Thursday, December 11, 2025

 🔱ఓం నమః శివాయ🔱: *శ్రీ      లలితోపాఖ్యానము*
(కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక)
దేవతలు ఆనందంతో దుందుభులు మ్రోగించి పూలవర్షం కురిపించి కర్పూరం వెలిగించి జయజయనాదాలు చేస్తారు.
 (కామ సంజీవనం) కాముడు తిరిగి జీవించటం.
భండాసురుడు మరణించిన తరువాత లలితాదేవి తన చల్లని చూపులతో శక్తి సైన్యానికి తగిలిన గాయాలన్నిటినీ పోగొట్టుతుంది.యుద్దం వల్ల కలిగిన శ్రమ నుండి సేద తీరుస్తుంది. బ్రహ్మాది దేవతలు ఆనందంతో లలితాదేవినిదర్శించుకోవటానికి వస్తారు. సింహాసనం మీద కూర్చున్న తల్లిని స్తోత్రం చేస్తారు.
బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలు,
నమో నమస్తే జగదేక నాథే నమోనమః శ్రీ త్రిపురాభిధానే
నమోనమః భండ మహాసురాఘ్నే నమోస్తు కామేశ్వరి వామకేశి
అంటూ లలితా దేవి ఘన కీర్తి,  కొనియాడుతారు.
(బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవ).
ఆ శ్లాఘనలో,
"తల్లీ! భండాసురుడైతే మరణించాడు. కాని అతని మిత్రుడు తారకుడు ఇంకా జీవించే వుండి మమ్మల్ని హింసలపాలు చేస్తున్నాడు.
అతనిని అంతమొందించాలంటే పరమేశ్వరుడికి పుత్రుడు కలగాలి. మేమంతా అందుకోసమే ప్రయత్నాలు చేస్తూ ఉండగా మన్మధుడు దహించబడటం ఆ తరువాత ఈ సంఘటనలు చోటు చేసుకోవటం జరిగింది.” అని తల్లికిజరిగిన సంఘటనలు  వివరిస్తారు.
“రతీదేవి మన్మధుడి మరణంతో దుఃఖితురాలై రోదిస్తూ వున్నది." అని దేవతలు రతీదేవిని లలితాదేవికి చూపిస్తారు. రతీదేవి మాతకు నమస్కరిస్తుంది.
ఆ మాటలు విన్న లలితాదేవి ప్రేమ పూరిత దృక్కులతో కామేశ్వరుడి వైపు చూపు సారిస్తుంది. ఆ కనులలో నుండి మన్మధుడు పునరుజ్జీవుడౌతాడు.
(హరనేత్రాగ్ని సందగ్ధా కామసంజీవనౌషధిః)  హరుని చూపుల అగ్నిలో దహింపబడ్డ మన్మధుని జీవితుడిని చేసిన సంజీవని ఆ తల్లి. రతి మన్మధులు మాత పాదాలకు నమస్కరిస్తారు.
"రతీదేవిని అలంకరించి తీసుకురండి రతీ మన్మధుల వివాహం చేద్దాం" అని శ్యామలా దేవి చెలికత్తెలకు ఆఙ్ఞాపిస్తుంది.
ఆ దంపతులను తల్లి ఈ విధంగా ఆశీర్వదిస్తుంది.
"మన్మధా, నీకు ఇంక ఏ భయమూ లేదు. వెళ్ళు. మరొక్కసారి నీ పూలబాణం పరమేశ్వరునిపై సంధించు.
శివుడు నీకు లొంగిపోయి పార్వతిని వివాహమాడుతాడు. నా ఆశీస్సులతో శివుడు నీకు ఏ విధమైన హానీ కలిగించడు. ఈ క్షణం నుండి నీవు ప్రతి ఒక్కరి శరీరం లోకి ప్రవేశించి రాగ మోహాలను ఉత్పన్నం కలుగ చేయి. నాభక్తులను కాపాడు."
