Thursday, February 13, 2025

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️


104. ద్యౌః శాంతిః అంతరిక్షః శాంతిః.....
పృథివీ శాంతిః శాంతిరేవ శాన్తిః

దివి శాంతం, అంతరిక్షం శాంతం, భూమి శాంతం, శాంతి... కేవలం శాంతి (యజుర్వేదం)

జీవ జగత్తులోని అంశం మానవుడు. ఈ అనంతవిశ్వంలో వీడొక భాగం. తన చుట్టూ ఉన్న సర్వప్రకృతి సంగీతంలో తానొక స్వరం. ఇతర స్వరాలతో చక్కగా
మేళవించగలిగితేనే అందంగా, ఆనందంగా మనగలడు. అలాకాక శృతి తప్పితే అపస్వరమౌతాడు.

క్షోభలేని స్థితియే శాంతి.

వేదర్షి తన చుట్టూ ఉన్న అనంతవిశ్వం శాస్త్రంగా ఉండాలి అని ఆకాంక్షించాడు.శాంతిని దర్శించాడు. ప్రతిష్ఠించాడు. దివి, అంతరిక్షం (జ్యోతిర్మండలాలు, గ్రహాలు),
భూమి. వనస్పతులు, నదులు, పర్వతాలు... అన్నీ శాంతంగా ఉండాలి. వీటిలో ఏ క్షోభ ఏర్పడినా మానవుని మనుగడకే ప్రమాదం. అయితే ఆ క్షోభకి తాను కారణం
కావడం మరీ ప్రమాదం. తత్కాల ప్రయోజనాల కోసం దీర్ఘకాలిక ప్రయోజనాలను, శాశ్వతక్షేమాన్ని నశింపజేస్తున్న నేటి మానవనాగరికత ప్రకృతిని క్షోభపెడుతోంది.

పచ్చదనాన్ని నిర్లక్ష్యంగా నశింపజేయడం, మితిమీరిన తన సుఖలాలసవల్ల వాతావరణాన్నీ, నదీనదాలనీ కలుషితం చేయడం మానవుడు చేస్తున్న తప్పిదం.
ముందూ, వెనుకా ఆలోచన లేకుండా భూమిలో, సముద్రాల్లో చేస్తున్న ప్రయోగాలు, మార్పులు వల్ల భూకంపాలనుకొనితెచ్చుకుంటున్నాం. అనేక పట్టణాలలో,మహానగరాలలో విపరీతమైన పెట్రోల్ ద్రవ్యాల వాడకం వలన గాలి కలుషితమౌతోంది. పారిశ్రామిక ప్రగతి నీటి వనరుల్నీ, వాయుమండలాన్నీ విషమయం
చేస్తోంది. అనుకున్న గమ్యాన్ని చేరడానికి అనేక దురవస్థలు పడవలసి వస్తోంది.

హింస, అసహనం వంటివి మనస్సులను కలుషితం చేస్తున్నాయి. వికృతమైన ఆలోచనలు పుడుతున్నాయి. అధర్మం, అసంప్రదాయం నాగరికతలుగా ఆకర్షిస్తున్నాయి. ఇవి భావనాపరమైన కాలుష్యాలు. బాహ్య, భావ కాలుష్యాల వలన విషజగతిని చుట్టూ సృష్టించుకుంటున్నాం.

గగన మండలంలోకి దూసుకుపోతున్నప్పటికీ, పృథ్వికి రక్షాకవచం చిల్లులు పడుతూండడాన్ని అరికట్టలేకపోతున్నాం. వీటన్నిటికీ పరిష్కారమేమిటి? ప్రకృతిలో
సహజీవనాన్ని సాధించడమే అసలైన పరిష్కారం.

ప్రపంచమంతటిలోను ప్రకృతిక్షోభను ఎక్కువ కలిగిస్తున్నది భారతదేశమే. ఇక్కడి అజ్ఞానం, స్వార్థపరత్వం, రాక్షసమైన రాజకీయ వ్యవస్థ. విదేశీవ్యామోహం... అన్నీ
కలిసి ఈ క్షోభకు కారణమౌతున్నాయి. 
మనలో మనచుట్టూ ఒక ప్రశాంతమైన
పరివేషాన్నిఏర్పరచుకోలేకపోతున్నాం.

తరిగిపోతున్న ప్రాకృతిక వనరులు, అక్రమంగా నరికివేస్తున్న మహారణ్యాలు, వాటికి
దోహదపడుతున్న రాజకీయ గూండావ్యవస్థ.... ఇవన్నీ మనదేశాన్ని రాను రాను నివాసయోగ్యం కాకుండా చేస్తున్నాయి.

దీనికి తోడు పెరుగుతున్న సాంకేతిక ప్రగతికి ధీటుగా, కనీసం కొరతలేని విద్యుత్తు,నిత్యావసరవస్తువులు, ఆహారపు వనరులను సమకూర్చుకోలేకపోతున్నాం.

జీవితంలో మనకి మనమే ఏర్పరచుకుంటున్న సంక్లిష్టత, నియంత్రణ లేని మనోభావాల వలన నిత్యం ఏదో 'అశాంతి' మనసును పట్టిపీడిస్తోంది.

సనాతన ధర్మజ్యోతి నుండి ప్రసరించే శాంతిదీధితులు సూక్తాలని మనసులోకి ప్రసరింపజేసుకోవలసిన తరుణమిది. నీ ఆశలను నియంత్రించేది ధర్మం. శాశ్వత
ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆడంబరాలను పరిమితం చేసుకుంటూ,ధర్మబద్ధమైన సుఖానికి ప్రాధాన్యమిచ్చిన నాడు 'వెంపర్లాట' తొలగి మనసుకి 'కుదురు'
చిక్కుతుంది. అప్పుడు మనచుట్టూ ప్రశాంతతను ప్రసరింపజేయగలం, స్వీకరించగలం.

ఈ ప్రకృతితో మనం కలసి బ్రతికి, బ్రతకనిచ్చే ధోరణిని అలవరచుకున్ననాడే
‘శాన్తిరేవ శాన్తిః'.   

No comments:

Post a Comment