చూపున్న మాట
జూనియర్ కళాశాలల ఎంపిక ఎలా?
వెబ్‌సైట్‌లు లేవు.. అధ్యాపకుల జాబితా అసలే ఉండదు
హాస్టళ్లలో వసతులపై కనీస నిబంధనలు కరవు
పిల్లల్ని చేర్చే ముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్న నిపుణులు
జూనియర్ కళాశాలల ఎంపిక ఎలా?
ఈనాడు, హైదరాబాద్: నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్(న్యాక్), కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్, తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ మండలి(టీఏఎఫ్‌ఆర్‌సీ) ఖరారుచేసే ఫీజుతో ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్ తదితర వృత్తివిద్య కోర్సులను అందించే కళాశాలలు నాణ్యమైనవా? కాదా అనేది తెలుసుకునేందుకు అవకాశం ఉంది. అదే జూనియర్ కళాశాలలను గుర్తించాలంటే ఎటువంటి ప్రామాణిక కొలమానాలు లేవు. వాటి పరిధిలోని వసతి గృహాలపై విద్యాశాఖ పర్యవేక్షణ అసలే లేదు. జేఈఈ, నీట్, ఎప్‌సెట్ పేరు చెప్పి ఎంత ఫీజు వసూలు చేస్తున్నా నియంత్రించే యంత్రాంగమూ లేదు. అందుకే తమ పిల్లల్ని ఏ కళాశాలలో చేర్పించాలనే అయోమయం తల్లిదండ్రులను వెంటాడుతుంటుంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా కొన్ని అంశాలను తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
హైదరాబాద్, చుట్టుపక్కల చేరే ముందు...
రాష్ట్రవ్యాప్తంగా 1,400 వరకు ప్రైవేట్ జూనియర్ కళాశాలలున్నాయి. రాష్ట్రంలో ఏటా ఇంటర్‌లో సుమారు 4.80 లక్షల మందికిపైగా చేరుతుండగా..అందులో కేవలం ప్రైవేటు కళాశాలల్లోనే దాదాపు 3 లక్షల మంది ప్రవేశాలు పొందుతున్నారు. 217 ప్రైవేటు కళాశాలలు గృహ, వాణిజ్య సముదాయాల్లో నడుస్తున్నందున..ఆయా యాజమాన్యాలు ఏటా షరతులతో అనుమతులు పొందుతున్నాయి. అందులో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనే 90 శాతం ఉన్నాయి. ప్రవేశాలు పొందే ముందు ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్లో (www.tsbie.cgg.gov.in) ‘అఫిలియేటెడ్ కాలేజెస్’ అనే చోట క్లిక్ చేస్తే అనుమతులు ఉన్న కళాశాలల జాబితా ఉంటుందని, వాటికి మాత్రమే బోర్డు అనుమతి ఉన్నట్లు భావించాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘ఆ వెబ్‌సైట్‌ను చూస్తే మీ పిల్లలు చేరిన కళాశాలకు అనుమతి ఉందో లేదో తెలిసిపోతుంది. పిల్లల అభిరుచులు, శక్తిసామర్థ్యాలను పరిగణనలోకి తీసుకొని కళాశాలను, గ్రూపును ఎంపిక చేసుకోవడం అత్యంత ముఖ్యం. పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడి తమ కుమారుడు/కుమార్తె ఏ గ్రూపులో రాణిస్తారో తెలుసుకుంటే మరీ మంచిదని’ విద్యావేత్తలు సూచిస్తున్నారు.
ఇళ్ల దగ్గరకు వచ్చే పీఆర్వోలు చెప్పే మాయమాటలు నమ్మకూడదు. వారు మొదటి సంవత్సరానికి మాత్రమే ఫీజు చెబుతారు. ఒకసారి ప్రవేశం పొందిన తర్వాత విద్యార్థి ఎటూ వెళ్లలేడనే భావనతో అనేక కళాశాలలు రెండో ఏడాది ఫీజును భారీగా పెంచుతున్నాయి. అందుకే ద్వితీయ సంవత్సరం ఫీజునూ ముందే రాతపూర్వకంగా నిర్ధారించుకోవడం ఉత్తమం.
ఆయా సబ్జెక్టులు బోధించే అధ్యాపకులు ఎవరు, వారి విద్యార్హతలు, అనుభవం తదితరాలు తెలుసుకుంటే విద్యార్థి భవిష్యత్తు బాగుంటుంది.
హాస్టళ్లలో నలుగురు ఉండాల్సిన గదిలో ఆరేడు మందిని ఉంచుతున్న ఉదంతాలెన్నో. కాబట్టి హాస్టళ్లలో చేర్పించే పక్షంలో ఒక్కో గదిలో ఎంత మందిని ఉంచుతారో ముందే తెలుసుకోవడంతోపాటు ఆ మేరకు సౌకర్యాలు ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి.
రెసిడెన్షియల్ కళాశాలల్లో చేరే ఎక్కువ మంది విద్యార్థుల ఫిర్యాదు భోజనంపైనే ఉంటుంది. ఈ నేపథ్యంలో హాస్టల్ మెనూ తెలుసుకోవడం ఉత్తమం.
ఐదంకెల నంబరు బోర్డుపైన ఉందా?
కొన్ని కళాశాలలకు ఇంటర్‌బోర్డు అనుమతులు ఉండవు. కొన్ని యాజమాన్యాలు ఒక దానికి అనుమతి తీసుకుని.. రెండు మూడు చోట్ల బ్రాంచీలు నడుపుతాయి. ఉదాహరణకు అమీర్‌పేటలో ఉన్న కళాశాలలో చేర్చే పక్షంలో చుట్టుపక్కల పరీక్ష కేంద్రాలు ఉంటాయని తల్లిదండ్రులు భావిస్తారు. వాస్తవంగా దానికి వేరే ప్రాంతంలో అనుమతి ఉండటంతో పరీక్ష కేంద్రం దూరంగా ఉంటుంది. అందువల్ల చేర్పించే ముందే కళాశాలకు ఇంటర్‌బోర్డు జారీ చేసిన ‘ఐదు అంకెల కళాశాల కోడ్’ ఉందా అనేది ఆరా తీయాలి. సాధారణంగా ఆ నంబరును కళాశాల బోర్డుపైనే రాస్తారు. అలా రాయని పక్షంలో ఆ భవనంలో నడిచే కళాశాలకు అనుమతి లేనట్లేనని భావించాలి.
No comments:
Post a Comment