Tuesday, February 4, 2025

 *వాసనలు.....* 

కొంత మందికి మనుష్యులకి.. వాసనలన్నీ అణచి కేవలం స్వరూపంగా ఉండుట సాధ్యమేనా అనే ప్రశ్న తలయెత్తుతుంది. వారికి... 

'సాధ్యమా, కాదా' అనే సందేహానికి చోటీయక స్వరూపధ్యానమునే ఎడతెగక కలిగి ఉండాలి.

ఒకడు ఎంత పాపి అయినా సరే, “నేను పాపినే, ఎట్లా కడతేరడం...? అని వెక్కి వెక్కి ఏడవక, 'నేను పాపిని' అనే తలపును పూర్తిగా పారద్రోలి స్వరూపధ్యానంలో దృఢమైన పట్టుదల కలవాడై ఉంటే, వాడు నిశ్చయంగా కడతేరగలడు.

మానవునికి మంచి మనస్సు, చెడ్డ మనస్సు అని రెండు రకాల మనస్సులు లేవు. మనస్సు ఒక్కటే. వాసనలే.. శుభమనీ, అశుభమని రెండు రకాలు. మనస్సు శుభవాసనతో కూడి ఉంటే మంచి మనస్సని, అశుభవాసనలతో కూడి ఉంటే చెడ్డ మనస్సని అంటారు. ఇతరులెంత దుర్మార్గులుగా కనిపించినా వారిని ద్వేషింపరాదు.

రాగ, ద్వేషములు రెండూ విడువవలసినదే.  ప్రపంచ విషయము లందు మనస్సుని ఎక్కువగా ప్రసరింప జేయరాదు. వీలైనంత వరకు ఇతరుల వ్యవహారంలో ప్రవేశించరాదు. ఒకడు ఇతరులకు ఇచ్చేవన్నీ నిజానికి ఇచ్చుకునేది తనకే.  ఈ సత్యం తెలిస్తే ఇతరులకు ఈయని వారెవరు.. "తాను" లేచినచో సమస్తము లేచును. "తాను” అణగారినచో సకలము అణగిపోవును. మనము ఎంతెంతగా అణకువతో ప్రవర్తిస్తామో, అంతకు అంత మేలే అవుతుంది. మనస్సును వశ పరచుకుంటే ఎక్కడైనా ఉండవచ్చు...   

No comments:

Post a Comment