Friday, February 7, 2025

 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
                *రోజూ పండుగే!*

*'కలిగినవాడికి ప్రతిరోజూ పండుగే’ అనేది నానుడి. ఆ మాట ఎలా ఉన్నా, చాంద్రమాన గణనను అనుసరించే వారికి మాత్రం ప్రతిరోజూ పండుగే అని చెప్పవచ్చు. మాసానికి శుక్ల, కృష్ణ అని రెండు పక్షాలు. 'కలిగినవాడికి ప్రతిరోజూ పండుగే’ అనేది నానుడి. రెండు పక్షాల్లోనూ పాడ్యమి మొదలు చతుర్దశి వరకు తిథులు సమానమే. శుక్లపక్షపు చివరి రోజు పౌర్ణమి. కృష్ణ పక్షానికి, ఆ మాసానికి సైతం చివరి రోజు అమావాస్య. శుక్ల, కృష్ణ పక్షాల్లో ఏ పక్షంలోనైనా పాడ్యమి మొదలు అన్ని తిథులు, వాటితోపాటు వారాలు, నక్షత్రాల కలయికతో వివిధ మాసాల్లో సందర్భానుసారంగా పండుగలు రావడం చాంద్రమానంలోని ప్రత్యేకత. చైత్ర శుక్ల పాడ్యమి నాడు తెలుగు సంవత్సరాది ‘ఉగాది’.*
 
*ఆదివారం విదియ తిథి కలిసిన రోజు ఏ మాసం/పక్షంలోనైనా ‘భాను విదియ’ అని పిలిచి సూర్యారాధన చేస్తారు. కార్తిక శుద్ధ విదియ ‘భ్రాతృవిదియ’గా ప్రసిద్ధం. ఆ రోజు సోదరి చేతి వంటను సోదరులు తినాలని నియమం. వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ. ఆ రోజు చేసే పూజ, దానం, వ్రతం ఏదైనా అక్షయమైన ఫలితాలను ఇస్తుందని ఈ పేరు పెట్టారు. భాద్రపద బహుళ తదియనాడు ఉండ్రాళ్ల తదియ/తద్దిగాను, ఆశ్వయుజ బహుళ తదియను అట్ల తదియగాను జరుపుతారు.*

*భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి కార్తిక శుద్ధ చవితిని నాగుల చవితిగా జరుపుతారు. ఏ మాసంలోనైనా కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి రోజున సూర్యాస్తమయ సమయానికి చవితి ఉంటే సంకష్టహర /సంకటహర చతుర్థి అంటారు. ఆషాఢ శుద్ధ పంచమి సుబ్రహ్మణ్య ఆరాధనకు ఉద్దేశించిన స్కంద పంచమి. భాద్రపద శుద్ధ పంచమినాడు సప్తర్షులను పూజించే దినం రుషి పంచమిగా జరుపుతారు. మాఘ శుక్ల పంచమి సరస్వతీ దేవి జన్మదినోత్సవంగా జరిపే శ్రీ పంచమి లేదా వసంతపంచమి. ఆషాఢ శుద్ధ షష్ఠి కుమార షష్ఠిగా, మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠిగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు ఉద్దేశించిన పర్వదినాలు. మాఘ శుద్ధ సప్తమి నాడు రథసప్తమి. ఏ మాసం/పక్షంలోనైనా ఆదివారం సప్తమి కలిస్తే భానుసప్తమిగా వ్యవహ రిస్తారు. ఈ రోజుల్లో ప్రముఖంగా సూర్యారాధన చేస్తారు. శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణాష్టమి. ఆశ్వయుజ శుక్ల అష్టమి మహాష్టమి. వీటిలో మొదటిది శ్రీకృష్ణ జన్మదినం. రెండోది శరన్నవరాత్రుల్లో దేవీ పూజకు ఉద్దేశించినది. వసంత నవరాత్రుల్లో చైత్రశుద్ధ నవమిని శ్రీరామనవమిగా జరుపుతారు. శరన్నవరాత్రుల్లో ఆశ్వయుజ శుద్ధ నవమిని మహర్నవమిగా దేవీ పూజ చేస్తారు. ఆశ్వయుజ శుద్ధ దశమినాడు దసరాగా వ్యవహరించే విజయదశమి.*

*ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా ప్రసిద్ధం. ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి. దీన్నే ముక్కోటి ఏకాదశి అనీ పిలుస్తారు. మాఘ శుక్ల ఏకాదశి భీష్మ ఏకాదశి. కార్తిక శుద్ధ ద్వాదశి క్షీరాబ్ధి ద్వాదశి. తులసిని, విష్ణువును పూజిస్తారు. శనివారం త్రయోదశి కలిస్తే శనిత్రయోదశి, శని అనుగ్రహం కోసం తైలాభిషేకం చేస్తారు. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశి. పౌర్ణమి రోజును శ్రావణ, కార్తిక, మాఘ మాసాల్లో పర్వదినాలుగా జరుపుతారు. ఆశ్వయుజ బహుళ అమావాస్యను దీపావళి అమావాస్యగా, ఫాల్గుణ మాసపు అమావాస్యను ‘కొత్త అమావాస్య’(ఉగాది ముందురోజు)గా జరుపుకొంటారు.*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🦚🌴 🦚🌴🦚 🌴🦚🌴

No comments:

Post a Comment