Monday, April 21, 2025

 'సీనియర్ సిటిజన్ల ఆరోగ్యం కాపాడే నిమిత్తం జారీ చేయబడిన ప్రకటన.'

రచన: ద్విభాష్యం రాజేశ్వరరావు.

"'సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. అది సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్  ఖాళీ చేసే పన్నాగం కావచ్చు. వెంటనే నేషనల్ హెల్ప్ లైన్1930 కి ఫోన్ చేయండి. ప్రజా ప్రయోజనార్థం హోం మంత్రిత్వ శాఖ వారిచే జారీ చేయబడినది.'....అంటూ రాత్రంతా ఒకటే కలవరింత డాక్టర్ గారూ! ఇప్పుడు తెల్లవారి లేచిన తర్వాత కూడా  వెర్రి చూపులు చూస్తూ నిమిషానికోమాటు అవే మాటలు అరుస్తున్నారు. ఆయనకేమైందో మాకు ఏం తెలియటం లేదు! ప్లీజ్ చూడండి!"అంటూ 70 ఏళ్ల మా నాన్నగారిని తీసుకువెళ్లి క్లినిక్ లో డాక్టర్ గారి ఎదుట కూర్చోబెట్టాను. మా నాన్నగారు డాక్టర్ గారి వంక వెర్రిగా చూస్తూ అవే మాటలు మళ్ళీ అరవడం ప్రారంభించారు.

డాక్టర్ గారు చిరునవ్వుతో నా వంక చూస్తూ ,"ఇది తెల్లారి లేచిన తర్వాత 12వ కేసు. మీ నాన్నగారి దగ్గర నుంచి సెల్ ఫోన్ తీసేసుకోండి! ఒక రెండు రోజులు  సెల్ ఫోన్ వాడకుండా ఉంటే సరి.. దానంతట అదే తగ్గిపోతుంది. మీరు ఫోన్ చేద్దామని డయల్ చేసిన ప్రతిసారి ఈ ప్రకటనతో వాయించేస్తున్నారు ఫోన్ కంపెనీ వాళ్ళు!! దాంతో జనానికి పిచ్చెక్కిపోతోంది!! గంటకు ,రెండు గంటలకు ఒకసారి హెచ్చరిక చేస్తే పరవాలేదు... ప్రతి నిమిషానికి ఫోన్ ఎత్తిన వెంటనే ఈ హెచ్చరిక రావడంతో ముసలి వాళ్లు తట్టుకోలేకపోతున్నారు! అంతకంటే ఏం లేదు! గాబరా పడకండి!" అంటూ నాకు  హితవు చెప్పి ఇంటికి పంపించారు.
'బతుకు జీవుడా!' అనుకుంటూ మా నాన్నగారిని తీసుకుని ఇంటికి చేరుకున్నాను.
                                *************

No comments:

Post a Comment