Thursday, December 11, 2025

 *🪷ఓం శ్రీమాత్రే నమః|ఓం నమః శివాయ🪷* 
*🧘శ్రీ లలితోపాఖ్యానం🧘‍♀* 
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥


శ్రీ మాత్రే నమః
"హయగ్రీవా! కలియుగంలో భక్తులకు సర్వసుఖాలూ, మోక్షం ఇవ్వటానికి భండాసురుని వధించటానికి పరాశక్తి లలితాదేవి రూపంలో అవతరిస్తుంది అని తెలిపావు. భండాసురుడు ఏ విధంగా జన్మించాడు? లలితాదేవి ఏ విధంగా ఆవిర్భవించింది? ఆమె భండాసురుని ఏ విధంగా సంహరించిందో సవివరంగా తెల్పవలసింది." అని అగస్త్య మహర్షి హయగ్రీవుని ప్రశ్నిస్తాడు.
హయగ్రీవుడు లలితాదేవి ఆవిర్భావం వివరిస్తాడు.
దక్షుని కూతురైన సతీదేవికి శివుడితో వివాహం అవుతుంది. కాని క్రమేపి శివుని పట్ల విముఖత పెంచుకున్నదక్షుడు  శివుని ప్రమేయం లేకుండా  యాగం చేయటానికి సంకల్పిస్తాడు. కూతురైన సతీదేవిని కూడా ఆహ్వానించడు. తండ్రి అంతరంగం తెలియని సతీదేవి ఆయన తలపెట్టిన యాగం గురించి తెలుసుకొని ఆనందంతో ఉప్పొంగి పోతూ,  భర్త వెళ్ళొద్దని వారిస్తున్నా లెక్కచేయక యాగానికి వెళ్ళుతుంది.
కూతురి మమకారం పట్టించుకోని దక్షుడు   ఏర్పరుచుకున్న ద్వేషభావంతో పదేపదే శివుని గురించి దుర్భాషలాడుతూ సతీదేవిని అవమానిస్తాడు. ఆ అవమానాలని తట్టుకోలేని సతీదేవి తన యోగశక్తితో అగ్నిని ఆవాహించి ప్రాణత్యాగం చేస్తుంది. జరిగిన ఘోర సంఘటన గురించి విన్న పరమశివుడు మహోగ్రుడై జటాజూటం నుండి ఒక వెంట్రుకను పీకి అందునుండి వీరభద్రుడిని సృష్టించి దక్షుని మీదకు పంపిస్తాడు. వీరభద్రుడు దక్షుని యాగస్థలిని సర్వనాశనం చేసి, విష్ణుచక్రాన్ని కూడా మింగేసి, దక్షుని తల తెగనరుకుతాడు. అది చూసిన దక్షుని పత్నులు వీరభద్రుడి కాళ్ళ మీద పడి శరణు వేడుకోగా ఒక మేక తలను తెచ్చి దక్షుని మొండానికి అతికించి అతనిని పునరుజ్జీవుని చేస్తాడు. అట్లా ప్రాణం పోసుకున్న దక్షుడు పశ్చాత్తాపంతో శివుడిని క్షమాపణ వేడుకుంటాడు.
ఆ విధంగా ప్రాణత్యాగం చేసిన సతీదేవి, పరాశక్తిని సంతానంగా పొందాలని ఘోర తపస్సు ఆచరిస్తున్న హిమవంతుడు మేనకలకు బిడ్డగా జన్మిస్తుంది. పర్వతరాజుకు కూతురైన ఆమెకు పార్వతి అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచుకుంటాడు  హిమవంతుడు.
***
నారదుడు హిమవంతుడి వద్దకు వస్తాడు. "హిమవంతా, సాక్షాత్ ఆదిపరాశక్తిని సంతానంగా పొందిన నువ్వు నిజంగా ధన్యుడవి. సతీదేవి తనను వదిలి వెళ్ళిపోయిన తరువాత పరమేశ్వరుడు సన్యాసిగా మారి స్థాను ఆశ్రమంలో తపస్సు చేస్తున్నాడు. నీ కుమార్తెను ఆయన సేవకు వినియోగించావంటే నీకు శ్రేయస్కరం." అన్న నారదుని మాటలకు హిమవంతుడు ఎంతగానో సంతోషిస్తాడు. శివుడు తన కుమార్తెను వెంటబెట్టుకొని తపస్సు చేసుకుంటున్న స్థావరానికి వెళ్ళి ముందుగా నంది అనుమతి తీసుకొని శివుని వద్దకు వెళ్ళి పార్వతిని ఆయన సేవలకు వియోగించటానికి అనుమతి వేడుకుంటాడు. తన సమ్మతి తెలిపిన శివునికి ఆ నాటి నుండి సేవలు చేయసాగింది పార్వతి. పరమేశ్వరుడు నిరంతరం యోగదీక్షలో ఉంటాడు.
