☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
101. గృహా మాస్మద్ విభీతన
ఈ ఇంట్లో ఎటువంటి భయాలు సంచరించకుండుగాక(అథర్వవేదం)
ఇల్లు, కుటుంబం... అనే నాగరిక వ్యవస్థ అత్యంత ప్రాచీనకాలంలోనే ఈ దేశంలో ఆవిష్కరించబడింది. యుగాలనాటి రామాయణ కాలంలోనే అద్భుత గృహనిర్మాణ విజ్ఞానం కనిపిస్తుంది.
తల్లి, తండ్రి, సంతానం, తాత, మామ్మ.... ఇలా అనుబంధాలతో అల్లుకొనే ఇల్లే ఇల్లు అని ఆర్షహృదయం.
ఇల్లు ఎలా ఉండాలో ఋషులు 'గృహసూక్తం'లో వ్యక్తపరచారు. ఇల్లు శుభకరంగాఉండాలని ఆకాంక్షించారు.
సదాచార నియమాలను వదిలిపెడితే ఇంట్లో సభ్యుల మధ్య అనుబంధాలు
సడలుతాయి. దానితో ఒకరి వల్ల ఇంకొకరికి వేదనలు కలుగుతాయి.
రోగాలు, వృధా ఖర్చు మొదలైనవి ఏర్పడతాయి. ఈ అవాంఛనీయ ఘటనలే భయాలు. అటువంటి భయాలు ఇంట్లో ఉండరాదు.
ఈ ఇంట్లో మేము శక్తిమంతులమై, బుద్ధిమంతులమై, ఆనందంతో ఉండాలి. ఈ ఇంటిని మేమంతా మైత్రీభావంతో కూడిన నేత్రంతో చూడాలి. ఈ ఇంట ఉన్న ఆనందాన్ని ఆస్వాదించాలి.
ఈ ఇల్లు మాకు సుఖాలనిచ్చేదిగా, ధాన్యసమృద్ధితో, పాలు, నేయి పుష్టిగా ఉండాలి.నిరంతరం శుభ్రంగా, సౌందర్యంగా ఉండాలి. ఈ ఇంట్లో ఉన్న వారంతా సత్యవచనాలు
పలుకుతూ, ఆత్మీయంగా కల్యాణకరంగా మాట్లాడుకోవాలి. సౌభాగ్యవంతులై, పరస్పరం
ప్రీతిభావంతో ఉండాలి. ఆకలి, దప్పిక, భయం - ఈ ఇంట ఉండకూడదు.
గో సంపద ఈ ఇంట ఉండాలి. అమృతతుల్యమైన మృష్టాన్నభోజనం లభించాలి.ప్రవాసులై వచ్చినవారికి, అతిథి, అభ్యాగతులకు మృష్టాన్నాలతో తృప్తిపరచే
భాగ్యవంతులం కావాలి. సఖ్యభావంతో ఆత్మీయులు ఈ ఇంటికి రావాలి. రోగరహితంగా
ఈ ఇల్లు భాసించాలి.
ఈ వేదభావన క్రమంగా ఇతిహాస పురాణాల్లో కూడా విస్తరించి ఉంది. “ఇల్లు శుచితో, శుభ్రతతో, సదాచారంతో ఉండాలని, పరస్పర ప్రేమ భావనలు కుటుంబ సభ్యుల మధ్య ఉండాల”ని భారతం చెస్తోంది. పచ్చదనం, పూలమొక్కలు పరిసరాలలో ఉండాలి. అతిథులు, మహాత్ములు అడుగిడిన ఇల్లే ఉత్తమ గృహం.
ఇంట్లో పాకశుద్ధి, పాత్రశుద్ధి ముఖ్యం.
దేవ, పితృకర్మలు జరిగే ఇల్లు మహాలక్ష్మీనివాసం. ఏడుపులు, కలహాలు ఇంట్లో ఉండరాదు. ఎంత కోపావేశంలోనైనా అశుభాలు పలకరాదు. రెండు పూటలా
దీపారాధన జరిగే ఇల్లు శుభాల నిలయం. సుగంధభరితంగా గృహం శోభించాలి.
ఇరుకుగా, అతివిస్తృతిగా వస్తుసముదాయం ఉండడం గానీ, లేదా ఖాళీగా 'ప్రతిధ్వని'
వచ్చేటట్లు ఉండడంగానీ క్షేమం కాదు.
ఇంట్లో సభ్యులంతా సూర్యోదయానికి మునుపే నిద్రలేచి ఉండాలి. ఉదయాస్త మయాలలో నిద్రపోరాదు.
పావురాలు, చిలకలు వంటివి ఇంటి పరిసరాలలో సంచరించడం మంచిది.
గబ్బిలం, పాము, గుడ్ల గూబ వంటివి ఇంట్లో ప్రవేశించరాదు. ఒకవేళ అవి చేరితే శాస్త్రోక్తంగా శాంతి జరిపించాలి.
బట్టలు గుట్టలుగా ఉండరాదు. మాసిన వస్త్రాలు నిలవ ఉండరాదు. ఇంట్లో బూజులు, ధూళి, దరిద్రాలను ఆహ్వానిస్తాయి. ఇంటిని ఆధారం చేసుకొని ఇంత విస్తారమైన ఎన్నో సదాచార నియమాలను మన పురాణేతిహాసాలు, ధర్మశాస్త్రాలు
చెబుతున్నాయి.
సదాచార నియమాలను వదిలిపెడితే ఇంట్లో సభ్యుల మధ్య అనుబంధాలు
సడలుతాయి. దానితో ఒకరి వల్ల ఇంకొకరికి వేదనలు కలుగుతాయి. రోగాలు,వృధా ఖర్చు మొదలైనవి ఏర్పడతాయి. ఈ అవాంఛనీయ ఘటనలే భయాలు.అటువంటి భయాలు ఇంట్లో ఉండరాదు" అని వేదసూక్తం పరమేశ్వరుని ప్రార్థించింది.
No comments:
Post a Comment