*★★★రాముడికీ, రావణుడికీ అదొక్కటే తేడా!★★★*
💥💥💥💥💥💥💥💥
*పరుగులు తీస్తుంటాం! బాగా* *సంపాదించాలనీ,సంపాదించి*
*సుఖపడాలనీ పరుగులు తీస్తుంటాం.* *ఎలాగైనా సరే సంపాదించాలనుకుని సంపాదిస్తే, సుఖపడతామా? సుఖపడుతున్నట్లు బయటి ప్రపంచానికి కనుపిస్తున్నప్పటికీ, మనం మానసికంగా ప్రశాంతంగా బ్రతుకుతున్నామా? కోట్లు సంపాదించినా ప్రశాంతత ఎందుకు పొందలేకపోతున్నాం?*
సంపాదన, సుఖం - ఈ రెండింటిపైననే దృష్టిపెట్టే వారికి, ఆ రెండూ ఎలాగో ఒకలా సంపాదించేయాలి అనే తపన పెరుగుతుంది. అంతకంటే ముందు 'శీలం' అనే దానిని పెంపొందించుకోవాలి - అని మన శాస్త్రాలు బోధిస్తున్నాయి. ఇలాంటి బోధనలను విన్నప్పుడు 'ఇదో చాదస్తం! నీతులు వల్లిస్తున్నారు' అని తేలిగ్గా తీసి పారేస్తాం. కానీ పునాది లేకుండా నిలబెట్టిన భవనం, వేరు లేకుండా పాతిపెట్టిన మొక్క ఎలా పదిలంగా నిలబడలేవో, అలాగే శీలం లేని జీవితంలో ఏ అభివృద్ధి అయినా పతనమౌతుంది - అనడంలో అతిశయోక్తులు లేవు.
ఇది కేవలం నీతిబోధ మాత్రమే కాదు, ఒప్పుకోక తప్పని జీవితసత్యం, భౌతికంగా చూస్తే ఈ శీలం, ధర్మం లాంటివి కేవలం నమ్మకాల వలె కనిపిస్తున్నా, వీటి ప్రభావం మాత్రం భౌతిక జీవితంలో స్పష్టంగా గోచరిస్తుందనడంలో సందేహం లేదు.
'శీలం' అనే మాటకి 'ఋజువర్తన' అని అర్థం చెప్పింది మహాభారతం. అవినీతి, కపటం లేని ప్రవర్తనే శీలం. భారతంలోనే ఒక చక్కని కథ ద్వారా భీష్మ పితామహుడు దీనిని బోధించాడు.
ఒక అసుర చక్రవర్తి దేవతల కంటే ఆధిక్యాన్ని సంపాదించగలిగాడట. ఇది కేవలం ప్రతాపం వల్లనే సాధ్యమయింది కాదనీ, ఇంకేదో బలమైన ఆధారం ఉండవచ్చని ఇంద్రుడు భావిస్తాడు. దానికి కారణాన్ని అన్వేషించి శోధిస్తాడు. ఇక తరువాతి ప్రణాళికలో - ఒక పేద వేషం ధరించి ఆ అసురుని వద్దకు వెళ్తాడు. దానశీలుడైన ఆ అసురుడు - "ఏమి కావాలి" అని అడుగుతాడు.
"శీలఫలాన్ని కోరుకుంటున్నా”నని అడుగుతాడు ఇంద్రుడు. "అది నీకు దానంగా సమర్పిస్తున్నాను" అన్నాడు అసురుడు.
వస్తురూపంలో కనబడని తపఃఫలం వంటివి మనసారా చేసిన వాగ్దానం చేత తప్పక మరొకరికి చేరుతాయి. ఇచ్చిన వారిని వదిలిపెడతాయి.
అలాగే అసురవీరుని నుండి తేజోమయి అయిన ఒక మూర్తి వెలికివచ్చింది. "ఓ తల్లీ నీవెవరు?" అని ప్రశ్నించాడు. “నేను నీ శీల శక్తిని. నువ్వు నన్ను దానం చేయడం వలన నిన్ను వదులుతున్నాను. ఈయన వెంట వెళుతున్నాను" అన్నది.
ఆమె వెనుకనే ఎందరో తేజోమయమూర్తులు వెలికిరాసాగారు. "మీరంతా ఎవరు? నా నుండి నన్ను వదలి వెలికివస్తున్న కారణం ఏమిటి?" అని అడిగాడు అసురుడు.
"మేము వివిధ లక్ష్మీ స్వరూపాలం. కార్యసిద్ధిలక్ష్మి, ఆనందలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, విజయలక్ష్మి, ధైర్యలక్ష్మి... ఇవన్నీ శీలలక్ష్మితోనే ఉంటాయి. ఆ తల్లి ఏ చోటు విడిచిపెడుతుందో, ఆ చోటుని మేమంతా విడిచిపోతాం. ఆమెలేని చోట మేమెవరమూ ఉండలేము. శీలాన్ని ఆధారం చేసుకొనే విజయం, విద్య, ధైర్యం, ఐశ్వర్యం వంటి శోభలన్నీ ఉంటాయి" అని ఆ తేజోమూర్తి వివరించింది.
