🔱ఓం నమః శివాయ🔱: *శ్రీ లలితో పాఖ్యానము*
లలితాదేవి తన పరిసరాలలో ఉన్న సైన్యాన్ని గమనిస్తూ ఉన్న అవకాశం చూసుకొని విషంగుడు హఠాత్తుగా రధం వెనక వైపు నుండి విపాటవం అన్న ఆయుధంతో దాడి చేస్తాడు. అక్కడే ఉన్న అణిమాదేవితో సహా ఇతర దేవతలు ఒక్క క్షణం అవాక్కయి మరుక్షణమే తేరుకొని తిరుగుదాడికి సిద్దమయ్యారు. సరిగ్గా అదే సమయంలో కుటిలాక్షుడు 10 అక్షౌహిణుల సైన్యంతో ముందు నుండి దాడి చేయ ఉపక్రమిస్తాడు.
రెండు పక్కల నుండి జరుగుతున్న దాడిని చూసిన లలితాదేవికి ఆగ్రహం కలుగుతుంది. ఈ లోగా విషంగుడు సంధించిన బాణం తగిలి లలితాదేవి చేతిలోని వింజామర విరిగి కింద పడుతుంది.
అది చూసిన కామేశ్వరి మొదలైన దేవతలు కోపించిన వారై మాతను సమీపించి, వహ్నివాసిని జ్వాలామాలిని అన్న నిత్యదేవతలకు స్వయం ప్రాకాశన శక్తి కలదని, వారే కనుక తమ ప్రకాశం ప్రదర్శిస్తే అంధకారంలో ఉన్న రాక్షసులు వెలుగులోకి వస్తారని విన్నవించుకుంటారు. లలితాదేవి అనుమతితో వహ్నివాసిని జ్వాలామాలిని అగ్ని గుండాల వలె ప్రకాశించ సాగారు.
చీకటి మాటున దాక్కొని యుద్దం చేస్తున్న రాక్షసులందరు ఆ ప్రకాశం ఫలితంగా వెలుగులోకి వస్తారు. లలితాదేవి యొక్క షోడశ నిత్యాదేవతలు వారిని హతమార్చి వేస్తారు. మిగిలిన సేనాధిపతులందరు మరణించటంతో విషంగుడు శరీరమంతా గాయాలతో నిర్లజ్జగా రణరంగం నుండి పారిపోతాడు.
***
విషంగుడు రణరంగం నుండి వెనుతిరగటం చూసిన కుటిలాక్షుడు కూడా పారిపోతాడు. నిత్యాదేవతల పరాక్రమం చూసిన లలితాదేవి ఆనందం పొందుతుంది. (నిత్యాపరాక్రమతోప నిరీక్షణ సమత్సుక)
అనుకోకుండా రాత్రి సమయంలో జరిగిన దాడి చూసిన మంత్రిణీ దేవి, దండనాథ దేవి దుఃఖితులౌతారు. అంత పటిష్టమైన రక్షణ ఏర్పాటు చేసినా అసురుల దాడి నుండి తట్టుకోలేక విఫలమయిపోయిందని బాధ పడతారు.
(అగ్ని ప్రాకారము)
ఇరువురు కలిసి లలితాదేవి వద్దకు వెళ్ళి జరిగిన సంఘటనకు తమ బాధ వ్యక్తపరిచి, కోట రక్షణకై మరింత పటిష్టమైన ఏర్పాట్లు చేస్తారు.
లలితాదేవి, జ్వాలామాలిని దేవిని,"ఓ వత్సా, నీవు అగ్నిస్వరూపవు. జ్వాలామాలలే నీ ఆకారము. కనుక సైన్యం చుట్టూతా 100 యోజనాల వెడల్పు, 30 యోజనాల పొడవు ఉన్న ఒక అగ్ని ప్రాకారం నిర్మాణము చేయి." అన్న ఆఙ్ఞతో జ్వాలామాలిని అగ్ని ప్రాకారం నిర్మిస్తుంది.
(ఒక యోజనము షుమారుగా 8 మైళ్ళు).
