*రమణ మహర్షి - భగవాన్ స్మృతులు- 26*
🪷
రచన: గుడిపాటి వెంకట చలం
*రంగన్-4*
ఓసారి ఒక మహ్మదీయుడు భగవాన్ తో మాట్లాడుతూ వుండగా చూశాను. అతనేదో వేదాంత సమస్యలు మాట్లాడాడనుకున్నా ను. అతను వెళ్ళిం తరువాత భగవాన్ నాతో అన్నారు.
"అతను ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నీకు ఒక్కడికే అప్పులున్నాయని, నీవు గొప్పగా గొడవ పడతావు. నాకు ఓ అప్పు వుంది. ఐదువందల రూపాయలది. నేను అతని షాపులో అరువుకి దువ్వెనలు, సబ్బులూ తెచ్చుకున్నానట" అన్నారు.
ఆశ్రమం ఇదివరకటి సర్వాధికారి ఆ వస్తువులన్నీ అరువు పట్టుకుపోయినట్టు, ఆ డబ్బు తనకి ఎట్లా వసూలవుతుందని భగవానన్ను అడుగుతున్నాడాయన.
నాకు చాలా విచారం కలిగింది. నేను వెంటనే మద్రాసు వెళ్ళి ధనవంతుడైన భక్తుడితో చెప్పాను. ఆయన తిరువణ్ణామలై వచ్చి, ఆ దుకాణాదారుల్ని అరువు ఇచ్చినందుకు కోప్పడి, రెండువందల యాభై రూపాయలు ఇచ్చి రాజీ చేసి పెట్టాడు.
📖
ఓసారి నేను మద్రాసు నుంచి వచ్చి భగవాన్ తో వుంటూ వుండగా, ఓరోజు ఓ కోతి, వెనక చాల కోతుల్ని వెంటపెట్టుకొని వచ్చి భగవాన్ దగ్గిరికి వెళ్ళి ఆయన వళ్ళో కూచుంది. ఆయన్ని కావలించుకొని ఇకిలించింది. ఏదో ఆయనతో చెపుతూ వున్నట్లుగా వుంది.
"ఆ కోతి నాతో చెపుతోంది- ఇవాళే తక్కిన కోతులు తనని రాజుగా చేశాయిట. ఆ గోడమీద కూచున్న కోతుల వంక చూడు! అదిగో ఆ కోతి ఇతని పట్టమహిషి, పక్కన వున్నది రెండో రాణి. కూచున్నవాడు సేనాధిపతి. తక్కినవారు సైన్యం" అన్నారు భగవాన్.
అక్కడ షుమారు నూరు కోతులున్నాయి. వాటి సంతోషంలో అవి చెట్లుప్రాకి, కొమ్మలు విరచి గోల చేసాయి. భగవాన్ తన వళ్లో వున్న కోతిరాజు తల నిమురుతూ అన్నారు.
"ఈ కుంటి కుర్రాడు ఇవాళ రాజయినాడు. సంతోషవార్తను నాకు చెప్పటానికి వచ్చాడు" అని అసలు కథ చెప్పారు.
"నేను విరూపాక్ష గుహలో వుండగా ఈ కోతి చిన్న పిల్ల, తక్కిన కోతులు వీణ్ణి కరచి, వెనక వదిలిపోయినాయి. అలా కొరికిన గాయాల తో నా పాదాల దగ్గిర పడిపోయినాడు. వాడి మీద జాలిపడి గాయాలు మాన్పాను, అప్పుడే నాకు తట్టింది -ఓరోజు ఇతను కోతులకు రాజు కాబోతున్నాడని. అది ఇప్పుడు జరిగింది. సాధారణంగా మనిషిని ముట్టుకున్న కోతిని తక్కిన కోతులు తమ గుంపులో కలుపుకోవు" అన్నారు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ఒకరోజు తెల్లారకట్ట నాలిగింటికి లేపారు నన్ను, పాండవ తీర్థంలో ఈతకి రమ్మని. మా పక్కనే నిద్రపోతున్న దీక్షితారు నేలని గోకుతున్నారు.
"నీ తక్లీ (నూలు వడకడానికి ఉపయోగించే ఒక చిన్న పరికరం) కోసమేనా నేల మీద వెదుకుతున్నారు” అని అడిగారు భగవాన్.
దీక్షితారు లేచి కూచుని చెప్పాడు. తనకి అప్పుడే కల వచ్చిందట - జంధ్యాల పౌర్నమి దగ్గిరకి వస్తున్నట్టు! జంధ్యం వడకటానికి తక్లీ వెదుకున్నట్టు. ఆ సంగతి భగవాన్ అడిగారు.
ఆ ముందురోజు నేను అన్నాను భగవాన్ తో “జ్ఞానులు త్రికాల వేదులు గదా?” అని. దానికి భగవాన్ "అది చాల స్వల్పవిషయం. వారికి జాగ్రత్, స్వప్న, సుషుప్తిలో జరిగేది, లోకంలో జరిగేది కూడా తెలుసు. కాని ఏ లోకానైనా ఆ లోకమంతా సత్యాలే. మానవుడికి ఈశ్వరుడు అంత జ్ఞానం ఇచ్చాడు. భవిష్యత్తు జ్ఞానం తప్ప, రాబోయే నిమిషం సంగతి కూడా తెలియదతనికి.”