శీలము, వృత్తము, చరిత్ర... ఈ మూడు పర్యాయపదాలే అనవచ్చు. ఇంగ్లీషులో 'Character' అనే పదం సరిపోతుంది. సరియైన నడత (ప్రవర్తన) కలిగిన నిష్కపటత్వమే శీలం. ఎటువంటి పరిస్థితిలోనూ శీలాన్ని పరిరక్షించుకోవడం ఒక వ్రతం, తపస్సు. ఈ కథ నేటి పాలకులు, నేతలు నేర్చుకోవాలి. ప్రతికూల పరిస్థితుల్లోనూ శీలాన్ని విడచిపెట్టని వారికి, ఆ దుఃస్థితి తొందరగా తొలగి, అనుకూలతను ఏర్పరచడమే కాదు, అన్ని సంపదలనీ సమకూర్చిపెడుతుంది.
రావణుని చేత సీతమ్మ అపహరించబడి అశోకవనంలో బంధితురాలైనప్పుడు చుట్టూ ప్రతికూల పరిస్థితులు. పైగా రావణుని కారుకూతలు, బెదిరింపులు. ఆ సమయంలో ఆమె నిబ్బరంగా ఉండి, “నేను నిన్ను తగలబెట్టగలను. కానీ రామాజ్ఞ కాలేదు, నేను తపోనియమంలో ఉన్నాను. ఆ కారణంగా, ఆ పని చేయడం లేదు" అని ధైర్యంగా మాట్లాడింది. అంతటి రావణుడు కూడా కొంచెం తగ్గాడు.
ఇంతటి స్థైర్యం జానకీదేవికి ఎక్కడి నుండి వచ్చింది? ఇక్కడ వాల్మీకి "వృత్త శౌండీర్యగర్వితా" అనే మాటను ప్రయోగించాడు.
"తన నీతివర్తన (శీలం) వలన కలిగిన శక్తి, గర్వం” ఆమెకు ఆ పటుత్వాన్నిచ్చాయి. తనకు ధర్మబలం లేకపోవడం చేత రావణుడు దృఢంగా నిలబడలేపోయాడు.
శీలం మానసిక స్థైర్యాన్నీ, తృప్తినీ, విజయాన్నీ ప్రసాదిస్తుందని రామాయణం ఒక చక్కని సందేశాన్ని మానవజాతి కందిస్తోంది.
హనుమంతుడు రావణాసురుని చూసినప్పుడు "ఆహా! ఎంత చక్కని తేజస్సు! పరాక్రమం! అన్ని సులక్షణాలు ఉన్నాయి. తపస్సు ఉంది. కానీ బలీయమైన అధర్మం, శీలరాహిత్యం - ఈ దోషాలు లేనట్లయితే కలకాలం ముల్లోకాలనీ ఏలుకోగలడు" అనుకుంటాడు.
అంటే శీల రాహిత్యం భౌతిక అపజయాలనీ, ఆయుఃక్షీణతనీ కూడా కలిగిస్తుందని దీని భావం.
శ్రీరాముడు అవతార పురుషుడే, సందేహంలేదు. కానీ అతని విజయానికీ, ప్రశస్తికీ సచ్చరిత్రయే కారణమని వాల్మీకి ఆవిష్కరణ. "చారిత్రేణ చ యుక్తః” “శ్రు తవాన్ శీలసంపన్నః" అని రాముని గుణాలను పేర్కొన్నాడు.
ధర్మ రాజాదుల శీలమే వారిని అరణ్య, అజ్ఞాత పర్వాలలో పరిరక్షించింది.
ఎన్ని విజయాలను సాధించినా సత్ప్రవర్తనను ఏమరకూడదు.
ముఖ్యంగా నేటి తరం నియమాలను వదిలేయడంలోనూ, ధర్మాలను తెంచడంలోనూ తెగింపు చూపిస్తోంది. భౌతిక సుఖలాలస వలన ఏర్పడిన ప్రమాదాలలో శీలనిర్మాణం దెబ్బతింటోంది. దానితో బలహీనమైన మానవసమాజం ఏర్పడుతోంది.
ఈ సమయంలో మన ఇతిహాసాలు వివిధ తార్కాణాలతో ,ప్రబోధిస్తున్న
ఈ నైతిక ధార్మికాంశాలను ఒంటబట్టించి, ఉత్తమ వ్యక్తిత్వాలను ఏర్పరచవలసిన బాధ్యతను పెద్దలు చేపట్టాలి.
[సమన్వయ సరస్వతి, వాగ్దేవి వరపుత్ర, శివతత్త్వసుధానిధి "బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు" రచించిన వ్యాసం].
No comments:
Post a Comment