యుక్తి!
******
అమ్మ
భక్తి భక్తి అని
చిన్నప్పుడు
గుడికి
తీసుకువెళ్ళేది!
ఐదేళ్లతర్వాత
నాన్న నన్ను
బడి బడి అని
బడికి తీసుకు
వెళ్ళాడు!
బడిలోకూడా
మాష్టారు పురాణ
కథలే చెప్పారు
దేశం గురించి
చెప్పలేదు!
దేశమంటే
మనుషులని
గురజాడ చెప్పాడని
నాకు చాలాకాలం
తెలీదు!
పదేళ్ల వరకు
వీళ్లంతా కలిసి
బడిలోను ఇంట్లోను
నాకు భక్తి మార్గాన్నే
ట్యూన్ చేసారు!
ఆ తర్వాత కూడా
యూనివర్సిటీ దాకా
ఒకటే లక్ష్యం!
ఉద్యోగంకోసమనే
చదివాను!
మధ్యలో
అప్పుడప్పుడు
విద్యార్థి ఉద్యమాల్లో
విముక్తి అన్నమాట
నేర్చుకున్నాను!
చివరికొచ్చేసరికి
అందరూ
'డబ్బు'కోసం
పడి చచ్చే వాళ్ళని
తెలుసుకున్నాను!
భక్తి లేదు
ముక్తి లేదు
విముక్తి లేదు
చివరకు అంతా
విరక్తి!
విముక్తి చేసే
అన్నలు కూడా
విరక్తి చెంది
ఇంటి ముఖం
పట్టారు!
విరక్తిలో
'రక్తి'ఉంది!
ఆ రక్తి ఏంటో
ఇప్పటికీ
అర్ధంకాలేదు!
ఇవన్నీ కాదు
అందరినీ
గట్టేక్కించేది
శ్రమశక్తి
అన్నాడు ఒకాయన!
సర్వ శక్తులు
భుక్తి కోసమని
ముక్తాయించాడు
మరొక
తత్వ జ్ఞాని!
ఇంతకీ ఇవి
రాసింది
సరదాకోసంకాదు!
మీరు యుక్తి తో
ఆలోచిస్తారని!
'నాకలం' నుంచి
ఇదేం కవిత
అంటారా మీరు?
మీ 'యుక్తి' కే
వదిలేస్తున్నాను!
*******
-తమ్మినేని అక్కిరాజు
. హైదరాబాద్
. 8-12-2025
No comments:
Post a Comment