దేవి సైన్యం రాకపోకలకు వీలుగా శూన్యపురానికి అభిముఖంగా గోడకు దక్షిణ కొస వద్ద ఒక యోజనం భాగం వాకిలి ఏర్పాటు చేస్తుంది.(జ్వాలామాలనికాక్షిప్త వహ్నిప్రాకారమధ్యగా).
దండనాథ దేవి కూటమిలో ఒకరైన స్థంభినీదేవి 20 అక్షౌహిణి సేనతో వాకిలి వద్ద కావలి ఉంటుంది. శత్రువుల కోట ఆక్రమణకు విఘ్నకారిణి అయినందున ఆమెను విఘ్నదేవి అని కూడా అంటారు.
ఏర్పాట్లన్ని పూర్తయ్యే సరికి సాయం సమయం అవుతుంది.
ఈ సమాచారం తెలిసిన భండాసురుడికి భయం ఆవరించి తదుపరి కార్యం గురించి ఆలోచించసాగాడు. ఈ మారు చతుర్బాహు మొదలుకొని ఉపమాయుడి వరకు తనకున్న 30 మంది కొడుకులను యుద్దరంగంలో దింపుతాడు. "కుమారులారా, ఈ సృష్టిలో మీతో సమానమైన వారు మరెవ్వరూ లేరు. మాయావి యైన ఒక స్త్రీ మనవారినందరినీ సంహరిస్తోంది. మీరు ఆమెను ఓడించి సజీవంగా పట్టుకోండి." అని ఆదేశిస్తాడు.
యుద్దరంగంలో దేవికి కుడి ఎడమలలో శ్యామలా దండనాయికలు, ముందు వెనుక సంపత్కరీ అశ్వారూఢలు సైన్యసమేతులై వ్యూహాలు పన్ని రక్షణగా ఉన్న సమయంలో భండపుత్రులు అమితమైన సైన్యంతో ఒక్కసారిగా వెనక నుండి ముట్టడి చేస్తారు.
ఆ సమయంలో ముమ్మూర్తులా తల్లినే పోలి ఉన్న లలితాదేవి కుమార్తె అయిన బాలాదేవి తల్లి సమీపంలో ఉంటుంది. ఆమె నిత్య బాలాస్వరూపిణి. భండాసురుని కొడుకులు యుద్ద రంగంలోకి ప్రవేశించిన వార్త తెలిసి ఆ బాలిక వారిని తాను ఎదుర్కొంటానని అనుమతి ఇవ్వమని తల్లిని వేడుకుంటుంది. మొదట లలితాదేవి సందేహం వ్యక్తపరిచినా, కుమార్తె శౌర్యం ఆత్మశక్తి తెలుసుకొని భండపుత్రులను ఎదుర్కోవటానికి అనుమతించి కవచాన్ని బహుమతిగా ఇస్తుంది.
నూరు హంసలచే లాగబడుతున్న కర్ణీ అన్న రధం ఎక్కి బాలాదేవి యుద్దరంగంలోకి ప్రవేశించటం చూసిన మంత్రిణీ దండనాయకలు ఆశ్చర్యచకితులౌతారు. కాని వెను వెంటనే కర్తవ్యం తెలుసుకొని ఆమెకు సంరక్షణకు అంగరక్షకులుగా నిలబడతారు.
బాలాదేవి భండాసురుడి 30 మంది కొడుకులతో చేస్తున్న భీకరమైన పోరాటం చూసిన వారంతా విస్తుపోతారు. యుద్ధం రెండవరోజు పూర్తిగా బాలాదేవి పోరాటం కొనసాగించి ఆ సాయం సమయంలో ఒకేసారి 30 బాణాలు ప్రయోగించి 30 మంది భండాసుర పుత్రులను ఒక్కసారిగా హతమారుస్తుంది.
ఆ దృశ్యం చూసిన లలితా దేవి ఆనందంతో కుమార్తెను ఆలింగనం చేసుకుంటుంది.
(భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందితా).
****
విఘ్నయంత్ర నాశనం.
భండాసురుడు దుఃఖాక్రాంతుడౌతాడు.
"ఆ దుష్టురాలిని నా ఖడ్గంతో సంహరించి బంధువులతో విశ్రాంతి పొందుతాను." అని నిస్సహాయుడై స్వయంగా యుద్దరంగానికి తరలి వెళ్తాడు.
