*✍️నేటి కథ✍🏻*
*శ్రీరాముడు*
అయోధ్యా నగరానికి రాజు దశరథుడు. అతనికి నలుగురు కుమారులు, రామ,లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, వీళ్ళలో పెద్దవాడు రాముడు. రాముడి తల్లి కౌసల్య, లక్ష్మణ,శత్రుఘ్నుల తల్లి సుమిత్ర, భరతుడి తల్లి కైకేయి. నలుగురు అన్నదమ్ములూ ఎంతో ప్రేమతో కలిసిమెలిసి ఉండేవాళ్ళు. రాముడు తమ్ముళ్ళపట్ల అమితమైన ప్రేమాభిమానాలు కనబరచేవాడు.
వీళ్ళు వశిష్ఠుని దగ్గర విద్యాభ్యాసం ముగించుకొని రాజ్యానికి తిరిగివచ్చారు.
విశ్వామిత్రుడి కోరిక మేరకు రాముడు లక్ష్మణుడితో కలసి యాగరక్షణ చేశాడు. విశ్వామిత్రుడి దగ్గర వివిధ అస్త్ర శస్త్ర విద్యలతో పాటు బల, అతిబల అనే ప్రత్యేక యుద్ధవిద్యలను
రామలక్ష్మణులు నేర్చారు. జనక మహారాజు ఆస్థానంలో రాముడు శివధనుస్సును ఎక్కుపెట్టి
సీతను వివాహమాడాడు.
దశరథుడు తన అనంతరం పెద్దకుమారుడైన రాముణ్ణి రాజుగా చెయ్యాలనుకున్నాడు.
కానీ కైకేయి కోరిక ప్రకారం తండ్రి మాటను నిలబెట్టడానికి రాముడు రాజ్యాన్ని వదులుకొని
సీతాలక్ష్మణులతో కలసి 14 సంవత్సరాలు వనవాసం చేశాడు.
వనవాస సమయంలో రాముడు ధర్మరక్షణకోసం అనేక మంది రాక్షసులను వధించాడు.రాక్షస రాజైన రావణుడు సీతాదేవిని అపహరించుకొని పోయాడు. హనుమ, సుగ్రీవ,వానరసేనల సహాయంతో రాముడు రావణుణ్ణి సంహరించాడు. బంగారుమయమైన లంకను చూసి లక్ష్మణుడు ఇక్కడే ఉండి రాజ్యపాలన చేద్దామని రాముడితో అన్నాడు. అప్పుడు
రాముడు కన్నతల్లి, జన్మభూమి స్వర్గంకంటే గొప్పవని, మన అయోధ్యకే తిరిగిపోదామని
అన్నాడు. ఈ విధంగా రాముడు తన మాతృదేశభక్తిని చాటాడు. లంకారాజ్యానికి విభీషణుణ్ణి
రాజుగా చేసి అయోధ్యకు తిరిగి వచ్చాడు.
రాముడు అయోధ్యకు రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. తన కర్తవ్యపాలనకోసం ఎన్ని త్యాగాలు చేయవలసి వచ్చినా, ఎంతటి దుఃఖాన్ని అనుభవించవలసివచ్చినా అతను చలించలేదు. తన జీవనవిధానంద్వారా ఉన్నతంగా ఎలా జీవించాలో ఆచరించి చూపాడు.ప్రజారంజకంగా పరిపాలించి తన రాజ్యానికి రామరాజ్యం' అన్న పేరు వచ్చేటట్లు చేశాడు.
No comments:
Post a Comment