ఆ విధంగా సమయం గడుస్తూండగా తారకుడు అనే రాక్షసుడు స్వర్గంలోని దేతలను బాధించటం మొదలెడతాడు. అతను పెట్టే హింసలు భరించలేని దేవతలు బ్రహ్మ వద్ద మొరపెట్టుకోగా, ఆయన, "శివునికి పార్వతికి కలిగే పుత్రుడే ఆ అసురుడిని చంపగలుగుతాడు. కాబట్టి మీరంతా కలిసి శివపార్వతుల కళ్యాణం జరిగేలా ప్రయత్నించండి." అంటాడు.
బ్రహ్మ తాను చేస్తున్న సృష్టి అభివృద్ధి చెందక పోవటంతో శ్రీహరిని గూర్చి తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చుకొని ప్రత్యక్షమైన లక్ష్మీ నారాయణులు బ్రహ్మ మనస్సులొని కోరిక తెలుసుకుంటారు. లక్ష్మీ శ్రీహరుల చూపుల నుండి మన్మధుడు జనిస్తాడు. అతనికి పుష్పబాణాలు, చెరుకు విల్లు ఆయుధాఅలగా ప్రసాదిస్తారు. ఇంద్రుడు మన్మధుడిని పిలిపిస్తాడు. మాటలతో మన్మధుడి గొప్పదనాన్ని ఎంతగానో ప్రశంసలతో ముంచెత్తి,
"మన్మధా! శ్రీహరి ప్రసాదం వలన నీవు  ఆయుధాలు పొందావు. మేమందరమూ తారకుని వలన ఎన్నో బాధలు పడుతున్నాము. అతనికి పరమేశ్వరుడి కుమారుడి చేతిలో తప్ప  మరణం లేదు. తపస్సులో మునిగి ఉన్న పరమేశ్వరుడిని పార్వతి సేవించుకుంటున్నది. నీవే వారిద్దరి మధ్య అనురాగం కలిగి వివాహానికి దారి తీసేలాగా చూడ శక్తి కలవాడివి." అని మన్మధుని ప్రేరేపిస్తారు. శివునిలోని వైరాగ్యం అంతరించి, వివాహానికి సన్నద్ధుడిని చేయమని ఆదేశిస్తాడు.
***
ఇంద్రుడి పొగడ్తలతో ఉబ్బితబ్బిబైన మన్మధుడు, భార్య రతీదేవి ఎంత వారిస్తున్నా వినకుండా శివుడు తపస్సు చేసుకుంటున్న స్థాను ఆశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ ఒక అందమైన వసంతఋతువు వంటి వాతావరణం సృష్ఠిస్తాడు. అందమైన ఆవతావరణం చూసిన శివుని ప్రమధగణాల మనసు చెదిరిపోతుంది. అది చూసిన నంది ప్రమధగణాలని మందలించి తిరిగి వారి మార్గానికి వారిని పంపిస్తాడు. ఆ సమయానికి మన్మధుడు యోగముద్రలో ఉన్న శివుడి ముందరికి వస్తాడు. అదే సమయానికి పార్వతి శివుడికి సేవలందించటానికి అక్కడకు వస్తుంది. శివునికి నమస్కారం చేసి లేవబోతున్న పార్వతి వస్త్రం కొద్దిగా పక్కకు తొలుగుతుంది. అదే సమయంలో మన్మధుడు శివుని మీదకు బాణం సంధిస్తాడు.

