☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
95. విష్ణుః పర్వతానామధిపతిః
పర్వతములకు అధిపతి విష్ణువు(యజుర్వేదం)
నదీనదాలను, వృక్షాలను, జ్యోతిర్గణాలను దేవతామయంగా దర్శించే భవ్య సంస్కృతి
పర్వతాలను సైతం ఈశ్వరచైతన్య స్వరూపంగా సంభావించి సమర్పించమని ఆదేశించింది.
ఉన్నతత్వానికి ప్రతీకలై, ఉదాత్తతకు సంకేతాలై, ఓషధీ సంపదలకు, వనస్పతులకు, వివిధ వనాలకు ఆవాసాలై పర్వతాలు ఆరాధింపబడుతున్నాయి. యోగ, ఆధ్యాత్మిక విజ్ఞానాల ఆధారంగా గమనిస్తే, ఉన్నతమైన భూమికలలో దైవశక్తి మహోజ్జ్వలంగా
ఆవిష్కరింపబడుతోందనీ, అందుకే తపస్సాధనలకు పర్వతశ్రేణినే ఋషులు ఎంచుకున్నారని స్పష్టమౌతుంది.
“దేవతాత్మా హిమాలయః” అన్నాడు కాళిదాసు. "పర్వతాలలో హిమవంతుడను నేను"అని విభూతియోగంలో గీతాచార్యుని మాట. దేవసిద్ధ ఋషినివాసమైన
హిమాలయాల నుండి సర్వ ఋషివిద్యలు, తపశ్శక్తులు విశ్వమంతా ప్రసరిస్తున్న
విషయాన్ని తార్కాణాలతో సహా యోగులు వివరించారు, వివరిస్తున్నారు. గంగా యమున వంటి పుణ్యనదులకు పుట్టినిల్లైన హిమాద్రిని జగదంబకు కన్న వారిల్లు-అని గౌరవిస్తాం. దివ్యౌషధులకు, అద్భుత విద్యలకు, విశ్వానికే గురుపీఠం ఈ హిమాద్రి.
ఈ పర్వతశ్రేణులలో మళ్లీ అనేక శిఖరాలు అనేక ప్రత్యేకతలని కలిగి ఉన్నాయి.గౌరీశంకరశిఖరం, కైలాస పర్వతం, మానస సరోవరం, కాశ్మీర సరస్వతి, బదరీనాథుడు,
కేదారనాథుడు, జ్వాలాముఖి... మొదలైన దైవధామాలు శీతాద్రి శిఖరాలలో విశ్వం వైపు ప్రసరిస్తున్న చైతన్య శక్తి పుంజాలు.
అటుపై వింధ్యపర్వత శ్రేణులు ఓంకారాది క్షేత్రాలలో, వింధ్యవాసినితో
విరాజిల్లుతున్నాయి. ఇవి కాక అరుణాచలం, శ్రీశైలం, వేంకటాచలం,
అహోబిలం...మొదలైన పర్వతాల ప్రశస్తి జగద్విదితం.
కొన్ని పర్వతాలపై దేవతలు పూజలందుకోవడమే కాక, పర్వతాలే దేవతలుగా ఆరాధింపబడుతున్న అద్భుతాలు ఉన్నాయి. అరుణాచలం సాక్షాత్తు శివస్వరూపమేనని ప్రాచీన గ్రంథాలు వర్ణిస్తున్నాయి. అరుణగిరి ప్రదక్షిణ, ఆ పర్వత పాదం నుండి
శిఖరం వరకు ఎక్కడైనా సరే చేసే సాధన దివ్యఫలితాలనిస్తాయని పురాణవచనమే కాక, చాలామందికి ప్రత్యక్షానుభవం. ఇప్పటికీ ఇటువంటి గిరులు సిద్ధభూములుగా
స్థిరపడి ఉన్నాయి.
'శ్రీశైలశిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే' అనే శాస్త్రాధారంగా శ్రీశైలం జ్యోతిర్మయ శివస్వరూపంగా ఆరాధింపబడుతుంది. ఇది శ్రీచక్రస్వరూపమేనని చాటేందుకు
జ్యోతిర్లింగక్షేత్రంగా, శక్తిపీఠంగా ప్రశస్తి వహించింది. ఉత్తరాన హిమాలయాలు ఎంతటివో, దక్షిణాన శ్రీశైలం అంతటిది. శివశక్త్యాత్మకమైన దివ్యధామమిది. దీని వరుసలోనే అహోబిల, వేంకటాద్రులు ఉన్నాయి. నృసింహ, శ్రీనివాస క్షేత్రాలుగా
ప్రసిద్ధి వహించినవి. సంకల్పంలో కూడా "శ్రీశైలస్య...” అని చెప్పుకుంటున్నామంటే
ఈ గిరి ప్రత్యేకత ఎంతటిదో తెలుస్తున్నది.
ఇక-సాక్షాత్తు గోవిందుని స్వరూపంగా ఆరాధింపబడే గోవర్ధనగిరిని బృందావనంలో,ఇప్పటికీ కోట్లాది ప్రజలు ప్రదక్షిణాదులతో కొలుచుకుంటున్నారు.
ఇవికాక-భద్రగిరి, మంగళగిరి, ఘటికాచలం, కోటప్పకొండ... ఇలా చిన్న పెద్ద చాలా కొండలు భూశక్తిని నిబద్ధం చేస్తూ, భూధరాలుగా ఉండడమే కాక, దేవతా
స్వరూపాలుగా మనకు 'కొండంత అండగా ఉన్నాయి. ప్రకృతి సౌందర్యానికి ఆలవాలాలే
కాక, పరమేశ్వర శక్తికి కేంద్రస్థానాలుగా ఉన్న ఈ గిరులను ఆధునికత పేరుతో
దెబ్బతీయకుండా జాగ్రత్త పడాలి.
ఏ పవిత్ర భావాన్ని మన ఋషులు తమ తపస్సు ద్వారా ఇక్కడ ప్రోది చేశారో, దానిని భంగపరచరాదు. వినోద విహార కేంద్రాలుగా మలచి, పర్యాటకులను ఆకర్షించాలని ప్రయత్నించే వికృత ధోరణులను ప్రతిఘటించి మనం వాటిని
పరిరక్షించుకోవాలి.
‘గిరయశ్చమే.. పర్వతాశ్చమే..' అని రుద్రచమకంలో పేర్కొన్నారు.
సర్వవ్యాపకుడైన పరమేశ్వరుడే పర్వతాలను అధివసించి పాలిస్తున్నాడని వేద హృదయం.
No comments:
Post a Comment