అతనిని సముదాయించిన విషంగుడు విశుక్రుడు తాము స్వయంగ శత్రువులను ఎదుర్కోవటానికి ఉద్యుక్తులౌతారు.
భండాసురుడు ముందుగా విషుక్రుడిని పోరుకు పంపిస్తాడు.
"విశుక్రా, శత్రువుల స్థావరమ్లొకి ప్రవేశించి జయవిఘ్నం అన్న యంత్రాన్ని స్థాపించు." అని ఆజ్ఞాపిస్తాడు.
రాత్రి అంధకారంలో విషుక్రుడు చుట్టూ కట్టబడ్డ వహ్నిప్రాకారం సమీపిస్తాడు. లోపలికి వెళ్ళటానికి మార్గం కనిపించక ప్రాకారానికి బయటే ఉండి శిలవట్టం అనే యంత్రాన్ని రచించి, బలిపూజలు చేసి, ఆ యంత్రం పై నుండి ప్రాకారం లోపలికి దూకుతాడు. ఒక చదునైన రాతి మీద ఒక తాంత్రిక గుర్తు రచించి కొన్ని తాంత్రిక పూజలు నిర్వహిస్తాడు. అనంతరం మంత్రించిన శిలవట్టం అన్న రాతిని బలమంతా ఉపయోగించి విసిరేస్తాడు.
అగ్నిప్రాకారం మీద ఒక ప్రాంతంలో ఆ రాయి పడుతుంది. వహ్నిప్రాకారంలో జయవిఘ్న యంత్రాన్ని స్థాపిస్తాడు. ఆ మాయా యంత్ర ప్రభావం వల్ల శక్తిసేనలో ఒక విధమైన అలసత్వం ఏర్పడుతుంది. వారిలో వారు వాదించుకోవటం మొదలెడుతారు.
ఈ యుద్దం చేయటమే తప్పు.
దేవతల పక్షాన యుద్దం చేయవలసిన అవసరం మనకు ఏముంది?
అసలు ఈ లలితాదేవి ఎవరు? మనమీద పెత్తనం చెలాయించటానికి ఆమెకు ఎవరు అధికారం ఇచ్చారు?
మనమందరమూ యుద్దం చేయటానికి నిరాకరిస్తే ఆమె ఏమి చేయగలుగుతుంది?
అఙ్ఞానపు నిద్ర ఆవహించిన వారు ఈ విధంగా తమలో తామే వాదించుకోసాగారు.
విశుక్రుడు అర్ధరాత్రి దాటిన తరువాత తన 30 అక్షౌహిణుల సైన్యంతో వహ్నిప్రాకారం ఆక్రమించుకుంటాడు. అప్పటికి కూడా శక్తిసేన విఘ్నయంత్రం కలిగించిన మాయనిద్ర నుండి లేవలేక పోతారు.
అంత జరిగినప్పటికి యంత్ర ప్రభావం దండనాథ మీద కాని మంత్రిణీదేవి మీదగాని పడదు. ప్రమత్తులై ఉన్న వారిరువురు శక్తిసేనకు పట్టిన దుస్థితి చూసి బాధపడతారు. ఏమి చేయాలో పాలుపోక తమ కర్తవ్యం ఏమిటని లలితాదేవిని ప్రశ్నిస్తారు. అప్పుడు లలితాదేవి కామేశ్వరుని వైపు చూసి చిరునవ్వు నవ్వుతుంది. ఆ చిరునవ్వులో నుండి గణపతి ఉద్భవిస్తాడు.
(కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా).
దేవి ఆదేశం ఇచ్చిన వెనువెంటనే గణపతి అగ్నిప్రాకారంలో వెతుకగా శక్తిసేనకు పట్టిన దుస్థితికి కారణమైన జయవిఘ్న మహా యంత్రం కనిపిస్తుంది. దానిని తన పళ్ళతో కొరికి ఛిన్నాభిన్నం చేస్తాడు.
(మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత).
గణేశ్వరుడు తన రూపాన్ని అనేక రూపాలగా మార్చి ఆమోదుడు, ప్రమోదుడు, సుముఖుడు, దుర్ముఖుడు, అరిఘ్నుడు, విఘ్నకర్త అని ఆరుగురు విఘ్నకర్తలను సృష్టిస్తాడు.
