"అర్రే, చాలాకాలం అయింది మనం మాట్లాడి ఎలా ఉన్నావు, ఏమైపోయేవు?" అన్నాడు దినవాహి
'ఈ మాట వినగానే, అప్పటిదాకా నేను మర్చిపోయిన విషయం గుర్తొచ్చింది. మేం ఆఖరిసారి కలిసినప్పుడు చిన్న విషయం మీద వాదన జరిగి కోపంలో విడిపోయేం. కానీ ఆ కోపం నాకు రెండు రోజులకంటే ఎక్కువ అనిపించలేదు. కానీ తను తర్వాత ఒక్కసారి కూడా మాట్లాడే ప్రయత్నం చెయ్యలేదు. వేరేవేరే కుటుంబాలు, ప్రదేశాలు, ఉద్యోగాలు కావడం వల్ల మేం కలవనూ లేదు.
ఈమధ్యే నేను హైదారాబాద్ గచ్చిబౌలిలో ఒక ఐటి ఆఫీస్ లో చేరాను. ఆ ఆఫీస్ కఫటీరియాలోనే ఇప్పుడు తనని కలిసినది.
తను ఆ క్షణం అక్కడ ఉంటాడు అని నేను అస్సలు ఊహించలేదు' ఇలా నా ఆలోచనలు సాగిపోతుంటే...
"సుచిత్ర, ఏమైంది. ఇంకా కోపం పోలేదా ? ఎలా ఉన్నావ్ ? నా ఎదురుగా ఉన్నది నువ్వే అని నమ్మలేకుండా ఉంది. ఇక్కడ ఉంటున్నారా ఇప్పుడు ?" అంటూ తను ఊపిరి తిప్పుకోకుండా అడుగుతున్న ప్రశ్నల వర్షానికి తేరుకుని తనవైపు చూశా.
నిజానికి నా మనసు ఆనందాశ్చర్యాలతో ఉప్పొంగిపోయింది. నా మొహం తను గనక సరిగ్గా చూసి ఉంటే తనకి ఇట్టే అర్థం అయిపోయేది.
నేను నవ్వుతూ, "ఆగాగు, నన్ను నమ్మనీ నువ్వు నా ఎదురుగా ఉన్నావని. కాస్త నీ ప్రశ్నల పరంపర కి బ్రేక్ ఇవ్వు ' దినవాహి ' అన్నాను.
"దాదాపు పదేళ్ల తర్వాత కలిశాం మనం" 😀 అన్నాడు
"అవును పది సంవత్సరాలు ఇట్టే తిరిగిపోయినట్టు ఉంది. నిన్ను ఇక్కడ కలవడం చాలా బాగుంది. నేను ఈ బిల్డింగ్ లో 5th floor లో ఉన్న IT office లో మొన్ననే జాయిన్ అయ్యాను. మనం సాయంత్రం కలుద్దాం. అన్నీ మాట్లాడుకుందాం. నీ నెంబర్ ఇవ్వు" అన్నాను
వెంటనే నెంబర్లు ఇచ్చిపుచ్చుకోవడం అయింది.
వెళ్తూ తనకి వాట్సాప్ లో "Hi" అంటూ మెసేజ్ చేశా. తనూ జవాబు ఇచ్చాడు.
అయితే నా ఆలోచనలు మాత్రం ఎన్నో విషయాల చుట్టూ తిరుగుతున్నాయి.
కొంతమందిని ఎన్ని సంవత్సరాల తర్వాత చూసినా నిన్ననే చూసినట్టు, నిన్ననే మాట్లాడినట్టు అనిపిస్తుంది.
కొంతమందితో కలిసి బ్రతుకుతున్నా కూడా అగాథం లాంటి దూరాలు కనిపిస్తాయి.
కొంతమందితో ఒక్క అరగంట మాట్లాడకపోయినా జీవితం తలకిందులు అయిపోయినట్టు అనిపిస్తుంది.
మరి కొంతమంది మనతో పది నిముషాలు మాట్లాడినా అక్కడనుంచి పారిపోవాలి అనిపిస్తుంది.
అది ఆయా వ్యక్తులు మన పట్ల ప్రవర్తించిన తీరు మాత్రమే కాదు, మనం వారిపట్ల పెంచుకున్న భావనను అనుసరించి ఉంటుంది అనిపిస్తుంది నాకు...'
ఇలా ఆలోచించుకుంటూ నడుస్తున్న నాకు ఎప్పుడు ఆఫీస్ లో నా టేబుల్ దగ్గరకి వచ్చి కూచున్నానో తెలీలేదు, నా కొలీగ్ పద్మ పలకరించేవరకూ
😀
- Lavanya Buddhavarapu
06/02/2025
No comments:
Post a Comment