#శ్రీ_విశ్వావసు_చైత్ర_పౌర్ణమి
స్వీయరచన. ఈ పోటీకి మాత్రమే రాయబడింది.
శీర్షిక :పచ్చటి పరిశ్రమ
చిప్పలపాలెం.
తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మిడివరం మండలంలో ఉన్న చిన్న పల్లెటూరు.
భగభగామండుతున్న సూర్యుడికి చెమటలు పట్టకుండా విసినకర్రల్లా ఊగుతున్నాయి ఆ ఊరులోని పచ్చని కొబ్బరి ఆకులు.
వేసవితాపాన్ని తప్పించుకోవడానికి పచ్చనిచెట్ల నీడలో సేదతీరుతున్నారు పల్లెటూరి ప్రజలు. ఇంటింటికీ ఫ్యాన్లు, ఏసీలు ఉన్నా పవర్ కట్ వల్ల ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంటికి అలంకారప్రాయమవుతున్నాయి తప్ప ఒంటికి చల్లదనాన్ని ఇవ్వలేకపోతున్నాయి.
ఇంటి వెనక కొబ్బరితోటలో ఎదురెదురు చెట్లకి గోనె సంచీలతో గట్టిగా కట్టిన ఉయ్యాల ఊగుతూ ఫోన్ లో
"లేదురా విజయ్ ఆ సిటీలో ఉండి వర్క్ చెయ్యడం నావల్ల కాదురా, అంతంత దూరాలు వెళ్లి అంతంత మాత్రం సంపాదించడం నాకేమాత్రం ఇష్టం లేదురా,ఉన్న ఊళ్ళోనే నాకు నచ్చినట్టు బ్రతకాలనుకుంటున్నాను"
అలా అని సరైన చదువు చదివి గొప్పగొప్ప ఉద్యోగాలు తెచ్చుకుని విదేశాల్లో సెటిల్ అయ్యేవాళ్లు, ఒక లక్ష్యం పెట్టుకుని అనుకున్నది సాధించే ఉన్నత ఉద్యోగులు కరెక్ట్ కాదని నా ఉద్దేశం కాదు.
పచ్చని ప్రకృతి ఒడిలో సేదతీరుతూ నన్ను నా కుటుంబాన్ని పోషించుకోవాలన్నదే నా ఆశరా, కడుపు నింపుకోవడం కోసం కన్న తల్లిలాంటి పల్లెని వదిలేసి రాలేనురా ఉంటాను అని ఫోన్ కట్ చేసి కళ్ళు మూసుకున్నాడు సూర్య.
వెళ్లకు నాయనా!!నువ్వు ఊరి నుండి ఒక్క అడుగు కూడా బైటకి పెట్టకు.ఏ పూటకి ఆ పూట నువ్వున్న దగ్గరికే భోజనం ప్లేట్ దగ్గరికి వస్తుంటే నువ్వెందుకు ఊళ్ళోంచి వెళ్లి ఒళ్లు వంచి పనిచెయ్యడం అని దెప్పిపొడుస్తూ కొడుకు చేతిలో చల్లటి మజ్జిగ గ్లాస్ పెట్టి కోపంగా ఇంట్లోకి వెళ్లిపోయింది సరోజ.
ఊరందరి పిల్లలూ చక్కగా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుని ఇంటిని నడిపిస్తుంటే,చెట్టంత ఎదిగిన తమ కొడుకు మాత్రం తండ్రి కష్టం మీద ఆధారపడి ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంటిని పట్టుకుని వేళ్లాడుతున్నాడు అనే తల్లిదండ్రుల బాధ అర్ధం అవుతూ ఉన్నా తన ఆలోచన ఆచరణలో పెట్టి విజయం సాధించే దాకా తనకీ పరిస్థితులు తప్పవు అని తల్లి ఇచ్చిన మజ్జిగ తాగేసి మళ్ళీ ఆలోచనల్లో పడ్డాడు సూర్య.
కల్మషం ఎరుగని మనుషులు, కాలుష్యం లేని వాతావరణం టెక్నాలజీని ఆపాదించుకుంటున్నా వ్యవసాయం, ప్రకృతి ఉనికిని కోల్పోని పల్లెటూర్లలో ఉండడం అంటే ఎందుకు వీళ్ళకి ఇంత నామోషీ?అని బాధపడి తను రూపొందించుకున్న ప్రణాళిక అమలు చెయ్యడానికి సిద్దపడ్డాడు సూర్య.
మర్నాడు ఉదయాన్నే బైటకి వెళ్తున్నానని సరోజకి చెప్పి సిటీ వైపు తన బైక్ పోనిచ్చాడు.