తల్లి ఆశీర్వాదాలు పొందిన మన్మధుడు సతీ సమేతంగా తన మిత్రులైన వసంతుడు మొదలైన వారిని వెంటబెట్టుకొని శివుడు తపస్సు చేస్తున్న స్థాణ్వాశ్రమానికి వెళ్ళి  తన ప్రభావం చూపిస్తాడు. శివునికి తపోభంగమైవిరహవేదనతో పార్వతికై వెతకటం మొదలెడుతాడు. ఈ లోగా మన్మధుడు తన బాణాలు పార్వతి మీద కూడా ప్రయోగిస్తాడు. పార్వతి చేస్తున్న తపస్సుతో సంతుష్టుడైన పరమేశ్వరుడు ఆమె ఎదుట ప్రత్యక్షమై ఆమెనువివాహమాడుతాడు. ఫలితంగా కుమారస్వామి జన్మించి దేవసేనకు అధిపతై తారకాసుర సంహారం చేసి ఇంద్రుని పుత్రిక అయిన దేవసేనను పెళ్ళాడుతాడు.
 మన్మధుడు తాను వచ్చిన పని నిర్విఘ్నంగా పూర్తి చేసినవాడై లలితాదేవి సేవకు శ్రీపురం చేరుకుంటాడు.
**
శ్రీ నగరం
 భండాసురుడు అంతమయిన తరువాత త్రిమూర్తులు దేవ శిల్పి అయిన విశ్వకర్మను రాక్షసుల శిల్పి అయిన మయుడిని  పిలువనంపుతారు. లలితాదేవి, శివకామేశ్వరుల నివాసయోగ్యమైన 16భవంతులు, 16 పుణ్య క్షేత్రాలలో నిర్మించమని ఆదేశిస్తారు. ఆ 16 స్థావరాలు. మేరు, నిషధ, హేమకూటము,హిమగిరి, గంధమాదన, నీల, మేష, శృంగార మహేంద్ర పర్వతాలు (9 అత్యున్నత పర్వతాలు), జలసముద్రముతో సహా, లవణ, చెరుకు, పాల,సురా, నేతి, పెరుగు సప్త సముద్రాలలో, మొత్తం 16 క్షేత్రాలలో అమ్మవారి కోసం నిర్మించిన భవంతులే శ్రీపురము. ఈ భవనాలలో అమ్మవారు పదునాలుగు రూపాలలో నివసిస్తుంది.
లలితాదేవి నివసించే భవనం దేవ శిల్పులు నిర్మించాలి, అని, ఇక మిగిలిన భవనాలు కామేశ్వరపురి, భగమాలాపురి, నిత్యక్లిన్నాపురి అనే పేర్లతో నిర్మాణం జరగాలి అని త్రిమూర్తుల ఆదేశం విన్న విశ్వకర్ముడు మయుని సహాయంతో ప్రాకారాల నిర్మాణం చేస్తాడు.
*****
బ్రహ్మలోకానికి ఊర్ధ్వ భాగాన ఉన్న సర్వలోకమే మణిద్వీపం. పరాంబిక తన ఇచ్చానుసారం మనస్సుతో సంకల్పించుకొని  ఈ లోకం నిర్మించుకున్నది. ఇది కైలాసం కన్నా, వైకుంఠం కన్నా గోలోకం కన్నా అత్యధికం. ఈ ద్వీపానికి చుట్టూ అమృత సముద్రముంటుంది. రత్నాలు దొరికే ఇసుకతిన్నెలు కనువిందు చేస్తాయి. ఆ సముద్రపు ఒడ్డున రత్నద్రుమం అనే మహా వృక్షం ఉంటుంది. దాని పై నుండి చూస్తే కనిపిస్తుంది ఒక మహాప్రాకారం.
(సుధాసాగర మధ్యస్థా)
 మేరు పర్వతం 4 శిఖరాలు కలిగి ఉంటుంది. తూర్పు వైపు ఒకటి, నైఋతిలొ ఒకటి వాయవ్యంలో ఒకటి. ఒక్కొక్కటి 100 యోజనాల పొడుగు, 100 యోజనాల వెడల్పు కలిగి త్రిమూర్తుల ఆవాసాలుగా ఉంటాయి. నాలుగవ శిఖరం మధ్యభాగంలో 400 యోజనాల పొడువు 400 యోజనాల వెడల్పులో ఉంటుంది.

