Thursday, April 24, 2025

 _(ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం గురించి పరిచయం.. )_ 
*_"Roots"_*  
_(Author: --Alex Haley)_ 
 
*_"ఏడుతరాలు"... (తెలుగు అనువాదం: -సహవాసి)_* 
-------------------------
*విజేతలే చరిత్రను రాస్తారన్న నిష్టుర సత్యాన్ని బద్దలుకొట్టి, చరిత్ర పట్ల మన దృక్పథాన్ని సమూలంగా మార్చివేసిన అద్భుత రచన- ఈ "ఏడు తరాల బానిసల" కథ !*

*ఆరు తరాల వెనక అట్లాంటిక్ మహా సముద్రానికి ఆవల ఆఫ్రికా చీకటి ఖండంలో ఉన్న తన వంశం మూలాలు, దాని పుట్టుపూర్వోత్తరాలను వెతికి పట్టుకునేందుకు నల్లజాతి అమెరికన్ రచయిత 'ఎలెక్స్ హేలీ' చేసిన అసాధారణ అన్వేషణ ఫలితమే ఈ పుస్తకం. 'రూట్స్' పేరుతో 1976లో ప్రచురితమైన ఈ రచన అమెరికానూ, యావత్ ప్రపంచాన్నీ పట్టి కుదిపేసింది. నల్లజాతి అస్తిత్వాన్ని ఎలుగెత్తి చాటడంలో, జాతి వివక్షపై తిరుగుబాటు జెండా ఎగరెయ్యటంలో కీలకపాత్ర పోషించింది. ప్రపంచ వ్యాప్తంగా కోటికి  పైగా కాపీలు అమ్ముడు పోయింది. 37 భాషల్లోకి అనువాదమైంది. స్వేచ్ఛ నుంచి సంకెళ్లకు, సంకెళ్ల నుంచి విముక్తికి సాగిన ఈ ప్రస్థానం సినిమాగా, టీవీ సీరియల్గా కూడా గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది.*
💩💩💩💩💩💩💩💩
_తెలుగులో మొదటి ముద్రణ: *నవంబర్, 1980*_
_పనర్ముద్రణలు: 1983, 1990, 1994, 1997, 1999, 2001, 2005, 2006, 2007, 2010, 2011, 2012, 2014, 2015, 2016, 2017, 2019..._
_ప్రతులకు:_
_హైదరాబాద్ బుక్ ట్రస్ట్,_
 _ప్లాట్ నెం: 85, బాలాజినగర్,_ 
_గుడిమల్కాపూర్,_ 
_హైదరాబాద్ - 500 006_ 
_ల్యాండ్ ఫోన్: 23521848_
www.hyderabadbooktrust.blogspot.com
*::::::::::::::::::::::::::::::::::::::::::::::::*
 
*_[నేను ఈ పుస్తకం గురించి తొలిసారిగా 1999లో విన్నాను. అదికూడా మా నెల్లూరు జిల్లాస్థాయి _"డిస్ట్రిక్ట్ కీ రీసోర్స్ పర్సన్స్ వర్క్ షాప్" లో... 'మీకు నచ్చిన పుస్తకం' గురించి చెప్పమని ఒక సెషన్లో అడిగితే... తలా ఒకటి చెప్పారు. అప్పుడు ఒకరు ఈ పుస్తకం గురించి చెబితే తెలుసుకున్నాను. వెంటనే నెల్లూరులోని 'మణిబుక్ స్టాల్' కి వెళ్ళి కొని ఆరోజు రాత్రి చదివాను. తరువాత అనేక సార్లు చదివాను. సోషల్ టీచరుగా 2002లో పదోన్నతి పొందినప్పటి నుండి నేను రిటైరయ్యేదాకా (31-07-2020) విద్యార్థులకు దాదాపు ఆరు నెలల పాటు రోజూ కొంత సీరియల్ గా చెప్పేవాడిని. అదే సమయంలో ప్రపంచపటం ఉపయోగించి అవగాహన కలిగించే వాడిని. --𝑽𝒆𝒍𝒊𝒔𝒆𝒕𝒕𝒚 𝑵𝒂𝒓𝒂𝒚𝒂𝒏𝒂 𝑹𝒂𝒐, 𝑹𝒕𝒅. 𝑺𝑨-𝑺𝑺]_* 

