Thursday, December 11, 2025

 🔱ఓం నమః శివాయ🔱:
*శ్రీ లలితోపాఖ్యానం*                                       అది గ్రహించిన నారాయణుడు మాయను సృష్టించి, "నీవు భండాసురుని వద్దకు వెళ్ళి అతన్ని మోహించి, విషయ సుఖాలలో ఉండేట్లు చూడవలసింది" అని ఆజ్ఞాపిస్తాడు.
విష్ణువు ఆనతి మీద మాయ భండాసురుని మోహంలో ముంచెత్తి, విషయ సుఖాల్లో పడేసి, యజ్ఞాలు శివారాధన మరిచి పోయేలాగా చేస్తుంది.
అదును చూసుకొని నారదుడు ఇంద్రుని వద్దకు వెళ్ళి, "ఇంద్రా! భండాసురుడు మాయామోహితుడై ఉన్నాడు. దేవి పరాశక్తిని ఆరాధిస్తే శ్రేయస్సు కలుగుతుంది" అని చెప్తాడు.
నారదుని సూచన మేరకు హిమాలయ పర్వతానికి వెళ్ళిన ఇంద్రుడు దేవతలందరితో కలిసి పరాశక్తి పూజిస్తాడు.
***
శుక్రుడు భండాసురుని కలుసుకొని, "రాజా, శ్రీహరి మీ జాతిని నిర్మూలించటానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మిమ్మల్ని బలహీనులను చేయటానికి మాయామోహితుడిని చేసాడు. ఆ ప్రభావం వల్ల రాక్షసుల శక్తి బలహీనమయింది.  ఇంద్రుడు మిమ్మల్ని జయించటానికి తపస్సు మొదలు పెట్టాడు. అందుచేత నీవు వెంటనే ఇంద్రుని మీదకు దండెత్తవలసింది." అంటాడు.
శుక్రుడి ఆజ్ఞ ననుసరించి భడాసురుడూ ఇంద్రుని పైకి యుద్దానికి వెళ్తాడు. కాని వారు ప్రవేశించకుండా పరాశక్తి కోటను నిర్మిస్తుంది. భండాసురుడు పగల కొట్టిన కోటగోడ తిరిగి రావటంతో భండాసురుడు విచారంతో నగరం వైపు మరలి పోతాడు.
భండాసురుడు తమ్ముళ్ళతో, మంత్రులతో సభ ఏర్పాటు చేసి ఈ విధంగా చెప్పుతాడు.
"దేవతలు మనకు శత్రువులు. మన్మధుడు బ్రతికి ఉన్నంత వరకు ఏ సమస్యా లేకుండా అన్ని సుఖసౌఖ్యాలు అనుభవించారు."
"అదృష్టం కొద్దీ మనమంతా మన్మధుడి బూడిదలో నుండి జన్మించాము. ఇప్పుడు దేవతలందరూ కలిసి మన్మధుడు తిరిగి జన్మించాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాలు మనము అడ్డుకోవాలి."
"మనం ఈ రూపాలలో వెళ్ళితే దేవతలను గెలవలేము. కాబట్టి వాయు రూపంలో వారి శరీరాలలో ప్రవేశించాలి. అట్లా వారి శరీరాలను మన ఆధీనం లోకి తెచ్చుకొని కృశింపచేస్తే వారిని అంతం చేయటం అంత కష్టం కాదు.  కనుక ముల్లోకాలలోని జీవుల శరీరాల లోకి మనం వాయు రూపంలో చేరుదాము."
భండాసురుని మాటలు విన్న అసుర సైన్యం ఆనందంతో చిందులు తొక్కుతుంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్షౌహిణుల సైన్యంతో కూడా భండాసురుడు వాయురూపంలోకి మారి దేవలోకపు దేవతల మనసుల్లో ప్రవేశించి వారి మానసిక శక్తిని హరించి, మొహాలను వికారంగా చేస్తాడు. వికృతాకారాలలో ఉన్న దేవీదేవతలకు ఒకరి మీద ఒకరికి ప్రేమ క్షీణించి పోతుంది. వారందరూ నిర్వీర్యులగా అయిపోతారు. ఏ పనీ చేయటానికి అశక్తులైపోతారు. చివరలు వృక్షాలు జంతువులకు కూడా అదే గతి పడుతుంది.
