Tuesday, April 22, 2025

 *ఐకమత్యమే బలం!* 

*ఐకమత్యం లోపించడం అనేది ప్రస్తుతం భారతీయుల్లో కనిపిస్తున్న 'ప్రధాన సమస్య. ఐకమత్యం ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఐకమత్యం కంటే ప్రధానమైన విషయాలు పాత్ర వహిస్తాయి? అనేది కాస్త విచక్షణతో ఆలోచించాల్సిన విషయం. అందుకే పూర్వం కుటుంబంలో ఐకమత్యం బాగా నేర్పేవారు. 'వాడు నీ తమ్ముడురా! వాడిని ఎవరన్నా ఏమన్నా అంటే ఊరుకుంటావా! జాగ్రత్త చూసుకోవాలి కదా!' అని తల్లి అనేది. అప్పుడు అ కుర్రాడికి అర్థమయ్యేది. 'అన్నదమ్ములం, ఆక్కాచెల్లెళ్లం ఒక కుటుంబం. అందరం ఐకమత్యంగా ఉండాలి' అని ఈ కుటుంబపరమైన ఐకమత్యం. తరువాత వెంటనే దేశాన్ని చూపించారు. ఐకమత్యం ఉండాల్సింది. కులాల్లోనూ, మతాల్లోనూ, ప్రాంతాల్లోనూ కాదు. ముందు కుటుంబంలో, తరువాత దేశంలో! కుటుంబంలో ఐకమత్యం ఎలా ఉండాలో ధర్మరాజు మాటల ద్వారా నేర్చుకోవచ్చు.*

*పాండవులు అరణ్యవాసం చేస్తూ, అడవిలో ఆకులు, అలములు తిని జీవిస్తుంటే, అది కూడా వాళ్లకు దొరకడం నచ్చక దుర్యోధనుడు దండయాత్రలాంటి పనిచేశాడు. దానికి 'ఘోషయాత్ర' అని పేరు 'ఘోష' అంటే గొల్లపల్లె. చరిత్రలో దుర్యోదనుడిని మించిన ప్రతినాయకుడు ఉండడు. ధర్మరాజు ఏ నదీ తీరంలోనైతే యజ్ఞం చేస్తున్నాడో, ఆ నదీ తీరానికి అవతలి గట్టున తన మందీమార్బలం, సైన్యంతో మకాం పెట్టాడు దుర్యోధనుడు. జలక్రీడలు, విందులు, చిందుల్లో భాగంగా అక్కడున్న గంధర్వుల సరస్సులో స్నానానికి కౌరవులు దిగారు. అక్కడ కాపలావాళ్లు అభ్యంతరం చెప్పారు. దాంతో యుద్ధం జరిగింది. గందర్వుల సైనికులే కాదు, చిత్రసేనుడనే గంధర్వుడు కూడా వచ్చాడు. గంధర్వుల చేతిలో దుర్యోధనుడి సైన్యం ఓడిపోయింది. దుర్యోధనుణ్ణి రథ స్తంభానికి కట్టేసి లాక్కెళ్లారు. అప్పుడు కౌరవ సైనికులు వచ్చి దుర్యోదనుణ్ణి కాపాడమని పాండవుల కాళ్లు పట్టుకున్నారు. వెంటనే భీమార్జునులను ధర్మరాజు పిలిచి, "మన సోదరుడు దుర్యోధనుడికి ఆపద వచ్చింది. మీరు వెళ్లి కాపాడాలి" అని అన్నాడు. అప్పుడు భీముడు 'కాగల కార్యం గంధర్వులు తీర్చారు' అని అన్నాడు. ఈ సామెత అక్కడి నుంచి వచ్చిందే. మనను ఎన్ని కష్టనష్టాలకు గురిచేశాడు. అటువంటి వాడిపైన దయ ఏందుకు? మేం వెళ్లి రక్షించం' అని భీమార్జునులు అన్నారు. అప్పుడు భీముడిని ఉద్దేశించి ధర్మరాజు ఐకమత్యం అంటే ఏమిటో చెబుతాడు.*