*_—: ఇక ఈ పుస్తకం గురించి.. :—_*

*నిజం చెప్పాలంటే.. ఇది పరిచయం అక్కరలేని పుస్తకం. ప్రపంచ సాహిత్యం లోనే అత్యంత ప్రజాదరణ కలిగిన పుస్తకం. చాలా భాషలలోకి అనువదించబడిన పుస్తకం.*
***************************
*చరిత్ర ఎప్పుడూ విజేతల కోణం నుంచే రాయబడింది, చెప్పబడింది, చదవబడింది. కానీ అసలైన నిజాలు తెలియాలంటే.. పరాజితుల కోణం నుంచి మాత్రమే తెలుసుకోవాలి.* 

*ఆఫ్రికా అనగానే... 'చీకటి ఖండం' అనీ నాగరికత తెలియని ఖండం అనీ, అమెరికా అనగానే అది ఒక స్వర్గధామం అనీ.. నాగరికత తెలిసిన ఖండం అని చాలామంది అనుకుంటారు.* 

*ఎందుకంటే... మనకు తెలిసిన చరిత్ర అదే. కానీ, మానవ ఇతిహాసంలో రాతి పనిముట్లు చెక్కి, వాటిని ఉపయోగించగలిగే సామర్థ్యం అమెరికా కన్నా ముందే ఆఫ్రికా ఖండానికి తెలుసంటే, నమ్మగలమా...??!!!!* 
***************************

*16 ,17 శతాబ్దాలు... అమెరికా చరిత్రలో అత్యంత అమానవీయమైన, హేయమైన సంఘటనలు జరిగిన కాలం.* 

 *1619 లో ఆఫ్రికా ఖండం నుంచి బానిసలను కొనితేవడం  మొదలయ్యింది. రెండు శతాబ్దాల కాలంలో ఈ సంఖ్య 10 లక్షలకి పైగా దాటిపోయింది.* 

*బానిసలని కొనడం, అమ్మడం ఒక ముఖ్య వ్యాపారం అయ్యింది. ఎన్నో ఏజెన్సీలు పుట్టుకొచ్చాయి. జంతువులని వేటాడినట్టు.. ఆఫ్రికా ఖండం నుంచి మనుషుల్ని వేటాడి  దొంగతనంగా ఎత్తుకెళ్ళడం జరిగింది కూడా ఈ కాలంలోనే...!*
***************************

*అక్కడెక్కడో ఆఫ్రికా ఖండంలో... గాంబియా అనే దేశంలో మాండింకా తెగ ప్రజలు నివసించే 'జపూర్' అనే ఒక కుగ్రామం.* 
*అందులో ఉమరో ఒకడు. వాళ్లది కింటే వంశం. అతని భార్య 'బింటా కింటే'కు పుట్టిన నలుగురు కొడుకుల్లో 'కుంటా కింటే' పెద్దోడు.* 

*సాంప్రదాయ ముస్లిం పద్ధతిలో అన్ని శిక్షణలూ పూర్తి చేసుకుని బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెడతాడు. అతని శరీరంలో కూడా అప్పుడప్పుడే యవ్వనం తాలూకు చలనాలు కలుగుతుంటాయి.*
*ఈ వయస్సు వచ్చిన అబ్బాయిలకు ఒక వింతైన, శిక్షణ ఉంటుంది. అదే మొగపిల్లల్ని _' యోధ పురుషులు'గా తీర్చిదిద్దేందుకు ఇచ్చే "పురుష పౌర శిక్షణ".._ తమ నివాస తండాకు దూరంగా మూడు నెలలపాటు దట్టమైన అడవిమధ్యలో సిద్ధం చేసిన శిక్షణా శిబిరంలో రాత్రింబవళ్ళూ జరుగుతుంది. ప్రధాన గురువును "కింటాంగో" అంటారు. ఇది నిజంగా ఒక అద్భుతమైన శిక్షణ. దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలంటే ఈ పుస్తకం తప్పకుండా చదవాలి.*
*_"ఒంటరిగా ఎప్పుడూ అడవుల్లో తిరగకు, తెల్లోళ్లు వస్తారు, ఎత్తుకుపోతారు, చంపి తినేస్తారు"_ అని పెద్దలు పదే పదే చెబుతుంటారు. అయితే ఒకనాటి ఉదయం తమ్ముడు ఆడుకోడానికి చెక్కబొమ్మ చేయడానికి ఒక కొయ్యను కొట్టుకొద్దామని  ఒంటరిగా అడివికి వెళ్లిన 'కుంటాకింటే' ఇక తిరిగి ఇంటికి రాడు. ఏమైందని స్పృహ వచ్చి తెలుసుకునే సరికి తను ఓడలో ఉంటాడు. అతని ఏమరపాటే అతనిని ఈ స్థితికి తెచ్చింది.*

