09-2-25
ఉపనిషద్దర్శనం -5
మానవ జాతికిమార్గదర్శనం
కేనోపనిషత్తు
గతవారంలో మనం నాలుగు ఖండాలుగా విభజింపబడిన కేనోపనిషత్తులో రెండు ఖండాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మిగిలిన రెండు ఖండాల సారాన్నీ తెలుసుకుందాం. మూడోఖండంలో గురువు ఇప్పటివరకు తాను చెప్పిన సిద్ధాం తాలకు, సూత్రాలకు కొన్ని ఉదాహరణలు ఇస్తు న్నాడు. మానవులు దేవతలను పూజిస్తారు. గాలి, నీరు, నిప్పు, నింగి, నేల పంచభూతాలు. అవి కూడా పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోలేక పోతున్నాయి. కనుక మానవుడు అహంకారాన్ని విడిచిపెట్టాలి అని గురువు హెచ్చరిస్తున్నాడు.
దేవతలకు, రాక్షసులకు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. పరబ్రహ్మ దేవతలను గెలిపించాడు. కానీ దేవతలు తామే స్వంతంగా గెలిచామని అహంకరించారు. దేవతల గర్వం పోగొట్టడానికి బ్రహ్మ పదార్థం పెద్ద వెలుగుగా వారిముందు
ప్రత్యక్షమైంది. ఆ వెలుగు ఏమిటో దేవతలకు తెలియలేదు. వారు అగ్నిదేవుణ్ణి ‘ఆ వెలుగు ఏమిటో తెలుసుకొనిరా’ అని పంపించారు. అగ్ని ఆ తేజస్సు దగ్గరకు వెళ్లాడు. ఆ వెలుగు ‘నీవెవరు?’ అని అగ్నిని అడిగింది.
‘నేను అగ్నిదేవుణ్ణి, జాతవేదుణ్ణి’అని గర్వంగా చెప్పాడు. ‘నీ బలం ఏమిటి?’అని ఆ వెలుగు అడిగింది. ‘అన్నిటినీ దహించేశక్తి నాకు ఉంది’ అని అగ్ని అన్నాడు. అప్పుడు ఆ వెలుగు ఒక గడ్డిపోచను అగ్ని ముందు పెట్టికాల్చమంది. అగ్ని ఎంత ప్రయ త్నించినా ఆ గడ్డిపోచను కాల్చలేక పోయాడు. దేవతల దగ్గరకు వెళ్లి ‘ఆ దివ్యతేజస్సు ఎవరో నేను తెలుసుకోలేక పోయాను’ అన్నాడు. అప్పుడు దేవతలు వాయుదేవుణ్ణి పంపించారు. వాయుదేవుణ్ణి ఆ వెలుగు ‘నువ్వె వరు?’ అని అడిగింది. ‘నేను అంతటా ఉంటాను. వాయుదేవుణ్ణి’ అన్నాడు. ‘నీ ప్రత్యే కత, బలం ఏమిటి?’ అని వెలుగు అడిగింది.
‘నేను దేనినైనా ఎగరగొట్టేస్తాను’ అన్నాడు వాయువు. అప్పుడు ఆ దివ్యశక్తి ఒక గడ్డిపోచను వాయువు ముందు పెట్టి ‘దీన్ని ఎగరగొట్టు’ అంది. వాయువు తన బల మంతా ఉపయోగించినా దానిని ఎగరగొట్టలేకపోయాడు. దేవతల దగ్గరకు వెళ్లి ‘ఆ మహా తేజస్సు ఎవరో నేను తెలుసుకోలేకపోయాను’ అన్నాడు. అప్పుడు దేవతలు అందరూ ఇంద్రుణ్ణి ఆ యక్షశక్తి ఏమిటో తెలుసుకొని రమ్మన్నారు. ఇంద్రుడు వెళ్లేసరికి ఆ మహాతేజస్సు అదృశ్యమైంది. అది ఉండే చోటులో పరమ సౌందర్యవతి అయిన పార్వతీదేవిని చూశాడు. ‘అమ్మా! ఇంతకు ముందు ఇక్కడ ఉన్న దివ్యశక్తి ఏమిటి? ఎవరు?’ అని అడిగాడు. దీనితో తృతీయఖండం పూర్తి అయింది. ఇప్పటివరకు నిరాకారంగా ఉన్న అన్వేషణ సాకారం అయింది.