అనుచరులతో కూడి విశుక్రుడు భూలోకంలో మానవులకు కూడా అదే గతి పట్టిస్తాడు, మనుష్యులు చిరునవ్వు కూడా మరిచిపోతారు. సంతోషాలన్ని హరించుకు పోయి ఒకరి మీద ఒకరు గౌరవం కోల్పోయి ఇతరులకు అండగా ఉండాలన్న భావన కోల్పోతారు. నిత్య కార్యాలలో ఆసక్తి నశించి నిర్వికారులై శిలల లాగా ప్రవర్తించటం మొదలెడతారు.
రసాతలంలో విషంగుడు విజృంభిస్తాడు. నాగలోకంలో ఏ కారణమూ లేకుండా విచారంలో మునిగి ఒకరినొకరు ద్వేషంచు కుంటూ రసహీనులై పోతారు.  అట్లా ముల్లోకాలు అల్లకల్లోలం అయిపోతాయి.
స్వర్గలోకంలో బ్రహ్మతో సహా అందరు దేవతలు జరుగుతున్న పరిణామాలకు ఆందోళన చెంది శ్రీహరి వద్దకు వెళ్తారు. శ్రీహరి ఆ సమయంలో కళ్ళు మూసుకొని సుషుప్తావస్థలో ఉన్నట్టు కనిపిస్తాడు. దేవతలందరు స్తోత్రపాఠాలు చేసిన కొంత తడవుకు ఆయన కళ్ళు తెరుస్తాడు.
"ఏమిటిది? మీరందరూ శక్తులు నశించినట్టు ఎండి పోయి కనిపిస్తున్నారు?" అని ఆశ్చర్యంగా ప్రశ్నిస్తాడు. "మీరందరు కూడా ఆ భండాసురిని మాయకు బలైపోయారా? నాకు కూడా లక్ష్మిదేవి మీద ఆసక్తి తగ్గుతున్నది. నేను బ్రహ్మ రుద్రులు కారణపురుషులము. మేము కూడా భండాసురిని దుష్కృత్యాల నుండి తప్పించుకోలేక పోతున్నాము. మనల్నందరిని కాపాడ గలిగిన శక్తి కలవారు ఒక్కరే. ఆయన మహాశంభు. పరాశక్తి ఆయనని వెన్నంటే ఉంటుంది. ఆయనకు రూపం లేదు. దేని మీద ఆధార పడడు. అన్నిటికీ అతీతుడు. కనుక ఆయనను ఈ భండాసురుని మాయ ఏమీ చేయలేదు. అందరమూ కలిసి ఆయనను శరణు వేడుదాము." అని  శ్రీహరి దేవతలను వెంటబెట్టుకొని బయలుదేరుతాడు.
**
వారంతా కలిసి బ్రహ్మాండం అవతలి అంచుకు చేరుకుంటారు. అక్కడ పెద్ద గోడ అడ్డుగా కనిపిస్తుంది. దేవతలు దేవలోకం లో ఉన్న ఏనుగులన్నిటిని రప్పించి గోడ బద్దలు కొట్టటానికి ప్రయత్నం చేస్తారు. గోడలో చిన్న చీలిక ఏర్పడుతుంది. అందులో నుండి లోపలికి వెళ్ళీన వారికి నిరాలంబం, నిరఙ్ఞానం, పంచభూత రహితమైన చిన్మయ ఆకాశం కనిపిస్తుంది.  ఆ ఆకాశంలో నిలబడి దేవతలందరూ చిదాకాస రూపంలో ఉన్న మహాశంభుని స్తోత్రం చేస్తారు. మబ్బువంటి నల్లని రూపంతో, ఒకచేతిలో శూలం, ఒక చేతిలో కపాలం, త్రినేత్రుడు అయిన మహాశంభు దర్శనమిస్తాడు.  చేతులలో అక్షమాల పుస్తకంతో  చంద్రుని వలె వెలిగిపోతూ పరాశక్తి ఆయన పక్కనే ఉంటుంది.

