Tuesday, April 22, 2025

 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
              *గౌరవ మర్యాదలు*

*ప్రతి మనిషీ గౌరవం కోరుకుంటాడు. మర్యాద మన్ననలు పొందాలనుకుంటాడు. గుర్తింపు లభించగానే ఉత్సాహం రెట్టింపు అవుతుంది. మెప్పులు, అభినందనలు అందగానే మనసు సంతోషంతో నిండిపోతుంది. అందరూ మెచ్చే ఘనకార్యాలు చేసేందుకు మనసు పురి విప్పుతుంది.*

*రావాల్సిన సమయంలో గుర్తింపు రాకపోతే జీవనోత్సాహంపై నైరాశ్యపు నీడలు కమ్ముకుంటాయి. అడుగులు ముందుకు వెయ్యడం ఆగిపోతుంది. ఇది మనసు నైజం. అందుచేత దాన్ని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. కోరిక నెరవేరలేదని వ్యక్తి మీద లేదా వ్యవస్థ పైనా మనసు అలకబూనుతుంది. అలా చేయడమూ ప్రతీకారం తీర్చుకోవడమే అవుతుంది. అది ప్రాకృతిక ప్రామాణిక సూత్రాలతో కూడిన ధార్మిక (సాధికారిక) జీవన విధానానికి విరుద్ధం.*

*చప్పట్లు, బహుమానాలు, పథకాలు, పురస్కారాలు ఎదుగుదలను కాంక్షించే ఉత్ప్రేరకాలు. అవి కృషిని కీర్తిస్తాయి, ప్రోత్సహిస్తాయి. మరొకరికి స్ఫూర్తినిస్తాయి. అవి రానంత మాత్రాన కుంగిపోకూడదు.*

*ఒక చిరునవ్వు, చిన్న పలకరింపు- గౌరవించడం కిందకే వస్తాయి. అవి మనుషుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాయి. ఒక మహాసభలో ఎందరో మహానుభావులున్న వేదిక మీంచి ఎవరో మిమ్మల్ని పేరు పెట్టి పిలవడం మీ చెవులకు మధురమైన సంగీతంలా వినిపిస్తుంది. ఆ క్షణాల్లో అమితానందం సొంతమవుతుంది.*

*రక్త సంబంధీకులు, బంధువులు, ఆత్మీయులు శుభకార్యాల పేరిట మీ ఇంటికి వస్తే, ఇంటిల్లపాదీ ఎదురెళ్ళి ఘన స్వాగతం పలుకుతారు. అది సామూహిక మర్యాద. కొందరు చెమ్మగిల్లిన కళ్లతో హృదయాల్ని తాకుతారు. అది ఆత్మలు పెనవేసుకున్న ఆలింగనం. నేలపై కూర్చున్నవాళ్లు సైతం లేచి నిలబడినప్పుడే వచ్చిన అతిథికి గౌరవం ఇచ్చినట్లు భావిస్తారు. ఇదంతా భారతీయ సంప్రదాయంలో ఇప్పటికీ సజీవంగా ఉంది.*

*ఒక్కోసారి ఎవరి బలం వారికి తెలియదు. అలాంటి సమయాల్లో ప్రాజ్ఞులు, అనుభవజ్ఞులు ముందుకు వచ్చి ‘మనిషి’ అనేవాడు ఎంతటి శక్తిమంతుడో తెలపాలి. అసాధ్యాల్ని సుసాధ్యం చేసే అసామాన్యుడు అని అతడికి ఎరుక చెయ్యాలి.*

*శ్రీరాముడు సీతమ్మను వెతికే ఘట్టంలో హనుమంతుడి బలం అతడికే తెలియదు. ఆ విషయాన్ని అతడికి ఇతరులు గుర్తుచేశారు. అతణ్ని గొప్పగా పొగిడారు. అది విన్న ఆంజనేయుడిలోని అంతఃచైతన్యం జాగృతమై అతణ్ని ఘనుణ్ని చేసింది. ఊరూరా దేవుణ్ని చేసింది.*

*'మనం ధర్మాన్ని కాపాడితే అదే ధర్మం మనల్ని రక్షిస్తుంది’ అని శాస్త్రం చెబుతోంది. ధర్మాన్ని కాపాడటం అనేక రూపాల్లో జరుగుతుంది. అంతరించిపోతున్న కళను కాపాడటం, ఆ కళాకారుల్ని గౌరవించడం అంటే, ఒక విధంగా ధర్మాన్ని కాపాడటమే అవుతుంది. కళల్ని నమ్ముకుని కొంతమంది పేద కళాకారులు అరకొర జీవనం సాగిస్తూంటారు. వారి ముఖాల మీదే రంగులు ఉంటాయి గానీ తెరవెనక వారి జీవితాల్లో చీకట్లు కమ్ముకుని ఉంటాయి. కాలే కడుపులతో కళను బతికిస్తున్నది వాళ్లే. ఆ కళాపోషణ ఉపరితలం మీంచి చూస్తే కేవలం జీవనభృతి కోసం అన్నట్లుగా అగుపడుతుంది గానీ- ఒక గొప్ప సాంస్కృతిక సంపదను ముందుతరాలకు అందించే సాధికారిక ప్రక్రియగా భావించాలి. అటువంటి కళాకారుల్ని తప్పకుండా గౌరవించాలి.*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*🙏 సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🌳🌴 🌳🌴🌳 🌴🌳🌴

No comments:

Post a Comment