దానితో శివుని మనస్సు చెదురుతుంది కాని వెంటనే ఆ మార్పుకు కారణమేమిటని చుట్టూ పరికించి చూస్తాడు. పొదల మాటున దాగి ఉన్న మన్మధుడు కనిపించగానే శివుడు మూడవ కన్ను తెరుచుకొని ఆ అగ్నిజ్వాలలకు మన్మధుడు  భస్మమైపోతాడు. అది చూసిన పార్వతి భయంతో కళ్ళు మూసుకొని కొడ్డి సేపటి తరువాత తెరిచి చూసేటప్పటికి శివుడు అక్కడి నుండి మాయమైపోతాడు. హిమవంతుడు వచ్చి కూతురిని ఓదార్చి తనతో తీసుకొని వెళ్ళుతాడు. శివుడి ఆగ్రహానికి గురై బూడిదగా మారిన భర్తను చూసిన రతీదేవి కన్నీరు మున్నీరైపోతుంది. వసంతఋతువుకు అధిపతైన వసంతుడు వచ్చి రతీదేవిని సముదాయించి మన్మధుడికి బ్రహ్మ ఇచ్చిన శాపం గుర్తు చేస్తాడు.
*
సుందోపసుందులను అంతం చేయటానికి బ్రహ్మ తిలోత్తమను సృష్టిస్తాడు. కాని మన్మధుడు చిలిపిగా తన బాణం బ్రహ్మ వైపు సంధించేటప్పటికి ఆయన కూడా తిలోత్తమ తన కూతురు అన్న విషయం విస్మరించి  వ్యామోహంతో ఆమె వెంటపడతాడు. అది చూసిన తిలోత్తమ భయంతో లేడి రూపంలో పారిపోతుంది. బ్రహ్మ కూడా మగలేడిగా మారి ఆమె వెనక పోతాడు. ఆ దృశ్యం చూసిన దేవతలు భయభ్రాంతులౌతారు. రాబోతున్న ప్రమాదం పసిగట్టిన శివుడు ఒక వేటగాడిగా మారి బాణం సంధించి బ్రహ్మ ముందుకు వస్తాడు. శివుని భయంకర రూపం చూసిన బ్రహ్మ వాస్తవానికి వచ్చి తను చేయబోయిన ఘోరం తెలుసుకుంటాడు.
ఈ సంఘటన తరువాత మన్మధుడు చేసిన చిలిపితనం తెలుసుకున్న బ్రహ్మ అతనిని పిలిపించి, "నీకు ఇచ్చిన అధికారం దుర్వినియోగం చేసిన అనర్ధం శివుడి రాకతో నివారింపబడ్డది. ఏదో ఒకనాడు నువ్వు శివుడి ఆగ్రహజ్వాలలకు భస్మమౌతావు." అని శపిస్తాడు. శాపం విన్న రతీమన్మధులు భయంతో శాపవిమోచన కోసం బ్రహ్మను ప్రార్ధిస్తారు.
"ఆదిపరాశక్తి లలితాదేవి అవతారం ఎత్తుతుంది. ఆ అవతారంలో శివుడిని వివాహమాడుతుంది. ఆ వివాహం అనంతరం మన్మధుడు తిరిగి తన రూపం పొందగలుగుతాడు." అని శాప విమోచనం తెలుపుతాడు.
ఆ వృత్తాంతం వినిపించిన వసంతుడు,"అమ్మా! ఎంతటివారైనా శాపఫలితం అనుభవించక తప్పదు. ఏది ఏమైనా బ్రహ్మ చెప్పినట్టు నా సోదరుడు మన్మధుడు తిరిగి పుడుతాడు. అంతవరకు ధైర్యంగా ఉండి లలితాదేవిని పూజిస్తూ ఉండు." అని ధైర్య వచనాలు పలుకుతాడు.