*ఓడ దిగువ అరల్లో వెలుగు మొహం ఎరుగని చిమ్మ చీకటిలో తనలాగే కుక్కబడ్డ తొంభైమంది అభాగ్యుల్లో ఇతనూ ఒకడు. తిండీ అక్కడే, మల మూత్రాలు అక్కడే. అమెరికా దక్షిణాది రాష్ట్రంలోని ఒకానొక తీరం అనాపోలిస్(నాప్లిస్) చేరే దాకా రెండున్నర నెలలపాటు అదొక నరక ప్రయాణం. దిగేసరికి పోయిన వాళ్లు పోగా మిగిలిన కొద్దిమందీ అమెరికా తెల్ల  భూస్వాముల దగ్గర బానిసలుగా అమ్మబడతారు.*

*అక్కణ్ణుంచి బయటపడదామని రెండడుగులు ముందుకు వేసిన ప్రతిసారీ అంతకు నాలుగింతల వేగంగా వెనక్కి తోయబడుతుంటాడు కుంటాకింటే. అయినా బయటపడాలనే తన ఆశను, ప్రయత్నాన్ని మాత్రం ఆపడు. అలా అతని తదనంతర తరాల వారసులు చేసిన వీర విఫల బానిస గాథే ఈ 'ఏడు తరాలు'.*

*బానిసత్వం చేసే నిగ్గరోడూ(నల్లోడు) మనిషే..! బానిసత్వం చేయించుకునే ఆ తెల్లోడూ మనిషే..! అయినా ఎందుకు ఈ దాష్టీకం...? అంటూ ఈ పుస్తకం చదువుతున్నంత సేపూ వేల వేల ప్రశ్నలు మదిని తరుముతూనే ఉంటాయి.*

*ఈ బానిసత్వం లోతులు ఎంతలా ఉంటాయంటే 'గర్భవతులైన నిగ్గరు(నీగ్రో) బానిస స్త్రీలు పొరపాటు చేస్తే తెల్ల యజమానులు వేసే శిక్ష ఎలా ఉంటుందంటే... నేలమీద ఆ గర్భవతి కడుపు పట్టేటంత గుంత తీసి, ఆ స్త్రీని నగ్నంగా బోర్లా పడుకోబెట్టి ఆమె పిర్రల పైన, వీపు పైనా కొరడాలతో కొట్టేంత'.*

*ఇలాంటివి కొన్ని కొన్ని చదువుతున్నప్పుడు పుస్తకాన్ని పడేసి వాళ్లు అనుభవించిన నరకయాతన తలుచుకుంటూ మౌనంగా ఉండిపొయిన సందర్భాలు కోకొల్లలు. అంతలా వెంటాడుతుంది ఈ 'ఏడు తరాలు'.*

*కొన్ని పుస్తకాలు వేటాడతాయి. ఎంతలా అంటే ఇన్నాళ్లు మనం చదివినదంతా ఏంటి? అని ప్రశ్నలు సంధించేంతలా.*

 *గాంబియాలోని నదిని 'కాంబే బో లాంగ్' అంటూ తన పూర్వీకుడైన 'కిన్-టే' మూలాలు వెతుక్కుంటూ రచయిత చేసిన ప్రయత్నం అద్భుతం. ఈ పుస్తకం రాయడం కోసం పన్నెండేళ్ల పాటు పూర్వీకులు తిరిగిన మూలాల్లో నువ్వు చేసిన ప్రయాణం ఈ పుస్తక రూపంలో సజీవంగా కనపడుతోంది.*
___________________________
*_“విజేతలే చరిత్రలు విరచించే వాస్తవం తాలూకు ఆనవాయితీని బద్దలు కొట్టడానికి యీ నా ప్రజల కథ తోడ్పడుతుందని ఆశిస్తాను” -ఎలెక్స్ హేలీ (రచయిత.)_* 
*==================*
*_••{ప్రతి ఒక్కరూ చదవదగిన పుస్తకం ఇది. సోషల్ టీచర్స్ మాత్రం ఖచ్చితంగా చదవాలి. కాంప్లెక్స్ మీటింగులలో "పుస్తక సమీక్ష" లోనూ ఉపయోగించవచ్చు.  ఇప్పటికీ ఈ పుస్తకం లోని అంశాలు నన్నూ, నా విద్యార్థులనూ వెంటాడుతూనే ఉన్నాయి. మీ... 🙏🙏-వెలిశెట్టి నారాయణరావు,}••_*

No comments:

Post a Comment