ముందునుండీ తన ప్రతీ ఆలోచనని అర్ధం చేసుకుని తోడుండే తన ప్రాణస్నేహితుడు, పక్క ఊరి విలేజ్ సెక్రటరీ విజయ్ అందించిన సమాచారం మేరకు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీయల్ ఆఫీసిర్ ని కలిసి తన ప్లాన్ ఎలాగయినా సక్సెస్ చెయ్యాలని ముందే విజయ్ సహాయంతో ఆ ఆఫీసర్ ఆపాయింట్ మెంట్ తీసుకున్నాడు సూర్య.
తన ఆలోచన, పెట్టుబడి, ఆదాయం దానికి కావాల్సిన ముడిసరుకు వివరాలు రాసుకున్న పేపర్స్ జాగ్రత్తగా పట్టుకుని తనని లోపలికి పిలిచే వరకూ ఎదురుచూసాడు.
సూర్యా అంటే మీరేనా? మిమ్మల్ని సర్ లోపలికి రమ్మంటున్నారు అని పిలవడంతో లోపలికి వెళ్లి గుడ్ మార్నింగ్ సర్ అని విష్ చేసాడు.
గుడ్ మార్నింగ్!!కూర్చోండి .విజయ్ మీ గురించి చెప్పారు విషయం ఏంటి అని అడిగారు ఆ ఆఫీసర్.
సర్,నా గురించి విజయ్ చెప్పే ఉంటాడు నా పేరు సూర్య. బీటెక్ చేశాను. జాబ్ ఇంట్రెస్ట్ లేదు. చిన్నప్పటి నుండీ పెరిగిన పల్లెటూరిలో ముఖ్యంగా కొబ్బరి తోటల్లో బోలెడు ఉపాధి అవకాశాలు ఉండగా టౌన్ వెళ్లి సంపాదించడం ఎందుకు అని నా అభిప్రాయం అన్నాడు.
ఐతే కొబ్బరి బొండాల ఎగుమతి, కొబ్బరి చాపల పరిశ్రమ, కొబ్బరి పీచుతో బొమ్మలు బిజినెస్ చేద్దాము అనుకుంటున్నావా, లేక ట్రెండ్ కాబట్టి కొబ్బరి నీళ్లు బాటిల్స్ లో స్టోర్ చేసే ఆలోచన ఉందా ఆనడిగాడు ఆ ఆఫీసర్ ఈమధ్య మార్కెట్ లోకి వస్తున్న కొబ్బరి నీళ్ల బాటిల్స్ చూసి.
ఇవేవీ కాదు సర్ "కొబ్బరి చిప్పల"తో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు సూర్య.
కొబ్బరి చిప్పలతో? ఆశ్చర్య పోతున్నట్లు అడిగాడు ఆ ఆఫీసర్.
ఎంతో ఆత్మవిశ్వాసంతో తన ముందు కూర్చున్న ఇరవై మూడేళ్ల యువకుడి దూరదృష్టి మనసులో అభినందిస్తూ, కొబ్బరి చిప్పలతో ఏం చేస్తావు అని అడుగుతూ సూర్య ఇచ్చిన పేపర్స్ లో పోయింట్స్ చెక్ చేస్తున్నాడు ఆఫీసర్.
సర్, మా కోనసీమలో కొబ్బరి పంటకి పెట్టింది పేరు అని అందరికీ తెలుసు కదా, కొబ్బరితోటలు, కొబ్బరి నూనె,పీచులు,కొబ్బరి కురిడి, బొండాలు కాకుండా కొబ్బరి చిప్పలకు కూడా విపరీతమైన డిమాండ్ ఉంది కదా సర్ అనగానే అవును అన్నట్టు సూర్య వైపు చూసారు ఆఫీసర్.
చూస్తున్న పేపర్స్ పక్కన పెట్టేసి కొబ్బరి చిప్పల వ్యాపారం చేస్తావు సరే,అది ఎంతవరకు లాభదాయకం అని తెలుసా అన్నాడు సూర్య చేసిన గ్రౌండ్ వర్క్ తెలుసుకుందాం అని.
కూర్చున్న కుర్చీలో కాస్త సర్దుకుని, సర్ మనం ముందు మాట్లాడుకున్నట్టు మన రాష్ట్రం లో కొబ్బరి పంటకు మంచి డిమాండ్ ఉంది అందుకే అందరూ కొబ్బరిబొండాల వ్యాపారమే చేస్తుంటారు దీనివల్ల "కొబ్బరి చిప్పల"కొరత ఏర్పడింది.
