┉┅━❀꧁ॐ🙏ॐ꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మికం ఆనందం*
🍁🍁🍁 🌹🕉️🌹 🍁🍁🍁
No comments:
Post a Comment