"మీరందరూ వచ్చిన కారణం నాకు తెలుసు. మహాప్రళయం నుండి మిమ్మల్ని ఒడ్డెంకించటం నా బాధ్యత. సాధారణ ప్రళయం అయితే విష్ణువు మనల్ని కాపాడగలడు. కాని ఇప్పుడు వచ్చింది భండాసురుని వలన సంభవించిన కామ ప్రళయం. అందు నుండి కాపాడగలిగింది లలితా పరమేశ్వరి మాత్రమే. లలితా పరమేశ్వరిని కేవలం పరాశక్తే సృష్ఠించగలదు. కాబట్టి అందరూ ఆమెను శరణు వేడండి." అంటాడు మహాశంభు.
ఆ మాటలు విన్న దేవతలకు ఏమి చేయాలో అర్ధం కాదు. పరాశక్తిని ఏ విధంగా ప్రసన్నురాలిని చేసుకోవాలో తెలుపమని మహాశంభును వేడుకుంటారు. ఆయన పరాశక్తిని ప్రసన్నురాలిని చేసుకొనే యఙ్ఞ యాగాదుల విధివిధానము, ఆ తరువాత జరుగబోయే పరిణామాలు వివరించి, దేవతలు చేయబోయే యాగానికి హోతగా ఉండటానికి అంగీకరిస్తాడు.
మహాశంభునాధుడు వాయురూపంలో ప్రపంచంలోకి ప్రవేశిస్తాడు.  క్రియాశక్తిగా మారిన పరాశక్తి సహాయంతో వాయు శక్తినంతటిని ఉపయోగించి జలసముద్రం పూర్తిగా ఎండిపోయేలాగా ఊదుతాడు. నిర్జలమైన సముద్రంలో ఏర్పడ్డ గుంటలో తన మూడవ నేత్రంతో చిదగ్నిని ప్రజ్వలింప చేస్తాడు. అట్లా వెలుగుతున్న అగ్ని పాతాళం నుండి బ్రహ్మలోకం వరకు వ్యాపించి ఉంటుంది. హోమకుండం నక్షత్రాలతో అలంకరిస్తాడు. ఆ తరువాత వేదాలలో చెప్పబడినట్టు యాగం మొదలెడుతాడు. పుష్కల ఆవర్తక అన్న ప్రళయ మేఘాలను హోమంలో నేయి వేసే గరిటలగా ఉపయోగిస్తాడు. హోమకుండంలో ఆరు సముద్రాలను సమర్పిస్తాడు. యాగ సమాప్తి సమయంలో అలంకరించుకున్నదేవతలు ఆ గరిటలలో కూర్చొని తమను తాము హోమాగ్నికి సమర్పించుకుంటారు. అంతటితో యాగం ముగిసిపోతుంది. తాను వచ్చిన కార్యం నిర్విఘ్నంగా పూర్తి చేసిన శంభునాథుడు వాయు రూపం వదిలేసి స్వరూపంలోకి మారిపోతాడు.
ఆ విధంగా పూర్తి అయిన చిదగ్నిహోమకుండం నుండి వివిధ ఆయుధాలతో తొమ్మిది అంతస్తులతో ఉన్న శ్రీచక్రరాజ రథం అన్న ప్రత్యేకమైన వాహనం మీద కూర్చొని ఉన్న లలితాదేవి ఆవిర్భవిస్తుంది.
ఆ విధంగా చిదగ్ని నుండి ఉద్భవించిన లలితాదేవి తన శరీరం నుండి కామేశ్వరుడిని సృష్టిస్తుంది. ఇక్షుధనుస్సు, పంచబాణాలు, పాశం, అంకుశం అన్న నాలుగు ఆయుధాలను చేతులలో ధరించి "చతుర్బాహు సమన్విత" అవుతుంది. ఉదయిస్తున్న సూర్యుడి లాగా ఎర్రని కాంతితో, "నిత్యాషోడశికారూపా",  నిరంతరం పదహారేళ్ళ వయస్సులో ఉన్న అందం రూపలావణ్యంతో ఉంటుంది.
ఆమె శరీరంలోని అంగాంగాల నుండి  వివిధ దేవతా మూర్తులు ఉద్భవిస్తారు.