సాధారణంగా కొబ్బరిచిప్పల్ని విసిరేస్తాం లేదా పొయ్యిలోకి వంటచెరకు గా వాడతాం. కానీ కొబ్బరి చిప్పకి అపూర్వమైన డిమాండ్ ఉందని చాలా కొద్దిమందికి తెలుసు.
"టన్ను కొబ్బరిపీచు ధర గతంలో 7000-8000ఉండగా,రెండేళ్లు క్రితం 18,000అయ్యి ఇప్పుడు టన్ను కొబ్బరిపీచు ధర 26,500ఉంది "అంటే కొబ్బరి చిప్ప డిమాండ్ ఏంటో అర్ధం చేసుకోండి సర్
కొబ్బరి ఉత్పత్తి ఎక్కువగా ఉండే తమిళనాడు, కేరళ లో కొబ్బరి ఉత్పత్తి తగ్గడం వల్ల కర్ణాటక లో కొబ్బరి డిమాండ్ పెరిగింది.
"కొబ్బరి చిప్పల్ని కాల్చడం వల్ల వచ్చే బొగ్గు ఇతర రాష్ట్రాల నుండీ వచ్చే బొగ్గులో 80%కన్నా తక్కువ కార్భన్ కంటెంట్ ఉంటే, కర్ణాటక రాష్ట్రము నుండీ వచ్చే బొగ్గులో 85%నుండీ 85%వరకూ ఎక్కువ కార్బన్ కంటెంట్ ఉండడం వల్ల కర్ణాటక బొగ్గుకి డిమాండ్ ఎక్కువగా ఉంది".
మన రాష్ట్రం లో కూడా కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో కొబ్బరికి విపరీతమైన డిమాండ్ ఉండడం వల్ల ఇక్కడ స్థానికంగా కొబ్బరి చిప్పల్ని కాల్చి బొగ్గు తయారీ చేసి కేరళ, తమిళనాడు కర్మాగారాలకు పంపుతున్నారు సర్
"బొగ్గు ఎక్కువ వేడి ఉత్పత్తి చేసే ఈ బొగ్గు ఎక్కువగా వంట, గ్రిల్లింగ్, పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. బయోడీగ్రేడబుల్ కప్పులు, ప్లేట్లు, గిన్నెలు ప్లాస్టిక్ కి ప్రత్యామ్నయంగా ఉపయోగిస్తారు. కొన్ని ఆర్టిఫిషియల్ నగలు తయారీకి కూడా ఈ బొగ్గు ఉపయోగపడుతుంది."
అంతే కాకుండా నీటి శుద్దీకరణ, గాలి ఫిల్టర్ లో ఉత్తేజకారకాలుగా కూడా ఈ బొగ్గు ఉపయోగపడుతుంది.అందుకే సర్ నేను మా ప్రాంతంలో జరిగే ఈ కొబ్బరి చిప్పలు బిసినెస్ స్టార్ట్ చెయ్యాలి అనుకుంటున్నాను అన్నాడు సూర్య ఆఫీసర్ వంక కాన్ఫిడెంట్ గా చూస్తూ.
వెల్ డన్ మిస్టర్ సూర్య!!నీ ఆలోచన బాగుంది తప్పకుండా నీకు గవర్నమెంట్ నుండి నా నుండీ ఫేవర్ జరుగుతుంది అల్ ది బెస్ట్ అని విష్ చేసారు ఆఫీసర్.
ఇంటికొచ్చి తల్లిదండ్రులకి చెప్పి వాళ్ళ కాళ్ళు మొక్కాడు. .ఎవరినీ మోసం చెయ్యకుండా తన కాళ్ల మీద తను నిలబడి కొడుకు ప్రయోజకుడు ఐతే చాలు అనుకునే ఆ తల్లిదండ్రులు సూర్యని ఆశీర్వదించారు.
ఊరిలో వారికి విషయం తెలిసి కొంత మంది మెచ్చుకుంటే, మరికొంత మంది చక్కగా చదువుకున్న పిల్లాడు సిటీలో ఉద్యోగాలు చేసుకోకుండా కొబ్బరి చిప్పల్ని నమ్ముకుంటున్నాడు చివరికి వీడికి ఆ చిప్పే మిగులుతుంది అని సూర్య ముందరే వేళాకోళంగా మాట్లాడారు.
కానీ సూర్య అవేవీ పట్టించుకోలేదు.తన ఆలోచన ఆచరణ లో పెట్టడానికి స్నేహితుడు విజయ్, ఆఫీసర్ సహాయపడ్డారు. మెల్లిగా మొదలైన సూర్య వ్యాపారం ఆధునీకరణని సంతరించుకుంటూ ముందుకు వెళ్తోంది.