వారు ఏడు కోట్ల సైన్యానికి నాయకులుగా రాక్షసుల పైకి దాడి చేస్తారు. విఘ్నయంత్రం ధ్వంసం అవగానే శక్తిసేన తమను ఆవహించిన మాయ నిద్ర నుండి బయటబడి తిరిగి యుద్దానికి సన్నత్తులౌతారు. శక్తిసేన సహితుడై విఘ్నేశ్వరుడు వహ్నిప్రాకారం నుండి వెలుపలకు వచ్చి విషుక్రుడితో పోరు ఆరంభిస్తాడు.
ముందుగా గణపతి మీదకు పంపించిన గజాసురుడు అంతం అవటం చూసిన విషుక్రుడు రణరంగం నుండి పారిపోతాడు.
*
విశుక్ర విషంగ వధ
గజాసురుడు మరణించిన వార్త విన్న భండాసురిడితో చర్చలనంతరం తమ్ముడైన విషంగుడు, మేనల్లుడు ఉలూకుడూ వెంటరాగా విశుక్రుడు తిరిగి యుద్ద రంగానికి చేరుకుంటాడు. దీనితో మూడవరోజు యుద్దం ఆరంభమవుతుంది. మరో పక్క దండనాథ, మంత్రిణి శత్రువులపై తమ పోరు కొనసాగిస్తారు. చేతబూనిన హలాయుధాన్ని భీకరంగా తిప్పుతూ కిరిచక్ర రధం అధిరోహించిన దండనాథదేవి ముందుగా దారి తీయగా, విల్లంబులు ధరించిన మంత్రిణీదేవి గేయచక్ర రథం ఆరోహించి ఒక యోధుడి వలె వెనకనే అనుసరిస్తుంది.
దండనాథదేవి విశుక్రుడిని ఎదుర్కొనగా, అశ్వారూఢ, సంపత్కరీ దేవతలు వారి అల్లుళ్ళను ఎదుర్కొంటారు. రాక్షస సేన బలహీనమవటం గమనించిన విశుక్రుడు తృషాస్త్రం అన్న ఆయుధాన్ని ప్రయోగిస్తాడు. ఆ అస్త్ర ప్రభావం వల్ల శక్తిసేన విపరీతమైన దాహంతో బాధపడ సాగింది. ఇంద్రియాలన్నిశక్తిని కోల్పోయాయి. అస్త్రాలను విడిచి పెట్టి మూర్ఛ పోతారు.
దండనాథ వారాహిని పిలిచి, "దేవీ ఇది రాక్షస మాయ. వారు ప్రయోగించిన తృషాస్త్ర ప్రభావం. మన సైన్యానికి దాహం తీరే మార్గం ఆలోచించాలి." అనగానే దానికి ప్రతిచర్యగా తృష్ణ బాధితులకు ఉపశమనం కొరకు దండనాథదేవి కీరిచక్ర రధం నుండి మదిరా సింధువును ఆహ్వానిస్తుంది. మద్య సముద్రదేవత ఏనుగు తొండపు ధారలతో కురిపించిన మద్య వర్షంతో శక్తిసేన తమ దాహం తీర్చుకొని రెట్టింపైన ఉత్సాహంతో యుద్దం కొనసాగిస్తారు.సముద్రుడు చేసిన సహాయానికి సంతో షించిన దేవి, "సముద్రుడా దేవకార్యాన్ని చక్కగా నిర్వర్తించావు. నా అనుగ్రహం వలన ద్వాపర యుగంలో యజ్ఞం చేసే వారికి నీవు సోమపాన రూపంలో ఉపయోగ పడతావు. మంత్ర యుక్తంగా నిన్ను స్ఇకరించతంతో జనులు సిద్ధిని, బుద్ధిని బలాన్ని పొందుతారు." అని వరాన్ని ఇస్తుంది.
