☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
93. అతిథిదేవో భవ!
అతిథి దేవునిగా అగుగాక (యజుర్వేదం)
అతిథిని దేవునిగా భావించి గౌరవించడం మన సంప్రదాయం. లౌకికమైన ఒక మర్యాదగానో, సాటిమనిషిని మంచి చేసుకొనే ఒక ప్రక్రియగానో అతిథి సేవను
మనం పరిగణించము. అతిథిని దైవంగా భావించి, అతిథి తృప్తి చెందితే దేవతలు ఆనందిస్తారనే భావనతో సేవించుకుంటాం.
తనంత తానుగా అనుకోకుండా వచ్చిన అతిథితో పాటు, ఆహ్వానించిన వ్యక్తి కూడా గౌరవనీయుడే. తాను, తన కుటుంబ సభ్యులే కాక అతిథి అభ్యాగతులతో
కలిసి భోజనం చేసే ఇల్లే ఇల్లని మన ప్రాచీనుల భావన. అతిథులు రాని ఇల్లు ఇల్లే కాదు. 'వచ్చీ పోయే అతిథులతో ఇల్లు కళకళలాడాలి' అని గృహిణీ గృహస్థులు కోరుకుంటారు. అతిథి రాని రోజున భోజనం చేయని వ్రతనిష్ఠులైన గృహస్థులు కూడా ఉండేవారు(ప్రస్తుత కాలంలో కూడా అక్కడక్కడా ఉండవచ్చు).
ఒకరికి వండిపెట్టడంలో విసుగు, శ్రమ చూపించకుండా గృహిణీ గృహస్థులు
ఆనందంగా, ఉత్సాహంగా కృషిచేసే వారు. శ్రద్ధగా, భక్తిగా అతిథికి భోజనం పెట్టి - సేవచేసే భాగ్యమిచ్చినందుకు అతిథికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి దీవెనలందుకొనే భవ్య సంస్కృతి మనది.
తమకు తాము కూడా విసుగ్గా వండుకొనే ఈ రోజుల్లో, అతిథి అభ్యాగతులు రాకుండా ఉంటేనే మేలు - అనుకొనే దుఃస్థితిలో చాలా మంది ఉన్నారు. దేవతలకి
నివేదించి, అతిథులకు ఆరగింపు చేసి, తరువాత భుజించడం అనే అందమైన
ఆనవాయితీని ఇప్పుడు పోగొట్టుకున్నాం. రోజూ కాకున్నా, తరచు అతిథి అభ్యాగతులకు
భోజనం ఏర్పాటుచేసే సంప్రదాయాన్ని అలవరచుకోవడం ఇంటికి శ్రేయస్సు.
అతిథికి నిలువ నీడ, భోజనం, వస్త్రం ఇచ్చి సత్కరించితే భగవంతుని ఆరాధించినట్లే.పూర్వపు రోజుల్లో శుచిని, ఆచారాన్ని పాటించే శ్రోత్రియులు, అటువంటి ఆచార
సంపన్నుడైన గృహస్థు ఇంటికే వెళ్ళేవారు. ఆ గృహస్థు సంతోషంగా ఆచార శుద్ధి కలిగిన ఆహారాన్ని ఏర్పాటు చేసేవాడు. అలాంటి మంచి సంస్కృతి నేడు కరువౌతోంది.
అతిథి అర్థరాత్రి వచ్చినా విసుక్కోకుండా అన్నం పెట్టే అన్నపూర్ణమ్మలు భారతీయ
గృహిణులు - - అని నాటి సాహిత్యం అభివర్ణించింది. అభ్యాగతః స్వయం విష్ణుః' అని సంభావించే ఉత్తమ సంస్కారం మన ప్రాచీనులది.
దేవతారాధన, పితృతర్పణం, శాస్త్రాధ్యయనం - దేవ, పితృ, ఋషి ఋణాలను తీర్చుకొనే సాధనాలు. అతిథి సేవ మనుష్యయజ్ఞం. దీని వలన దేవతలు, పితరులు,
ఋషులు సంతోషిస్తారు. వసిష్ఠుడు మొదలైన మహాత్ములు అరణ్యవాసం చేస్తున్నా తమ తపోబలంతో చక్రవర్తులకు సైతం వారికుచితమైన మృష్టాన్న భోజనాలను ఏర్పాటు చేసి అతిథి సేవా ధర్మాన్ని చాటి చెప్పారు.
ఒక భిల్ల దంపతులు తమ ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పెట్టి, రాత్రివేళ అతడికి ఆశ్రయమిచ్చేందుకై, తమ చిన్న ఇంటిని ఏర్పాటు చేసి - తాము ఆ అడవిలో బైట నిద్రించారు. ఆ సమయంలో రాత్రి వేళ అటువచ్చిన సింహం వారిని చంపి
తినివేసింది. త్యాగపూర్వకంగా, అతిథిని దైవంగా భావించి చేసిన ఈ అపూర్వ సేవకు పరమేశ్వరుడు సంతోషించాడు. ఆ భిల్ల దంపతులే తరువాతి జన్మలో నలదమయంతులుగా పుట్టి అపూర్వ చక్రవర్తి దంపతులుగా భోగాలను, యశస్సును ఆర్జించారు. వారికి అనుసంధాన కర్తగా ఆ శివుడే హంసగా అవతరించాడు.
(శివపురాణగాథ)
ఒక కపోత దంపతులు తమ గూడు ఉన్న చెట్టును ఆశ్రయించిన బోయవాని కోసం తమను తాము సమర్పించుకుని సద్గతిని పొందిన కథను భారతం చెబుతోంది.
ఇలా అతిథి సేవాధర్మములను పురాణేతిహాసాలు చాలా తెలియజేశాయి.
No comments:
Post a Comment