*విశిష్ట చారిత్రక తెలుగు మహిళలు - 42*
*1906 - 1939*
*సాత్వికాభినయంలో మేటి తొలి తెలుగు సీత మంగళగిరి (సీనియర్) శ్రీరంజని*
"అమ్మా! వాల్మీకి రామాయణంలో మహా పతివ్రతామతల్లి సీతాదేవిని గురించి వ్రాయగా చదివాను.
నిన్ను చూస్తుంటే ఆ సీతమ్మ తల్లే సాక్షాత్కరించినట్లయింది. నీ నటనకు ముగ్ధుణ్ణయ్యాను" అని సీత పాత్రధారిని ఆశీర్వదిస్తూ అరచేతి వెడల్పు బంగారు పతకం బహూకరించారు జయపూర్ రాజా శ్రీ విక్రమ దేవ వర్మ.
కాశీనాధుని నాగేశ్వరరావుగారు కూడా మెచ్చుకున్నారట. 1934లో లవకుశ సినిమాలో సీత పాత్ర ద్వారా ప్రేక్షకులకు పరిచయమై మొదటి సినిమాతోనే తారగా గుర్తింపబడి అఖండ సన్మానాలందుకున్నది శ్రీరంజని.
ఈస్టిండియా కంపెనీ వారు పుల్లయ్య దర్శకత్వంలో కలకత్తాలో లవకుశ చిత్రాన్ని నూరు రోజుల్లో తయారు చేసి విడుదల చేసారు. ఈ చిత్రం అనేక చోట్ల శతదినోత్సవాలు జరుపుకుంది. శ్రీరంజని అన్ని కేంద్రాలకు వెళ్లి ప్రేక్షకులకు నమస్కరిస్తుంటే స్త్రీలు వనుపు, కుంకుమ, పూలదండలు సమర్పించి గౌరవించారట.
సినిమా 'సీత' బొమ్మను వాల్ పోస్టర్ల నుంచి కత్తిరించి ఇళ్లలో
గోడలకు అంటించుకున్నారట.
మంగళగిరి శ్రీరంజని గుంటూరు జిల్లా నర్సరావు పేట తాలూకాలో 1906లో జన్మించింది. మేనత్తలు అంజనాదేవి, శేషగిరిల వద్ద
సంగీత నాట్యాలు అభ్యసించింది. తరంగాలు, అష్టపదులు పాడేది. 14వ ఏట శ్రీకృష్ణ విలాస సభ అనే నాటక సమాజంలో చేరి నటిగా గుర్తింపు పొందింది. ఈ కంపెనీకి మేనేజరుగా వ్యవహరించే జహార్మోనిస్టు కె. నాగుమణి (తరువాతి రోజుల్లో ఎస్. ఆర్. మూవీస్ అధినేత) ని వివాహం చేసుకుంది. శ్రీరంజని నాటకాల్లో స్త్రీ పురుష పాత్రలు రెండూ ధరించేది. శశిరేఖా పరిణయంలో *శశిరేఖ* గా, *అనిరుద్ధుడి* గా, 'సావిత్రి' లో *సావిత్రి*' గాను *సత్యవంతుడిగాను* నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. *రాధాకృష్ణలో* నారదుడిగా, *కృష్ణలీలలులో* దేవకిగా నటించేది.
శ్రీరంజని తన గాత్ర మాధుర్యంతో శాస్త్రీయ సంగీతంతో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తున్న సమయంలో హెచ్.ఎమ్.వి వారు గ్రామఫోన్ రికార్డు లివ్వవలసిందిగా ఆహ్వానించారు.
బెజవాడలో సి.పుల్లయ్య గారు పారుపల్లి సత్యనారాయణ ద్వారా ఈమెను గురించి తెలుసుకుని ఈమె పాట విని లవకుశలో సీత పాత్రకు తీసుకున్నారు. శ్రీరంజని భర్త నాగుమణి ఈ చిత్రంలో భరతుడిగా నటించారు. లవకుశ విజయవంతం కావడంతో కరుణ రస ప్రధాన పాత్రలకు శ్రీరంజనే తగిన నటి అని సినిమా ప్రపంచం నమ్మింది. మాయా బజార్ (1935) లో *సుభద్ర*, కృష్ణలీలలు (1935) లో *దేవకి,* సతీతులసి (1936)లో *పార్వతి*, సారంగధర (1937)లో *రత్నాంగి,* నరనారాయణ (1937)లో *గయుని భార్య*, చిత్ర నళీయం (1938)లో *దమయంతి,* మార్కండేయ (1938)లో *మరుద్వతి*, వర విక్రయం (1939)లో *భ్రమరాంబ* పాత్రలలో నటించి సాత్త్వికాభినయంలో మేటిగా నిరూపించుకున్నారు.
ఒక ప్రక్క చలన చిత్రాల్లో నటిస్తూనే మరొకవైపున శ్రీ పారుపల్లి సుబ్బారావుతో కలిసి ఆంధ్రదేశ మంతటా లవకుశ నాటక ప్రదర్శన లిచ్చేది. 1934లో మద్రాసు ఆంధ్ర నాటక కళాపరిషత్తులో పారుపల్లి సుబ్బారావు *రాధగా* నటించగా, శ్రీరంజని *మధురగా* నటించి ప్రశంసలందుకున్నారు.
శ్రీరంజని తన 33వ ఏట కాన్సర్ వ్యాధికి గురై 1939 సెప్టెంబరు 24న మరణించింది. తన పిల్లల కోసం తన చెల్లెలు శ్రీరంజనిని వివాహం చేసుకోవల్సిందిగా భర్తను కోరింది. అక్కాచెల్లెళ్లిద్దరి పేర్లూ ఒకటే కావడం వల్ల ఈమెను సీనియర్ శ్రీరంజని అని, చెల్లెల్ని జూనియర్ శ్రీరంజని అని వ్యవహరించేవారు. జూనియర్ శ్రీరంజని కె.వి రెడ్డి గారి *'గుణ సుందరి కథ*' లో గుణ సుందరిగా నటించి అక్కలాగే కరుణ రస ప్రధాన పాత్రలకు పేరు సంపాదించింది.
*ఓం నమో శ్రీవేంకటేశాయ!!*
(సమాప్తం)
No comments:
Post a Comment