సాయం సమయానికి శత్రు సైన్యంలో భండాసురుని అల్లుళ్ళతో సహా చాలా భాగం మరణిస్తారు. ఈ లోగా శ్యామలాదేవి (మంత్రిణి) విషంగుడితో పోరాడి, బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగించి ఆ దానవుడిని సంహరిస్తుంది.దండనాథాదేవి (పోత్రిణి) విశుక్రుడిని హలాయుధంతో సంహరిస్తుంది. (మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత విశుక్రప్రాణహరణ వారాహి వీర్యనందిత)
ఆ పాటికి అర్ధరాత్రయింది. భండాసురుడిని ఓదార్చటానికి ఇంక మిగిలింది కుటిలాక్షుడు మాత్రమే.
"కుటిలాక్షా లలితాదేవి తన చూపుతోనే నా సోదరులను సంహరించింది. ఆమె కంఠం నుండి రతం ప్రవహిచేలాగా చేసి నా సోదరులకు శాంతి కలిగేలా చేస్తాను." అని ఆవేశంతో కుటిలాక్షుడి సమేతంగా భండాసురుడు యుద్దరంగంలోకి ప్రవేశిస్తాడు. అతని వెనక 2185 అక్షౌహిణుల సైన్యం 40 మంది సేనాపతులు ఉంటారు.
అతను ఆభిలము (భీకరమైన) అనే రథం ఆ‘రోహిస్తాడు.
అతను ఘాతకం (నరకంలో హింస) అన్న కత్తి చేపూనుతాడు.
రణరంగంలో ప్రవేశించిన భండాసురుడు వజ్రఘోషతో సమానమైన మేఘనాదం చేస్తాడు.
ఆ ధ్వని విన్న లలితాదేవి స్వయంగా శ్రీచక్ర రథంలో యుద్దరంగానికి బయలుదేరుతుంది. ఆమె వెనక గేయచక్ర రథంలో మంత్రిణీ దేవి, కిరిచక్ర రథంలో పోత్రిణి దేవి అనుసరిస్తుంటారు. ఆ వెనుక
కోట్లాది శక్తి దేవతలు అనుసరిస్తారు. ఆ దేవతలు శస్త్రాలు (మంత్రపూరితమైన ఆయుధాలు) ప్రత్యస్త్రాలు (శత్రువులు ప్రయోగిస్తున్న ఆయుధాలను ఎదుర్కొనే ఆయుధాలు) ప్రయోగించటంలో ఒకరి కన్నా ఒకరు ఏ మాత్రమూ తీసిపోరు.
( భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి)
భండాసురుడు ప్రయోగించిన మంత్ర తంత్ర ఆయుధాలలో అంధతామిస్రం అన్న అస్త్రం లలితాదేవి గాయత్రి అస్త్రం అంతకాస్త్రమును మృత్యుంజయాస్త్రంతో, సర్వాస్త్ర స్మృతిని ధారణ అస్త్రం తో ఎదుర్కుంటుంది. ఈ విధంగా ఇరువురూ అనేక శస్త్రప్రత్యస్త్రాలు ప్రయోగిస్తూ భీకర పోరాటం చేస్తూంటారు.
శక్తిసేనను ఆయుష్షును తగ్గించటానికి ప్రయోగించిన ఆయుః అన్న అస్త్రం ఎదుర్కోవటానికి లలితాదేవి ధనుస్సు నుండి అచ్యుతుడు, అనంతుడు, గోవిందుడు బయల్దేరి వారి హూంకారంతో భండాసురుడికి అస్త్ర ప్రభావం లేకుండా చేసి తల్లికి నమస్కరించి భూలోకానికి తిరిగి వెళ్ళిపోతారు.
మహాసురాస్త్రం నుండి పుట్టుకొచ్చిన మధుకైటభులను మహిషాసురుడిని రక్తబీజుడిని మరి ఇతర అసురులను పునర్జీవితుల చేస్తాడు. లలితా దేవి పెద్దగా వికటాట్టహాసం చేస్తుంది. అట్టహాసం నుండి చండీ సప్తశతిలోని ఇతర దేవతలతో సహా దుర్గాదేవి ఆవిర్భవిస్తుంది.
ఆమెకు పరమేశ్వరుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, అగ్ని శక్తిని, వాయువు ధనుస్సును, కుబేరుడు పానపాత్రను, యముడు కాలదండాన్ని, పాశాన్ని ఇస్తారు. ఆమె సింహాసనారూఢురాలై మహిషాసురాది రాక్షసులను సంహరిస్తుంది.
