*విశిష్ట చారిత్రక తెలుగు మహిళలు - 49-1*
*1927 - 2014. ఆంధ్రుల 'సీత' తెలుగుతెర నువర్ణ సుందరి అంజలీదేవి*
*“పిలవకురా అలగకురా నలుగురిలో నను ఓ రాజా!"* ఈ పాట ఆ రోజుల్లో సంగీతపరంగా ప్రజలను ఉర్రూత లూగించింది. ఆ పాట వినగానే అలనాటి అందాలతార అంజలీదేవి, ఆ చిత్రం *సువర్ణ సుందరి* గుర్తుకు వస్తాయి.
సుమారు 300 చిత్రాల్లో నటించిన అంజలి తెలుగు తెరపై తనదైన ముద్రను ఆవిష్కరించు కున్నారు. కథానాయికగానేకాక, తల్లి పాత్రల్లోనూ ఆమె రాణించారు.
అంజలీదేవి పెద్దాపురంలో 24-8-1927లో జన్మించారు. తల్లి దండ్రులు సత్యవతి, నూకయ్య. ఈమెకు ఒక తమ్ముడు ఇద్దరు చెల్లెళ్లు. పెద్దాపురంలో బ్రాంచి గర్ల్స్ స్కూల్లో నాలుగో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు.
పెద్దాపురంలో హరిశ్చంద్ర నాటకంలో లోహితాస్యుడి పాత్రధారి రాకపోవడంతో తండ్రి ఈమెను ఆ వేషం వేయించాడు.
అదే ఈమె జీవితానికి మలుపు. ఆ తర్వాత నాట్యం, సంగీత సాధన నిత్య కృత్యాలయ్యాయి. తండ్రి ఆమెను కాకినాడకు తరలించాడు. అక్కడే ఆమె కళా జీవితం ప్రారంభమైంది. చలన చిత్ర పరిశ్రమ తొలి దశలో సినిమా తారలు దాదాపు అందరూ నాటక రంగనుంచి వచ్చినవారే. ఐతే సినిమారంగంలో రాణించక వెనక్కి వెళ్లిన వాళ్లూ ఉన్నారు. నాటక రంగం నుంచి సినిమాకు వచ్చి అత్యున్నత స్థానాన్ని అలంకరించిన వారిలో అంజలీదేవి ఒకరు.
1916లో కాకినాడలో యంగ్మెన్స్ హాపీ క్లబ్ ఏర్పడింది. ఏలూరుపాటి వెంకటరత్నం, డి. జగన్నాయకులు, గండికోట జోగినాధం, బి.ఏ. సుబ్బారావు, ఎ.వి. సుబ్బారావు, రేలంగి, సూర్యకాంతం, కస్తూరి శివరావు, హరనాధ్, మొదలైన వారెందరో ఈ సమాజం నుంచి వచ్చారు.
అంజలీదేవి ఈ క్లబ్ సభ్యురాలైంది, తన ఎనిమిదో ఏట నుంచీ బాల పాత్రలు ధరించింది. హాపీ క్లబ్లో లో ఆది నారాయణరావుగారు హార్మోనిస్టు, నాటకాల రచయిత కూడా. ఆయన నాటకాల్లో ప్రధాన పాత్రల్ని అంజలీదేవే నటించేది. స్త్రీ పాత్రల్ని స్త్రీలే ధరించడం అప్పట్లో చాలా తక్కువ. స్త్రీ పాత్రల్ని పురుషులే ధరింపవలసి వచ్చేది.
ఐతే అంజలీ దేవి వల్ల ఈ క్లబ్కు ఆ పరిస్థితి రాలేదు. ఆమె యంగ్ మెన్స్ హపీ క్లబ్ వారి నాటకాల్లో విభిన్నమైన పాత్రలను, వైవిధ్యం గల పాత్రలను నటించింది.
1939లో *'కుచేల'* నాటకంలో ఈమె రుక్మిణి పాత్ర పోషించగా అక్కినేని నాగేశ్వరరావు సత్యభామగా నటించారు. *'కాలేజీ గర్ల్'* అనే నాటకంలో ఆమె పాత్రకు రంగస్థల నటిగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ రోజుల్లో ఆ నాటకం ఆంధ్రదేశంలోని ప్రముఖ పట్టణాలన్నింటిలోనూ ప్రదర్శింపబడింది. ఆది నారాయణరావు రచించిన *'స్ట్రీట్ సింగర్'* లో అంజలీ నటనకు 1943లో ఆనాటి గవర్నర్ శ్రీ ఆర్థర్ హాప్ బంగారు పతకం బహూకరించారు. నాటక రంగంలో పేరు ప్రఖ్యాతులు రాగానే ఆమెకు సినిమా అవకాశం వచ్చింది.
1944లో సి. పుల్లయ్య దర్శకత్వంలో *'గొల్లభామ'* చిత్రం ద్వారా ఆమె తెలుగు సినిమా రంగంలో ప్రవేశించారు.
అందులో *మోహిని* అనే అప్సరస వేషంతో ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేసారు. ఆమె అసలు పేరు అంజనీ కుమారి. ఆ చిత్రంలో దర్శకుడు అంజలీదేవిగా నామకరణం చేసారు. చిత్ర రంగంలో సన్నిహితులు ఆమెను అమ్మాయిగారని పిలుస్తారు.
కాకినాడ యంగ్ మెన్స్ హాపీ క్లబ్ రోజుల నుండే ఆది నారాయణ రావు గారితో పరిచయం. వారిద్దరూ 1948లో దంపతులయ్యారు. ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలోని *కష్టజీవిలో* మొదటిసారి హీరోయిన్గా నటించారు.
తరువాత *పల్లెటూరి పిల్ల*' లో ఆమె పాత్ర ఆమెను శిఖరాగ్రం మీద కూర్చోపెట్టింది. కొంచెం వెనగ్గా ఘంటసాల బలరామయ్య గారి *'లక్ష్మమ్మ కథ'* విడుదలైంది. అందులో అంజలి లక్ష్మమ్మ పాత్రను నవరస భరితంగా పోషించింది. *రక్షరేఖ, కీలుగుర్రం చిత్రాల్లో 'వేంప్'* పాత్రలు పోషించింది. తర్వాత *బాలరాజు, స్వప్న సుందరి, చెంచులక్ష్మి* మొదలయిన చిత్రాల్లో నాయికగా నటించి పేరు తెచ్చుకున్నారు. బి.ఏ సుబ్బరావుగారు తమ దర్శకత్వంలో నిర్మించిన *'చెంచులక్ష్మి* చిత్రంలో ఆమె నటన బాగా అలరించింది.
*ఓం నమో శ్రీవేంకటేశాయ!!*
(సశేషం)
No comments:
Post a Comment