*
రుద్రగణాల నాయకులలో ఒకడైన చిత్రకర్మ భస్మమైన మన్మధుడి బూడిదతో ఆడుకుంటూ బాలుడి రూపంలో ఒక బొమ్మను తయారు చేస్తాడు. అట్లా తయారు చేసిన బొమ్మను శివుడి వద్దకు తీసుకెళ్ళి చూపిస్తాడు. శివలీలలు అనిర్వచనీయం కదా! శివుడి వద్దకు వెళ్ళుతూండగానే ఆ బొమ్మకు ప్రాణం వచ్చి బాలుడు ఒక్క గెంతుతో శివుడికి, చిత్రకర్మకు ప్రణామం చేస్తాడు. చిత్రకర్మ ఆనందానికి పట్టపగ్గాలు ఉండవు. ఆ బాలుడికి శతరుద్రీయ మంత్రం ఉపదేశించి తపస్సు చేసుకోమని ఆదేశిస్తాడు. ఆ బాలుడు అదే విధంగా మంత్ర పఠనం చేస్తూ తపస్సు చేయటం మొదలెడతాడు. తపస్సు చివరిదశకు చేరుతూండగా శివుడు ప్రత్యక్షమౌతాడు.  బాలుడు ఆనందంతో  "నాతో యుద్దం చేసిన వారెవరైనా తమ శక్తిలో సగం పోగొట్టుకోవాలి. ఆ శక్తి నా శక్తిలో చేరాలి. నా ప్రత్యర్ధి ఉపయోగించే ఏ ఆయుధమూ నన్ను బంధించకూడదు."  అంటూ ప్రత్యేకమైన వరాలు ప్రసాదించమని వేడుకుంటాడు. శివుడు వెంటనే  వరాలు ప్రసాదించటమే కాక, అరవై సంవత్సరాలు రాజ్యం ఏలేటట్టు మరో వరం కూడా ఇస్తాడు.
ఇదంతా గమనించిన బ్రహ్మ విసుగ్గా  "సిగ్గు, సిగ్గు" అని అర్ధం వచ్చేలాగా "భండ భండ" అంటాడు. రాక్షస ప్రవృత్తి వున్నవాడవటం చేత భండాసురుడు అన్న పేరు వస్తుంది.
మహేశ్వరుని క్రోధాగ్ని నుండి పుట్టటం వలన భండుడు మహా బలవంతుడు అయ్యాడు.
ఈ లోగా మిగిలిన మన్మధుడి బూడిద నుండి విశుక్ర, విషంగ అన్న ఇద్దరు రాక్షసులు పుడ్తారు. వారిద్దరూ భండాసురుడి ముఖ్య అనుచరులౌతారు. వారితో పాటు వేలాది మంది రాక్షసులు ఆ బూడిద నుండి పుట్టుకొస్తారు. వారంతా కలిసి భండాసురుని 300 అక్షౌహిణుల సైన్యంగా ఏర్పడుతారు.
అట్లా అన్ని వేలమంది రాక్షసులు జన్మించారని తెలుసుకున్న అసుర గురువు శుక్రాచార్యుడు వారికి గురుత్వ బాధ్యత తీసుకొని నిత్య అనుష్టానాలు నిర్వర్తించమని వారిని ఆదేశిస్తాడు. దేవశిల్పి మయుడిని రప్పించి మహేంద్ర పర్వతాల మీద శోణితపురము (శూన్యక పట్టణం) అనే నగరాన్ని నిర్మింపచేస్తాడు.
మయుడు శూన్యక పట్టణాన్ని స్వర్గం కంటే ఎక్కువ అందంగా తీర్చి దిద్దుతాడు మయుడు. బ్రహ్మ చేత హిరణ్యకశిపుడికి ఇవ్వబడిన కిరీటము, చామరాలు, గొడుగు, విజయము అనే ధనువు, సింహాసనాన్ని స్వీకరించి పట్టాభిషిక్తుడైతాడు.
రాక్షసులను ఆ నగరానికి రప్పించి భండాసురుడిని రాజుగానూ, విశుక్రుని, విషంగుడిని యువరాజులుగా నియమిస్తాడు. భండాసురుడికి సమ్మోహిని, కుముదిని, చిత్రాంగి, సుందరి అన్న నలుగురు  భార్యలు వుంటారు.
శుక్రాచార్యుడి ఆధ్వర్యంలో హోమాలు వేదపఠనం తపస్సు సక్రమంగా జరుగుతూ ఉండేవి.
అతను ధర్మపరుడై శివారాధన తత్పరుడై యజ్ఞయాగాలు చేస్తూ చక్కగా పరిపాలిస్తూ ఉంటాడు. అతని బలం పెరుగుతూ ఉంటుంది. ఇంద్రుని బలం తరిగి పోతూ ఉంది.  (ఇంకా ఉంది)         

No comments:

Post a Comment