పిదప భండాసురుడు సోమకుడుని మరి కొంతమంది రాక్షసులని పుట్టిస్తాడు. అప్పుడు లలితాదేవి తన వేళ్ళ గోళ్ళ నుండి విష్ణు యొక్క పది రూపాలను ఆవిర్భింప చేస్తుంది.
(కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః)
నారాయణుడి దశావతారాలు ఆయా రూపాలలో వధించిన రాక్షసులనందరినీ భండాసురుడు సృష్టించటం ఆరంభిస్తాడు. లలితాదేవి. రెండు చేతుల యొక్క ఒక్కొక్క వేలు నుండి ఒక్కొక్క అవతారం ఆవిర్భవించి ఆ రాక్షసులను వధిస్తారు.
భండాసురుడి అర్ణవాస్త్ర ప్రభావం వలన నీటిలో మునిగిన శక్తి సేనను కుడిచేతి చూపుడు వేలి నుండి ఉద్భవించిన కూర్మరూపము నీటినంతటిని త్రాగి శక్తిసేనను రక్షిస్తాడు. హైరణ్యాక్షాస్త్రము నుండి వేలకొలదిగా జన్మించిన హిరణ్యాక్షులను దేవి కుడిచేతి నడిమి వేలి నుండి పుట్టిన వరాహ రూపి సంహరిస్తుంది.
కనుబొమల నుండి జన్మించిన హిరణ్యులు ప్రహ్లాదుణ్ణి పీడిస్తుండగా, దేవి కుడి చేతి ఉంగరపు వేలి నుండి సృష్టింప బడ్డ నరసింహుడు వారిని తన వాడిఐన గోళ్ళతో చీల్చి చంపుతాడు.
బలీంద్రాస్త్రాన్ని వామనాస్త్ర్ం నుండి వచ్చిన వామనులు బలీంద్రులను బంధిస్తారు.
హైహయాస్త్రం నుండి పుట్టిన కార్తవీర్యులను లలితాదేవి ఎడమచేతి నుండి పుట్టిన పరశురాములు సంహరిస్తారు.
భండాసురుడు ఆగ్రహంతో చేసిన హూంకారము నుండి పుట్టుకొచ్చిన చంద్రహాసఖడ్గము నుండి కుంభకర్ణుడు, మేఘనాధుడు వెంటరాగా పుట్టుకొచ్చిన రావణాసురుడిని లలితాదేవి ఎడమచేతి చూపుడు వేలి నుండి రామలక్ష్మణులు సంహరిస్తారు.
భండసురుడు సృష్టించిన ద్వివిదాస్త్రుడు అనేక మైన కోతులను పుట్టించగా తల్లి ఎడమచేతి నడిమి వేలి నుండి ఉద్భవించిన బలరాముడు ఆ కోతులను సంహరిస్తాడు.
రాజాసురాస్త్రము నుండి పుట్టిన శిశుపాల దంతవక్త్ర శాల్వులను లలితాదేవి ఎడమచేతి ఉంగరం వేలి గోటి నుండి ఉద్భవించిన వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధులు సంహరిస్తారు.
కల్వస్త్రము నుండి పుట్టిన రాజులను లలితాదేవి చిటికిన వేలు నుండి ఆవిర్భవించిన జనార్దనుడు హతమారుస్తాడు.
ఆ పాటికి సూర్యాస్తమ సమయం అవుబోతున్నది. ఇంక లలితాదేవి ఏ మాత్రమూ ఉపేక్షించ దలచుకోలేదు. నారాయణాస్త్రము ఇరవై నాలుగురు సేనా నయకులను సంహరిస్తుంది. రాక్షసులను, వారి సేనాధిపతులను హతమారుస్తుంది.
(మహాపాశుపతాస్త్రాగ్ని నిర్ధగ్ధాసుర సైన్యక).
ఇంక చివరకు మిగిలింది భండాసురుడు మాత్రమే. లలితాదేవి మహాకామేశ్వరాస్త్రం ప్రయోగించి భండాసురుడిని సర్వనాశనం చేస్తుంది. ఫలితంగా శూన్యక పట్టణం దహించుకు పోయి బూడిద కుప్పగా మారిపోతుంది.
No comments:
Post a Comment