షోడశ శ్రీపురాలు, పర్వతాలు
"ప్రధమం మేరుపృష్ఠే చ నిషధే చ మహీధరే
హేమకూటే హిమగిరౌ పంచమం గంధమాదనే
నీలమేషే చ శృంగాఖ్యే మహేంద్రే చ మహాగిరౌ
(సుమేరు మధ్య శృంగస్థా శ్రీమన్నగర నాయికా)
సముద్రాలు
లవణాబ్ధీక్షుసారాబ్ధి ధృత సాగరాః దధి సింధుర్జలసింధుశ్చ సప్తమః
మధ్యనున్న శిఖరంలో ఉన్నదే శ్రీపురం. 7 నలుచదరపు లోహపు గోడలతో, నిర్మించబడి ఉంటుంది.(ఈ గోడలే ప్రాకారాలు కోటలు అని కూడా అనబడుతాయి.)
ఒక్కొక్క ప్రాకారం మధ్య 7 యోజనాల దూరం ఉంటుంది.
మొదటిది అయోధాతు నిర్మితం. ఇనుముతో ధాతు శిలలతో దృఢంగా నిర్మించబడ్డ  ప్రాకారం. 16 వేల యోజనాల చుట్టుకొలత కలిగి రకరకాల అస్త్రశస్త్రాలు ధరించిన రక్షకభటులు ఆ ప్రాకారం మీద కావలి తిరుగుతూ ఉంటారు. ఆ మహా ప్రాకారానికి నాలుగు దిక్కులా నాలుగు ద్వారాలుంటాయి. దేవి దర్శనం కోసం వచ్చిన దేవతలు వారి వెంట వచ్చే గణాలు ప్రతి ద్వారం వద్ద కనిపిస్తూ ఉంటారు. ప్రాకార ద్వారం దాటి లోపలికి వెళ్ళితే అడుగడుగునా సరస్సులూ రత్నద్రుమవాటికలు కనిపిస్తాయి.
ఆ సుందర వనాలు దాటి వెళ్ళితే కనిపించేది రెండవ ప్రాకారం, కాంస్య ప్రాకారము. ఇది ఇనుప కోటకన్నా నూరు రెట్లు కాంతి కలిగి ఉంటుంది. వీటి రెంటి మధ్యనున్న భాగం రత్న వృక్షాలతో అందమైన వనాలతో నిండి కనుల పండుగగా ఉంటుంది. కోకిలారవాలు, భ్రమర నాదాలు మారుమోగుతూ ఉంటాయి. ఎటు చూసినా ఫలరసాల ప్రవాహాలు, ఎటు విన్నా శకుంతగానాలు. నెమళుల క్రేంకారాలు. కనులకు చెవులకు విందు చేస్తూ ఉంటాయి.
కాలచక్రము అనే సింహాసనము అధిరోహించిన మహాకాళి మాహాకాలుడు అక్కడి రక్షకులు.
మూడవది తామ్ర ప్రాకారం (రాగి కోట). చతురస్రాకారంలో ఉండి  కాంస్య ప్రాకారం లాగానే సప్త యోజనాల ఎత్తు. ఈ రెండు ప్రాకారలకు నడుమ కల్పవృక్షాల వనంతో నిండి ఉంటుంది. కనుక దీనిని కల్పవాటిక అని కూడా అంటారు. పండ్లలోని బీజములు కూడా రత్నాలే. వాటి సువాసనలు చాలా దూరము దాకా వ్యాపించి ఉటాయి. ఇది రెండవ ప్రాకారం. మధుశ్రీ, మాధవశ్రీ భార్యలగా ఉన్న వసంతుడు తామ్ర కుడ్యానికి రక్షకుడుగా ఉంటాడు. పుష్ప సింహాసనం మీద కూర్చొని, పుష్ప కిరీటం ధరించి, పుష్పచత్రంతో పుష్పభూషితుడుగా చిరునవ్వులు చిందిస్తూ భార్యలతో పూలబంతులతో ఆడుకుంటూ ఉంటాడు. వారి గంధర్వ గానం చెవులకింపుగా ఉంటుంది.
ఆ సుందరవనంలో దేవతలూ గంధర్వులూ జంటలుజంటలుగా విహరిస్తూ ఉంటారు.
తామ్రసాల దాటిన తరువాత కనిపించేది నాలుగవదైన సీసనిర్మిత ప్రాకారము. ఈ సీసముతో నిర్మించిన ఏడు యోజనాల ఎత్తు. తామ్రప్రాకారం, సీస ప్రాకారానికి మధ్య ఉన్న ప్రాంతం మొత్తం సంతాన వృక్షాలతో నిండి సంతానవాటిక అనబడుతుంది. బంగారు పువ్వులు ఎప్పుడూ వికసించే ఉంటాయి. చెట్ల మొదళ్ళోఅమృతరస పూర్ణ ఫలాలు ఉంటాయి. ఎండవేడికి తట్టుకోలేని ప్రాణులు ఆ వనంలో సంతానకవృక్షాల కింద సేదతీరుతూంటాయి. దేవతలు సిద్దులూ విలాసినీ మణులతో వనంలో విశ్రమిస్తూ ఉంటారు. శుక్రశ్రీ శుచిశ్రీ భార్యలుగా ఉన్న గ్రీష్ముడు తోటమాలి.
ఇత్తడితో చేయబడ్డ ఈ నాలుగవ ప్రాకారం కూడా ఏడు యోజనాల ఎత్తు కలిగి, రెండు ప్రాకారాల నడుమ హరిచందన వృక్షవాటిక వర్షరుతువు వనపాలకుడుగా ఉంటుంది. మెరుపులు కన్నులుగా పింగల వర్ణంలో తళతళలాడుతూ, మేఘాలు కవచంగా ధరించి , ఉరుము వంటి కఠద్వనితో, నిరంతరం వర్షపుజల్లులతో, నభశ్రీ నభ్యశ్రీ మొదలుకొని పన్నెండు మంది  భార్యలతో కూడి ఉంటాడు. ఆ ప్రాంతంలో దేవతలూ, సిద్దులూ దేవీ పూజాతత్పరులు ఈ వనాలలో పత్నులతో కలిసి నివసిస్తూ ఉంటారు. నదీ నదములు ఎక్కువగా ఉంటాయి. పచ్చటి లతలతో కళకళ్ళాడుతూ ఉంటుంది.
సీసప్రాకారం దాటిన తరువాత ఆరవదైన పంచలోహప్రాకారము కనిపిస్తుంది. ఈ ప్రాకారం కూడా ఏడు యోజనాల ఎత్తులోనే ఉంటుంది. ఈ రెండు ప్రాకారల మధ్య మందారతరువాటిక ఉంటుంది. ఈషశ్రీ, ఊర్జశ్రీ (ఇష్టలక్ష్మి,ఊర్జలక్ష్మి) అన్నభార్యలతో శరదృతువు రక్షకుడుగా వనమాలిగా ఉంటాడు.
తరువాత ఏడవ ప్రాకారము రజత నిర్మిత ప్రాకారము.(వెండి కోట). సహశ్రీ, సహస్యశ్రీ అన్న భార్యలతో హేమంతఋతువు ఆ కోటకు రాజు. ఆ ప్రాంతమంతా పారిజాతవనాలతో నిండి ఉండి ఆ పూల వాసన పది యోజనాల వరకు వ్యాపించి ఉంటుంది.
వెండి ప్రాకారం దాటితే ఎనిమిదవ ప్రాకారము కనిపిస్తుంది సౌవర్ణప్రాకారము (బంగారపు కోట). ఏడు యోజనాల ఎత్తు ఉన్న ఈ ప్రాకారం బంగారంతో కట్టబడి ఉండి మధ్యలో కదంబ వృక్షంతో అలరిస్తూ ఉంటుంది.
(కదంబవనవాసినీ)
నిరంతరం పూలతో పండ్లతో నిండి ఉండి నాలుగు పక్కల నుండి తేనెధారలు కారుతూ ఉంటాయి. దేవి భక్తులు ఆ మకరందాన్ని త్రాగి ఆనందానుభూతి పొందుతూ ఉంటారు. శిశిరఋతువు ఆ ప్రాకారపు అధినేత. తపశ్రీ,తపస్యశ్రీ అనే భార్యలతో శిశిఋడు ఆనంద సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు.
తొమ్మిదవదైన పుష్పరాగ ప్రాకారం సౌవర్ణ ప్రాకారము దాటిన తరువాత కనిపిస్తుంది. కుంకుమ వంటి అరుణకాంతులు చిమ్ముతూ ఉంటుంది. ఈ ప్రాంతంలో నేల కోనేరులతో సహా వనాలు ఉపవనాలు వృక్షాలు ఎగిరే పక్షులు. కదిలే జంతువులు, పారే నీళ్ళు మండపాలు మండప స్తంభాలు అన్ని పుష్యరాగమయాలే. సౌవర్ణసాల కన్నా తేజస్సులో లక్షరెట్లు అధికం.

ఈ పుష్యరాగ ప్రాకారంలో దిక్పాలకులు నివసిస్తూ ఉంటారు.
తూర్పు దిక్కున ఉన్న భవంతిలో అమరావతి ఉంటుంది. ఇక్కడ మహేంద్రుడు ఐరావతం అధిరోహించి వజ్రాయుధం చేతబూని, శచీదేవితో సహా కొలువై ఉంటాడు. స్వర్గలోకంలో కన్నా ఇకడ భోగం వేయిరెట్లు.
ఆగ్నేయమూలన ఉన్నది వహ్నిపట్టణం. ఆ పట్టణంలో తన ఇద్దరు భార్యలైన స్వాహా స్వధాలతో కూడి కొలువై ఉంటాడు.
దక్షిణ దిక్కున ఉన్నది యమపురి. యమధర్మరాజు దండధారి అయి చిత్రగుప్తుడితో యమభటులు వాహనమైన మహిషం ఇక్కడ దర్శనమిస్తాయి.
నైఋతి కోణం రాక్షస స్థావరం. నిరృతి గొడ్డలి చేతబూని భార్యా సమేతంగా ఇతర రాక్షసులతో కొలువుతీరి ఉంటాడు.
పశ్చిమ దిక్కున వరుణుడి రాజ్యం. భార్య వారుణితో వాహనమైన ఝష (పెద్ద చేప)వాహనం అధిరోహించి పాశం చేతబూని వారుణీ మధువు త్రాగుతూ మత్తులో ఉంటాడు. జలచరాలు చుట్టు నడయాడుతుండగా విహరిస్తూ ఉంటాడు.
వాయవ్య మూలనున్నది వాయులోకం. ప్రాణాయామ సంసిద్ధులైన యోగి సమూహం ఇతడి పరివారము. ద్వజము చేతబూని మృగవాహనుడై, నలభై తొమ్మిది మంది మరుద్గణాలు వెంటరాగా విహరిస్తూ ఉంటాడు.
ఉత్తర దిక్కున ఉన్నది యక్షలోకం. యక్షరాజు కుబేరుడు వృద్ధి ఋద్ది శక్తులతో నవనిధులకు అధిపతై మణిభద్రాది యక్ష సేనానులు పరివేష్టులై ఉండగా ఈ కోటలో నివసిస్తూ ఉంటాడు.
ఈశాన కోణంలో ఉన్నది రుద్రలోకం అనేక రత్నాలతో అలంకరింపబడిన భవంతిలో రుద్రదేవుడు నివసిస్తాడు. వీపున అమ్ములపొది ఎడమ చేతిలో ఎక్కుపెట్టిన ధనుస్సు ధరించి ఉంటాడు.నేత్రాలు ఎల్లప్పుడూ కోపంతో ఎర్రబడి ఉంటాయి. అతని వెన్నంటి అసంఖ్యాక రుద్రులు   వెన్నంటి ఉంటారు. భద్రకాళీతో సహా ఇతర ప్రముఖ మాతృకలు పరివేష్ఠించి ఉండగా కోట్లాది రుద్రాణులు వీరి వెన్నంటే ఉంటారు.
డామర్యాది గణాలు, వీరభద్రాది సేనానులు పరివేష్టియై మహారుద్రుడు విరాజిల్లుతూ ఉంటాడు.
(డామర్యాదిభిరావృతా)
డమరు ధ్వనులు, ప్రమధగణాలు రుద్రగణాలతో బీకర వాతావరణం కనిపిస్తూ ఉన్న ఈ రుద్రలోకానికి భూతసంఘంతో కొలువు తీరి ఉన్న భూతావాసుడు మహేశుడు ఈ ఈశాన దిక్పతి. అతని పేరు కూడా ఈశానుడే.
ఈ విధంగా అష్ట దిక్పాలకులతో విలసిల్లుతున్న పుష్యరాగ ప్రాకారం దాటిన తరువాత కనిపించేది పద్మరాగ ప్రాకారం. ఇది కూడా పది యోజనాల ఎత్తులో ఉండి కుంకుమకాంతులే వెదజల్లుతూ ఉంటుంది. ఈ రెండు ప్రాకారాల మధ్య ఉన్న ప్రాంతము నేల చెట్ట్లు చేమలు సమస్తమూ పద్మరాగమయమే. ఈ ప్రాకారంలో రకరకాల ఆయుధాలు ధరించి, వివిధ రత్నాలంకృతులైన చతుషష్టి కళాశక్తులు ఈ ప్రాంతంలో కనిపిస్తారు. ఈ అరవైనాలుగు శక్తులు అమ్మవారి కళాంశ రూపాలు. వీరందరికీ ఎవరి లోకం వారికి ఉంది. ఎవరి వాహనాలు వారికి ఉంటుంది. ఆగ్రహంతో ఊగిపోతూ జ్వాలామాలికల్లాంటి నాలుకలు చప్పరిస్తూ, అంతటినీ సర్వనాశనం చేస్తాం యుద్దం యుద్దం అంటూ నినాదలు చేస్తూ ఉంటారు. వీరి శిరోజాలు రాగి వర్ణంలో ఉండి రాగితీగల్లాగా నిక్కబొడుచుకుంటూ ఉంటాయి. ఈ జగత్తులో వీళ్ళు తలుచుకుంటే చేయలేనిదేమీ ఉండదు.
(మహాచతుషష్టికోటి యోగినీగణసేవితా)
పద్మరాగప్రాకారం దాటిన తరువాత కనిపించేది పది యోజనాల ఎత్తు ఉన్న గోమేధిక రత్నమయమైన ప్రాకారం గోమేధికప్రాకారం. కొత్తగా వికసించిన జపాపుష్ప వర్ణంలో ఉంటుంది. నేల చెట్లు, తటాకాలు, ఇళ్ళు స్తంభాలు,ఇది అది అనేమిటి సర్వం గోమేధికమణులతో నిర్మించబడి కనిపిస్తాయి.
ఈ ప్రాకారంలో ముప్పై రెండు మహాశక్తులు గోమేధికమణులతో చేయబడ్డ ఆభరణాలు ధరించి, రకరకాల ఆయుధాలు చేతబూని,  నిరంతర యుద్దాసక్తులై కనిపిస్తారు. కళ్ళు కోపంతో ఎర్రబడి ఉంటాయి. పిశాచ వదనాలతో,చక్రాల వంటి చేతులతో ఎవరినో ఒకరిని చంపు నరుకు అంటూ నినాదాలు చేస్తూ వుంటారు. ప్రతి ఒక్కరి వద్ద పరాజయము ఎరగని అత్యంత బలమైన పది అక్షౌహిణుల సైన్యం ఉంటుంది. వారు తలుచుకుంటే బ్రహ్మాండాలన్నిటిని గెలిచే శక్తిగలవారు. ఈ ప్రాకార వాసులు ఈ మహాశక్తులను ఆరాధిస్తూ ఉంటారు.
లెక్కలేనని రధాలు ఏనుగులు ఇతర వాహనాలు ఇక్కడ కనిపిస్తాయి.
దేవి యుద్దానికి సంబంధించిన సామాగ్రి మొత్తం గోమేధిక ప్రాకారంలో నిలవ వుంటుంది.
గోమేధిక ప్రాకారం దాటితే కనిపించేది వజ్రమయప్రాకారము. ముందటి ప్రాకారాలవలె ఇక్కడ  అంతా వజ్రమయం.  ప్రాకారంలో అనంగరూప, అనంగమదన, మదనాతుర, భువనవేగ, సర్వశిశిర, అనంగవేదన, అనంగమేఖల,అన్న ఎనిమిదిమంది భువనేశ్వరీదేవి పరిచారికలు లక్షలాది సేవకులు చుట్టుముట్టి కనిపిస్తారు. ఒకరిని మించి ఒకరు సౌందర్యవంతులు. రకరకాల సౌందర్య సాధనాలు చేత బట్టి ఉంటారు. వివిధ కళలలో ఆరితేరినవారు. అమ్మ కరుణాకటాక్షం ముందర ఇతరమేవీ కంటికి కనిపించవు. విద్యుల్లతల వంటి కాంతితో ప్రకాశిస్తూంటారు.
దేవి పరిసరాలలో వారు నడయాడుతున్నప్పుడు నాలుగు పక్కలా మెరుపుల కాంతి కనిపిస్తుంది.
ప్రాకారపు ప్రహరీ గోడ బయటి భాగాన ఎనిమిదిమంది సఖుల నివాస గృహాలు ఉంటాయి. ఆ గృహాలలో వివిధ ఆయుధాలు వాహనాలు నిండి ఉంటాయి.            

No comments:

Post a Comment