కొబ్బరి పండించే రైతుల వద్దకు వెళ్లడం, సైకిల్ మీద బండ్ల మీద కొబ్బరి బొండాలు అమ్ముకునే చిన్న చిన్న వ్యాపారస్థుల వద్దకు వెళ్లి కొబ్బరి చిప్పల ఉపయోగాలు తెలిపి వాటిని సేకరించి గూడౌన్స్ లో పెట్టించి ఎండలో పెట్టిన కొబ్బరి చిప్పల్ని కాల్చి బొగ్గు చెయ్యడంలో అవగాహన కలిగించడం చాలా కష్టం గా అనిపించేది సూర్యకి.
ఒక్కో విషయంలో పట్టు సాధించి కొబ్బరి బొండం లో నీళ్లు వృధా పోకుండా చిప్ప పగలకుండా ఉండేలా ఒక పరికరాన్ని కనుక్కున్నాడు.
చిన్న వయసులో అబ్బిన వ్యాపార దీక్షత, తెలివితేటల్ని గుర్తించిన సూర్యాని జాతీయ స్థాయి పత్రికలు ఆకాశానికి ఎత్తేసాయి.న్యూస్ ఛానెల్స్ స్పెషల్ కవరేజ్ లు పలు ఇంటర్యూ లు తీసుకున్నాయి.
ఇప్పుడు సూర్య మనసు చాలా సంతోషంగా ఉంది. ఇంటి వెనుక కొబ్బరి తోటలో చెట్లకి కట్టిన ఉయ్యాల ఊగుతూ తన ఆనందాన్ని కొబ్బరి చెట్లతో పంచుకున్నాడు.
"ఎండల్లో నీడ గానే కాదు కష్టం లో తోడు ఉన్న చెట్లే చుట్టాలు అనుకుని కొబ్బరి చెట్లని ఆత్మీయంగా హత్తుకున్నాడు."
మొగుతున్న సెల్ ఫోన్ ఆన్సర్ చేస్తూ హలో అన్నాడు.
మిస్టర్ సూర్య నేను రాజీవ్ రాజీవ్ కాలేజస్ ఆఫ్ చైర్మన్ అన్నారు.
నమస్తే సర్ చెప్పండి అన్నాడు సూర్య.
సూర్య మీ ఇంటర్యూ చూసాను వెల్డన్. చిన్న వయసులో మీరు సాధించిన విజయం ఎందరికో ఆదర్శం. మీ ఇంటర్యూ సోషల్ మీడియాలో ఎంతోమంది యువత చూసి మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు
వచ్చే నెలలో మా అగ్రికల్చలర్ కాలేజస్ ఇండస్ట్రీయల్ టూర్ కి మీ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నారు స్టూడెంట్స్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు మీకు ఓకే కదా అని అడిగారు రాజీవ్.
తప్పకుండా కలుద్దాం సర్ అని కాల్ కట్ చేసాడు సూర్య.
నెల రోజులు తర్వాత ఇండస్ట్రీయల్ టూర్ కి చిప్పలపాలెం వచ్చిన రాజీవ్ కాలేజ్ అగ్రికల్చర్ బి.ఎస్.సి చదువుతున్న స్టూడెంట్స్ ఆ ఊరి పచ్చటి అందాల్ని చూసి మైమరిచిపోయారు.
ఊరంతా తిరిగి అలసిపోయిన స్టూడెంట్స్ సూర్య ఇంటి వెనకాల కొబ్బరి తోటలో తాము చూసిన నిర్మాణాన్ని చూసి వావ్!!సూపర్బ్ అనుకోలేకపోయారు.
"కొబ్బరి చెట్లు మధ్య దిబ్బలా ఎత్తులా ఉండే ప్రదేశంలో రాయి ఆకృతిలా చెక్కి దాన్ని మొత్తం కొబ్బరిపీచుతో కవర్ చేస్తే అచ్చు కొబ్బరిచిప్పలా ఉంది చూడడానికి."
లోపల అందమైన చెక్క మెట్లు, చెక్క బల్లలు, టీపాయ్ తో చూడముచ్చటగా ఉంది.
పైన గుడిసె వేసి దానిపై కూడా కొబ్బరి పీచు వేసారేమో మోడ్రన్ ప్రకృతి కుటీరంలా ఉందా ప్రదేశం.
ప్రకృతి లో సేదతీరుతూ పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ కాలుష్యరహిత ఉపాధి అవగాహనపై సూర్య చెప్పిన పాయింట్స్ నోట్ చేసుకున్నారు భవిష్యత్తు ప్రకృతి పరిశ్రమదారులు.
శుభం.
✍️గాయత్రి శంకర్ నాగాభట్ల
No comments:
Post a Comment