📖
ఒక భక్తుడు ఇంకో భక్తుడితో అన్నాడు "నువ్వు భగవాన్ దర్శనం తరుచు చేసుకుంటే నిన్ను సన్యాసిని చేస్తారు" అని.
ఆ భక్తుడికి అన్నీ తెలుసు. కాని, భయపడ్డట్టు నటించి, భగవాన్ తో ఫిర్యాదు చేసుకున్నాడు.
"మీ దగ్గరికి వస్తే నన్ను సన్యాసిని చేస్తారట. నా వెయ్యి రూపాయల జీతం పోతే, నా భార్య పిల్లల గతేం కాను.
భగవాన్ అన్నారు, "ఎవరు ఏది కోరతారో అది జరుగుతుంది!"
ఒకసారి భగవాన్ ఈ కథ చెప్పారు.
ఒక తపస్వి వుండేవాడు. అతని దర్శనానికై గుంపులు గుంపులు వచ్చేవారు. తనకి ఏ దివ్యశక్తులు లేవనీ, కనుక వారందరూ తన దగ్గరికి రావడం అనవసరమనీ, తనని disturb చెయ్యవద్దనీ, చెపుతూ వుండేవాడు.
ఇదంతా చూసిన ఒక భక్తుడు ఆ పని తానే చేసిపెడదామని వచ్చే ప్రజలలో - ఆ తపస్వి వద్ద ఏ శక్తులు లేవనీ, రావద్దనీ, ప్రచారం ప్రారంభించాడు.
దానికి ఆ స్వామికి సంతోషమయ్యింది. తనకి శక్తులు లేవని ఒకరు తెలియజేయడం కూడా ఒక సూక్ష్మమైన స్తుతి కిందనే పరిణమించింది. కొంతమందికి, ధనంపైన ఆశ. మరికొందరికి కీర్తిపైన అన్నారు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ఒకరోజు భగవాన్ తో నేనన్నాను. నా తండ్రికి భక్తి వుండేది కాదు. ఆలయానికి ఎప్పుడూ వెళ్ళేవాడు కాదు. యాత్రలు అసలే లేవు. కాని నా తల్లి గొప్ప భక్తురాలు. అయినా, నా తండ్రికి చాలాసార్లు మలేరియా జ్వరం వచ్చేది. ఆ జ్వరంలో ఆయన నన్ను పిలిచి "చూడు, ఎద్దుపై నెక్కి పరమేశ్వరుడు అడుగో! హారతులిస్తున్నారు. దర్శనం చేసుకో” - అనేవాడు అన్నాను.
దానికి భగవాన్ ఈ కథ చెప్పారు.
"ఒక దేశంలో రాజు ఎప్పుడూ దేవపూజ చేసేవాడు కాదు. రాణి ఎప్పుడూ, పూజా, భజనలలో వుండేది. తన భర్తకి ఈశ్వర భక్తి లేదే అని దిగులుపడి, అతనికి భక్తినిమ్మని ఈశ్వరుణ్ణి ప్రార్ధించింది.
ఓ రోజు గొప్ప పూజలు, భజనలు, చేసి భర్త గదిలోకి వచ్చింది. అతను మంచం మీద పడి నిద్రపోతున్నాడు. గది అంతా రామ నామం మోగిపోతోంది. ఎక్కడనుంచి ఆ నామ శబ్దం? అని పరిశీలించి, తన భర్త హృదయంలోంచి వస్తున్నదని ఆ సంగతి తెల్సుకుంది. వెంటనే ఆమె, మంత్రికి కబురు పంపింది.
"నా ప్రార్థనని ఈశ్వరుడు అంగీకరించి, నా భర్తకు భక్తిని కటాక్షించాడు. కనుక రేపటి దినం రాజ్యమంతా గొప్పగా ఉత్సవం చేయించు. ఆలయాల్లో పూజలు, భజనలు సంకీర్తనలు, సంగీతాలు ఏర్పాటు చేయించు" అన్నది.
మర్నాడు రాజు ఆ హడావిడి విని "ఏమిటి విశేషం?" అని మంత్రిని అడిగాడు. మంత్రి కారణం చెప్పాడు. రాజు రాణిని అడిగాడు తనకు భక్తి వున్నట్టు ఆమెకెట్లా తెలిసిందని. రాణి చెప్పింది. తన రహస్యం వెల్లడైందని, రాజుకి వ్యధ కలిగి ఆత్మహత్య చేసుకోవాల నుకున్నాడు. రాణి తనని క్షమించమని వేడుకొని, మాన్పింది.
భక్తిని రహస్యంగా వుంచుకుంటేనే మంచిది అని అన్నారు భగవాన్.
మానవుడు తన అహాన్ని నిర్మూలించుకో
గలిగితేనేగాని జ్ఞానోదయం కాదు, అని బోధిస్తూ భగవాన్ ఈ కథ చెప్పారు.
నేను ఈ పనిని చేస్తున్నాను అనే భావాన్ని పోగొట్టుకోవాలి అని వారి బోధన.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment