Wednesday, February 5, 2025

 "మొగుళ్ళు చెబితే వినాలీ..." 
💐💐💐💐💐💐💐💐

"అబ్బా, మీరెంత మంచివారండీ...వచ్చే నెల్లో నా పుట్టిన్రోజు వస్తోందని, రెండు పట్టుచీరలు, ఒక పెద్ద పూజామందిరం తెచ్చారు...ఐ లవ్ యు సో మచ్.."

"అప్పుడే అంత లవ్ కురిపించెయ్యకు, నేను చెప్పేది పూర్తిగా విన్నాక, మూతి ముడవకుండా, కనుబొమ్మలు ముడెట్టెయ్యకుండా, ముక్కు చీదకుండా, మీ ఆఖరి అస్త్రం, అదే...
'సత్యభామాస్త్రం" నామీద ప్రయోగించకుండా ఉంటే చాలు !"

"అంటే మీరు చెప్పబోయేది...ఆ లెవెల్లో ఉంటుందా ?"

"ఆ లెవెల్లో ఉంటుందో, నువ్వు ఒక్కసారి కూడా, చపాతీలు ఒత్తడానికి వాడని ఆడంగుల ఆయుధం, అదే...అప్పడాల కర్రని వాడే లెవెల్లో ఉంటుందో చూడాలిగా ?"

"ఏంటో, మీరు ఎప్పుడు మాట్టాడినా, తలా - తోకా లేకుండా, తికమక సంధులు, అయోమయం సమాసాలు వాడి, నా బుర్ర తినేస్తారు, ఏదీ తిన్నగా చెప్పరు కదా..."

"ఆఫీసులో నా పేరు ఏంటో తెలుసుగా, 'చాణక్య' !"
😎

"బయట పులుల్లాంటి చాణక్యలు, చాళుక్యులు కూడా, ఇంట్లో పిల్లులని తెలుసుగా...అసలు విషయానికి రండి !"

"ఏముంది, ఆ రెండు పట్టుచీరల్లో, నీకు నచ్చింది ఒకటి తీసుకో, రెండోది, ఆ పూజామందిరం, పక్కనెట్టు !"

"అంటే అవన్నీ నాకోసం కాదన్నమాట...
ఆ రెండోది ఎవత్తి కోసం ?"

"ఆఫీసులో నా మొగుడు యొక్క 'పెళ్ళిబార్యా' కోసం !"

"అంటే?"

"ఇంకా అర్థం కాలేదా ? నా బాసు కి ఇంట్లో బాసు, నెత్తిమీద దేవత కోసం !"

"ఆ 'కల్పనారాయ్' లాంటి చప్పిడి మొహానికి, ఇంత ఖరీదైన పట్టుచీర, పూజా మందిరమా ? పైగా...దాని పెర్సనాల్టీ, రంగు చూశారా ? ఆ చీర కట్టుకుంటే, పొలాల్లో పెట్టే దిష్టిబొమ్మలా ఉంటుంది !"

"నువ్వూ - నేనూ రోజూ వెళ్ళి, ఆవిడ అందాన్ని చూసొద్దాం, ఓకేనా ?"

"దానింటికి నేను ఛస్తే రాను, రాను గాక రాను...
ఆమధ్య దాని కూతురు పెళ్ళిలో నన్ను ఎంత అవమానించిందో గుర్తుందిగా ? ఆయన మీకు బాస్ కావచ్చు, ఆవిడ నాకు బాస్ కాదుగా ? కనీస మర్యాద తెలీని వాళ్ళ మొహం చూడ్డం కూడా నాకు ఇష్టం ఉండదు..."

"మీ ఆయనకి ప్రమోషన్ రావడం కూడా నీకు ఇష్టం ఉండదా?"

"ఎందుకుండదు? దాని మొగుడి కంటే మా ఆయన 
పెద్ద ఆఫీసర్ కావాలి..."

"కదా...అసలే ఇప్పుడు మా డిపార్టుమెంట్లో ప్రమోషన్లు తగ్గిపోతున్నాయి, ఉన్న కొద్దిపాటి వాటికీ పాతికమంది క్యూలో నిలబడ్డాం...ఇప్పుడున్న బాసు ఎవరి రికార్డు బాగా రాస్తాడో, వాళ్ళలో ఇద్దరు, ముగ్గురికే ప్రమోషన్లు వస్తాయి. ఆ ఇద్దరు, ముగ్గుర్లో మనం ఉండాలి, హౌ ?"

"అవును, ఎలాగండీ ?"

"అక్కడికే వస్తున్నా...ఎప్పట్నుంచో బాసుని అందరూ 
కాకా పట్టేస్తున్నారు, ఒళ్ళు పుండుపడేట్టు గోకేస్తున్నారు, రకరకాల గిఫ్ట్ లు ఇచ్చేస్తున్నారు ! 
పాపం బాస్ మాత్రం ఏంచేయగలడు ? కొంపలో ఉన్న 
తన బాసు చెప్పినట్టే వింటాడు ! 

ఇంక, ఈవిడ సంగతి అంటావా...వాళ్ళాయన వచ్చే ఏడాది రిటైర్ అవబోతున్నాడు. ఈలోగా ఏసీబీ వాళ్ళ తీక్షణ వీక్షణాలు వీడి మీద పడకూడదని, ఆవిడ అన్ని గుడుల్లోనూ తెగ పూజలు చేయించేస్తోంది ! ఆవిడకి భక్తి కొంచం ఎక్కువేలే !

అందుకే రోజూ పూజ కోసం దేవుడు గూడు ముందు కూర్చోగానే, ఎదురుగుండా కనబడేది మనం ఇవ్వబోతున్న ఈ అందమైన పూజా మందిరమే !
అంటే...నాకు ప్రమోషన్ ఇప్పించాలని ఆ మందిరమే ఆవిడకి ప్రతిరోజూ గుర్తు చేస్తూ ఉంటుందన్నమాట ! 
పైగా, 52,000 పట్టుచీర ఇచ్చిన వాళ్ళని ఏ స్త్రీ మర్చిపోతుంది, చెప్పు ?"

"ఏంటీ...52 వేలా ? నాకెప్పుడైనా అంత ఖరీదులో చీరకొన్నారా ?"

"మళ్ళీ మొదటికొచ్చావ్ ? ఆ రెండు చీరల్లో నీకు 
నచ్చింది తీసుకోమన్నానుగా *"

"అయితే 52,000 దే తీసుకుంటాను..."

"ఆ 22,000 చీరకున్న ట్యాగ్ దీనికి, దీని ట్యాగ్ దానికి మార్చు !"

"అదేంటి ?"

"పిచ్చి మొహం...మీ ఆయన్ని నువ్వు ఎప్పటికి అర్థం చేసుకుంటావో...ట్యాగులు షాపుల వాళ్ళు వేసేవేగా ఆ ట్యాగ్గుల్ని మనం మార్చుకోలేమా ? 
రెండూ 22 వేలకే కొన్నాను. ఒకదానికి 52,000 ట్యాగ్ వేయించాను. నీకు నచ్చింది తీసుకుంటే, రెండోది ఖరీదైన 52,000 చీర అన్నమాట ! అర్థమైందా మట్టి బుర్రకి...?"

"మరి ఆవిడకి తెలీదా, అది అంత ఖరీదైంది కాదని ?"

"ఆవిడ నీకంటే తెలివైందని నాకు తెలుసుగా ?
కేవలం ట్యాగులు చూసి, ఎక్కువ ఖరీదైన చీరని 
తన పెళ్ళిరోజున ఇచ్చిన వాడే ప్రమోషన్ కి అర్హుడని
ఆవిడ నిర్ణయించిందంటే...మా బాసుకి ఇంకో 
దారేవుంది, చెప్పు, 'అంతేగా...' అనడం తప్ప ?
మీరెంతసేపూ...చీరల ధరలు, నగల మెరుపులూ 
చూసి, పప్పులో కాలేస్తుంటారు కానీ, దూరాలోచన,
అదే...'లాంగ్ రేంజ్ ప్లానింగ్' చెయ్యరు !"

"లాంగ్ రేంజ్ ప్లానింగ్...అంటే ఏంటండీ ?"

"అంటే...ఇప్పుడు మనం ఖర్చు పెట్టేది ఎంత, దానివల్ల, ఇప్పుడు అతి కష్టమైన ప్రమోషన్ కొట్టేయడమే కాదు, మనకున్న మిగిలిన సర్వీసులో రాబోయే ప్రమోషన్ల వల్ల వచ్చే ఇంక్రిమెంట్ల ద్వారా ఆర్థికంగానూ, సమాజంలో గుర్తింపు పరంగా వచ్చే లాభం, ఎక్కువ ప్రమోషన్ల వల్ల, పదవీ విరమణ చేసిన తర్వాత, జీవితాంతం వచ్చే పెన్షన్, ఇతర లాభాలు ఎంత, అని లెక్కేసి చెప్పు ?"

"అలాంటి లెక్కలు నాకు రావు..."

"కదా...కనీసం నీ చాణక్యారావు మొగుడికి ఆ లెక్కలన్నీ వచ్చు అని తెలుసా ?"

"అది తెలుసులెండి, మా ఆయన బుర్ర...
ఒక ఇంటర్నెట్ అక్కర్లేని కంప్యూటర్ !"

"సంతోషం...ఇంతకీ ఎల్లుండి జరిగే వాళ్ళ పెళ్ళిరోజు ఫంక్షన్ కి నువ్వు వస్తావా...లేక, ఆవిడ మొహం చూస్తేనే నీకు తేళ్ళు, జెర్రిలు పాకుతాయా ?"

అయ్యో..మా ఆయన కోసం నేనే ఆ దిబ్బ మొహానికి బొట్టుపెట్టి మరీ ఈ '52 వేల' చీర ఇస్తాను...
మీరాయనకి పూజామందిరం ఇవ్వండి !"

"అద్గదీ, లెక్క ! హమ్మయ్య ! మా ఆవిడక్కూడా ఆఫీసు రాజకీయాలు తెలిసిపోతున్నాయ్...ఇంక నాకు ఎదురేలేదు...ఎంతసేపూ, "పెళ్ళాం చెబితే వినాలీ..." అని స్టెప్పులెయ్యడం కాదు, "మొగుళ్ళు చెబితే వినాలీ" అని కూడా పాడుతుండాలి, అర్ధమైందా ?"

"యెస్, బాస్.. "
                   
                              💐💐💐

                        వారణాసి సుధాకర్.
                       💐💐💐💐💐💐

No comments:

Post a Comment