*పరైః పరిభవేత్ ప్రాప్తే వయం పంచోత్తరం శతం |*
*పరస్పర విరోధేతు వయం పంచ శతం చ తే ||*

*ఒక తాత్వికమైన అవగాహన ఉన్న వారు జీవితాన్ని నిష్కల్మషంగా గడుపుతారు. అందుకే ధర్మరాజుని 'యుధిష్ఠిరుడు' అన్నారు. 'మనందరిదీ ఒకటే వంశం. 'పరస్పర విరోధేత్ మనలో మనకే గనక విరోధం వస్తే 'వయం పంచ"... మనం ఐదుగురం. శతంచతే... వాళ్లు వందమంది. అలా కాకుండా బయటి వాడు మనమీదకొస్తే 'పంచోత్తరం శతం' అంటే వాళ్లు వంద మంది, మనం ఐదుగురం. మొత్తం నూటా ఐదుగురం ఉన్నాం. కలిసి ఎదుర్కోవాలి' అని ధర్మరాజు అన్నాడు.*

*దీన్ని గనుక మనం కుటుంబాలకు అన్వయించుకుంటే కుటుంబపరమైన ఐకమత్యం బాగుంటుంది. తరువాత అన్వయించాల్సింది దేశానికి మనదేశంలో తమిళ, కన్నడ, తెలుగు సోదరులకు ఏమైనా భేదాలొస్తే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. =కత్తులు దూసుకోకూడదు. (అదే పాకిస్తాన్ వాడో, చైనా?వాడో మన మీద దాడిచేస్తే అందరం ఐకమత్యంగా వాడి మీదకు వెళ్లాల్సిందే. మనదేశంలో ఏవైనా లోపాలుంటే మనం మాట్లాడుకోవాలి. మనమే పరిష్కరించుకోవాలి. విదేశాలకు వెళ్లినపుడు వాటి గురించి మాట్లాడకూడదు. కుటుంబమైనా అంతే. దేశమైనా అంతే! ఒక సమర్థుడైన వ్యక్తి ఒక మంచి సంస్థలో ఉంటే అతని వల్ల సంస్థకు ప్రయోజనం. సంస్థ వల్ల అతనికి ప్రయోజనం, సమర్థులైన వారు స్వదేశంలోనే ఉండాలి. అది దేశానికి గౌరవం, వారికి గౌరవం. ఎలా అంటే... శ్రీకృష్ణుడు 'సంజయ రాయబార సందర్భంలో "పాండవులు, కౌరవులు కలిసి ఉండటం అవసరం. వాళ్లకు చెప్పవయ్యా" అంటాడు. 'ఆ అవసరం ఏముంది?' అని సంజయుడు ప్రశ్నించినప్పుడు...'ధృతరా ష్ట్రుడున్ పుత్రులున్ వనముల్... దృతరాష్ట్రుడు ఆయన పుత్రులు మహారణ్యంలాంటివారు 'కుంతీ నందనుల్ సింహముల్... పాండవులు ఐదుగురు సింహాల్లాంటివారు. అయితే సింహంలేని అరణ్యాన్ని జనాలందరూ వచ్చి నాశనం చేస్తారు. అరణ్యంలో సింహం ఉంటే ఒక్కడూ అడుగుపెట్టడు. అరణ్యంలో ఉండకపోతే సింహాలకు కూడా రక్షణ ఉండదు. అలాగే పాండవులు కౌరవులతో కలిసి ఉంటే మంచి సామ్రాజ్యంతో ఉంటారు. కౌరవులు కూడా పాండవులతో కలిసి ఉంటే బలంగా ఉంటారు. ఇద్దరూ బాగుంటారు' అని చెబుతాడు శ్రీకృష్ణుడు. 'ఐకమత్యం మహాబలం' అనడానికి ఇది మంచి ఉదాహరణ.*

*꧁❀❀━❀జై భారత్❀━❀❀꧂*
       *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🌴🌵🌳 🙏🕉️🙏 🌳🌵🌴

No comments:

Post a Comment