****
ఆ అపురూప దృశ్యం కనులారా చూసిన ఇంద్రాది దేవతలు పరమానంద భరితులై మరలమరల తల్లికి నమస్కారం చేస్తారు.
అదే సహస్రనామ పారాయణలో చెప్పిన "చిదగ్నికుండసంభూత", "చక్రరాజరథారూఢ",  దేవకార్య సముద్యతా" అన్న పదాలకు వివరణ.
శ్రీచక్రరాజరథం 4 యోజనాలు (ఒక యోజనం 9 మైళ్ళు) వెడల్పు, 10 యోజనాల ఎత్తు, 9 పర్వాలు,  నాలుగు చక్రాలగా నాలుగు వేదాలు, చతుర్విధ పురుషార్ధాలు నాలుగు అశ్వాలగా, బ్రహ్మానందభరితమైన పతాకం,అన్నిటికన్నా ఉచ్చ స్థానంలో బిందు పీఠం, మేరుప్రస్తార రూపం కలిగి తేజస్సు అనే పదార్ధంతో నిర్మించబడి ఉంటుంది.
త్రివిధములైన సృష్టి, స్థితి లయలైన "దేవకార్యం" అంటే దేవతల శక్తులకు మించిన భండాసుర వధ ద్వారా ముల్లోకాలను కాపాడటం.
ఇక్కడ నుండి లలితా సహస్రనామాలలో అమ్మ వర్ణన ఉంటుంది. ఉదయిస్తున్న వేయి కిరణములు కల సూర్యుడి కాంతితో, నాలుగు చేతులతో, ఆ చేతులలో ధరించిన ఆయుధాలు ఆమె అందం ఒక్కొక్క నామంలో వివరించబడి ఉంటుంది.
*
"సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితా" లలితాదేవి చేతిలో ఉన్న అంకుశము అన్న అస్త్రం నుండి సంపత్కరీ దేవి ఉద్భవిస్తుంది. ఆమె రణకోలాహలమనే మత్త గజము నధిరోహించి ఉంటుంది.
"అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటికోటిభిరావృతా."  పాశము నుండి అశ్వారూఢ అనే దేవత ఉద్భవిస్తుంది. ఆమె అపరాజిత అన్న అశ్వం అధిరోహించి ఉంటుంది.
"చక్రరాజ రధారూఢ సర్వాయుధ పరిష్కృత" తల్లి తాను స్వయంగా అన్ని ఆయుధలతో నిండి ఉన్న చక్రరాజమనే రధం ఎక్కి ఉంటుంది.
"గేయచక్ర రధారూఢ మంత్రిణీ పరిసేవితా" మంత్రిణీ దేవి గేయచక్రమన్న రథం ఎక్కి ఉంటుంది. శ్రీ చక్రము చుట్టూ ఉన్న త్రికోణమే గేయచక్రము.
"కిరిచక్ర రధారూఢ దండనాథా పురస్కృతా" వరాహములచే లాగబడుతున్న రధము మీద చేతిలో దండము దాల్చి దండనాథ దేవి ఉంటుంది.
ఆ తరువాత లలితాదేవి కోపంతో చేసిన హూంకారం నుండి ఆరు కోట్ల మంది యోగినులు, మరో ఆరుకోట్ల మంది భైరవులు పుట్టుకొస్తారు. అనంతమైన శక్తిసేన ఉద్భవిస్తుంది.
*
అవివాహితులు ఈ సింహాసనం పై ఆసీనులు కావటానికి అనర్హులు, మహాపురుష లక్షణాలు కలవారినే కూర్చుండబెట్టాలి. ఈమె ఉత్తమ స్త్రీ. శృంగార దేవతలాగా ప్రకాశిస్తున్నది. ఈమెను వివాహమాడటానికి పరమేశ్వరుడు తప్ప మరొకరు అర్హులు కారు అని బ్రహ్మ ఆలోచిస్తున్న సమయంలో పరమేశ్వరుడు తన రూపం మార్చి జగన్మోహనాకారంలో బ్రహ్మ ఎదుట నిలబడతాడు. బ్రహ్మ ఆనందంతో మహేశ్వరుడికి కామేశ్వరుడు అని పేరు పెడ్తాడు.             

No comments:

Post a Comment