నాలుగోఖండంలో హైమవతి ఇంద్రుడికి ఇలా బదులు చెప్పింది. ‘నీవడిగిన మహాశక్తి బ్రహ్మం . మీ విజయానికి అదే కారణం’. అప్పుడు ఇంద్రుడికి ఆ మహా తేజస్సు సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపమని తెలిసింది. అగ్ని, వాయువు, ఇంద్రుడు ఆ పరబ్రహ్మ సామీప్యం, స్పర్శ వల్ల ఇతర దేవతలను మించిన వారు అయినారు. వా రు ముగ్గురే మొదట బ్రహ్మజ్ఞానాన్ని పొందారు. ఆ ముగ్గురిలోనూ ఇంద్రుడు పరబ్రహ్మనికి మరింత దగ్గరగా వెళ్లగలిగాడు. కనుక వారికంటె గొప్పవాడైనాడు. పరబ్రహ్మాన్ని గురించి పార్వతీదేవి ద్వారా మొదట తెలుసుకున్న వారు కూడా ఇంద్రుడే. కనుక
బ్రహ్మవేత్తలలో ఇంద్రుడు అగ్రగణ్యుడై యజ్ఞయాగాల్లో మొదటి తాంబూలాన్ని అందుకోగలుగుతున్నాడు. అతడు
బ్రహ్మాన్ని ఇలా వర్ణిస్తున్నాడు... ‘‘కొన్ని కోట్ల మెరుపులను మించిన కాంతియే బ్రహ్మం . కళ్లతో చూడలేని మహాతేజస్సు బ్రహ్మం . సమస్త ప్రాణులకూ అదే అధిదైవతం. ఆ పరబ్రహ్మంవల్లనే మనస్సు బాహ్య ప్రపంచజ్ఞానంతో నడుస్తోంది. అన్నిటినీ జ్ఞాపకం పెట్టుకుంటోంది. సంకల్పిస్తోంది.
ఆ పరబ్రహ్మా నికి ‘తద్వనం’అని పేరు పెట్టారు. పరబ్రహ్మాన్ని ‘తద్వనం’గా తెలుసుకుని ఉపాసించినవాణ్ణి అన్ని జీవులూ ఇష్టపడతాయి. మహర్షుల ఆశ్రమాల్లో క్రూరజంతువులు కూడా పరస్పర శత్రుత్వం లేకుండా రుషులను ఏమీ చేయకుండా జీవించడం ఈనాటి రమణ మహర్షివరకు చూస్తూనే ఉన్నాం. ఇది అంతా విన్న శిష్యుడు ‘గురుదేవా! నాకు ఉపనిషత్తు చెప్పండి!’ అని అడిగాడు. ‘శిష్యా! నీకు ఇప్పటిదాకా చెప్పింది ఉపనిషత్తే. బ్రహ్మ విద్య ఉపదేశించబడింది. అంతా చెప్పాను. దాన్ని తెలుసుకోవడానికి తపస్సు, ఇంద్రియ నిగ్రహం, నియత కర్మలు సాధనాలు. నాలుగు వేదాలు బ్రహ్మ విద్యకు అవయవాలు. సత్యం దాని ఇల్లు. ఎవడు ఇదంతా ఉపనిషత్తని తెలుసుకుంటాడో వాడు పాపాలను పోగొట్టుకుంటాడు. స్వర్గం లో పరబ్రహ్మం లో ఉంటాడు’ అన్నాడు.
ఈ సృష్టి పరబ్రహ్మమయమని తెలుసుకొని నియమ నిష్ఠలతో, బాధ్యతతో మన కర్తవ్యాలను నెరవేరుస్తూ సత్యదర్శనంతో జీవన్ముక్తులై హాయిగా జీవించవచ్చునని కేనోపనిషత్తు మానవజాతికి మార్గనిర్దేశనం చేస్తోంది.
- డా. పాలపర్తిశ్యామలానంద ప్రసాద్ .
No comments:
Post a Comment