ॐॐ
🌺 *రామసేతు* 🌺
వానర సైన్యం సహా రామలక్ష్మణులు లంకకు చేరుకోవాలంటే...ఒకే ఒక్క మార్గం ఉన్నది. అది... దయ తలచి సముద్రుడు దారి ఇవ్వడమే! రాముడు ప్రార్థిస్తే సముద్రుడు కరుణించకపోడు. ఇక్ష్వాకువంశానికి చెందిన సగరకుమారుల కారణంగానే ఇంత వాడైన సముద్రుడు, ఆ వంశం వాడైన రాముడు అడిగితే స్పందించకపోడు అన్నాడు విభీషణుడు. అతని మాటలు మంత్రంలా పని చేశాయి. రాముడు శాస్త్రవిధిని అనుసరించి, సముద్రతీరంలో దర్భలపై తూర్పు దిశగా ఉపవాసంతో పడుకున్నాడు. మౌనం దాల్చాడు. దారి ఈయమని ఏకదీక్షతో సముద్రుణ్ణి ప్రార్థించాడు.
అలా మూడు పగళ్ళూ, మూడు రాత్రులూ గడిపాడు. సముద్రుడు కరుణించలేదు. సాక్షాత్కరించలేదు. దాంతో ఆగ్రహోదగ్రుడయ్యాడు రాముడు. బ్రహ్మాస్త్రప్రయోగానికి సిద్ధపడ్డాడు. ఆ అస్త్రానికి సముద్రుడు బెదిరిపోయాడు. చెలియలికట్ట నుండి యోజన దూరం వెనక్కి వెళ్ళి పోయాడు. వెళ్ళిపోయి, వణకుతూ ఉవ్వెత్తున లేచిన కెరటాల మీద ప్రత్యక్షమయ్యాడు. సముద్రుడు వణకుతోంటే అతను ధరించిన ఆభరణాలన్నీ సన్నగా కదులుతూ సవ్వడి చేయ సాగాయి. పరుగు పరుగున వచ్చాడు సముద్రుడు. రాముణ్ణి సమీపించాడు. అతనికి నమస్కరించాడు. అన్నాడిలా.
‘‘రామా! శాంతించు. పంచభూతాలు నీరు, నిప్పు, భూమి, ఆకాశం, వాయువు తమ సహజధర్మాలు తప్పకూడదు. ఆ కారణంగానే అగాధమై, నేను ఎవరినీ దాటనీయట్లేదు. నా నియమం నేను ఉల్లంఘిస్తే ప్రపంచానికే ప్రమాదం. నేను కామ లోభ భయాదుల కారణంగా స్తంభించకూడదు. స్తంభిస్తే నాలో గల సకల జలచరాలూ గల్లంతు అవుతాయి. అది సృష్టికే క్షేమం కాదు. అందుకే నీ ప్రార్థనను పట్టించుకోనట్టుగా ప్రవర్తించాను. అంతేగాని, మరో ఉద్దేశం నాకు లేదు.’’ నా విధి నాది! నా నియమం నేను తప్ప లేనంటూ జాలిగా వేడుకుంటున్న సముద్రుణ్ణి కరుణించలేదు రాముడు.
పైగా కోపావేశాలతో చూడసాగాడు. అప్పుడు మళ్ళీ ఇలా అన్నాడు సముద్రుడు. ‘‘రామా! నువ్వు కరుణిస్తే నా విధి నేను నిర్వర్తిస్తూ నీ సైన్యాలు నన్ను దాటేందుకు సహకరిస్తాను. నాపై మీరు వంతెన నిర్మించుకునేందుకు మిట్టప్రాంతాన్ని చూపుతాను. అంతేకాదు, నీ సైనికులకు నాలో గల భీకర జలచరాల వల్ల ఎలాంటి హానీ కలుగకుండా జాగ్రత్త వహిస్తాను. ఇకనైనా శాంతించు.’’
వంతెన నిర్మించుకునేందుకు అవకాశం కల్పించాడు సముద్రుడు. చాలనుకున్నాడు రాముడు. శాంతించాడు. చేతిలోని బ్రహ్మాస్త్రాన్ని చూశాడు. కళవళపడ్డాడు. ‘‘పూజ్యుడా! సంధించిన ఈ బ్రహ్మాస్త్రాన్ని వృధా చేయకూడదు. దీనిని ఎక్కడ విడిచిపెట్టాలో చెప్పు?’’ సముద్రుణ్ణి అడిగాడు రాముడు. ఎక్కడ విడిచిపెట్టాలి? ఎక్కడ విడిచిపెడితే స్వామి కార్యమూ, స్వకార్యమూ సిద్ధిస్తాయి? ఆలో చించాడు సముద్రుడు. అప్పుడు చెప్పాడిలా.
‘‘రామా! ద్రుమకుల్యం అనబడే ప్రదేశంలో క్రూరులైన దస్యజాతులు నివసిస్తున్నాయి. వారు నా జలాలు తాగుతూ కూడా నన్ను బాధిస్తున్నారు. నువ్వు ఆ దివ్యాస్త్రాన్ని వారి మీద ప్రయోగించు. వారిని సంహరించు.’’ సముద్రుడి మాట పూర్తి కానేలేదు, రాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. సముద్రుడు చెప్పి నట్టుగానే ఆ అస్త్రం ద్రుమకుల్యంలోని దస్యులందరినీ సంహరించింది. సంహరించి ఎడారిలాంటి ఆ ప్రదేశంలో లోతైన రంధ్రాన్ని ఏర్పరచింది. ఆ రంధ్రం గుండా పాతాళగంగ పైకి పొంగి, అక్కడంతా సార వంతమైంది. ఫలితంగా పచ్చికబయళ్ళూ, ఫల వృక్షాలూ పెరిగాయి. దానినే ‘వ్రణకూపం’ అని తర్వాతి కాలంలో వ్యవహరించారు. దస్యులను సంహరించిన రామునికి కృత జ్ఞతలు తెలియజేశాడు సముద్రుడు. తనలోని మిట్ట ప్రాంతాన్ని వారికి చూపించాడు. అది వంతెన నిర్మాణానికి అనువుగా ఉంటుందని తెలియజేశాడు. ‘‘రామా! నీ సేనానాయకుల్లో విశ్వకర్మ కుమారుడు నలుడు ఉన్నాడు. అతను గొప్ప శాస్త్రపండితుడు. వంతెన నిర్మాణాన్ని అతనికి అప్పగించు. అద్భుతంగా నిర్మిస్తాడు.’’ చెప్పాడు సముద్రుడు.
‘‘ఇంకో విషయం! వంతెన నిర్మాణపరంగా మీరు జారవిడిచే వృక్షాలూ, రాళ్ళూ నాలో మునిగిపోకుండానూ, దూరంగా అవి కొట్టుకుపోకుండానూ నేను తగిన జాగ్రత్తలు తీసుకుంటాను.’’ చెప్పాడు సముద్రుడు. రాముని దగ్గర సెలవు తీసుకున్నాడు. అదృశ్య మయ్యాడు. నలుణ్ణి చేర పిలిచాడప్పుడు రాముడు. అడిగాడిలా. ‘‘నీ గురించి సముద్రుడు చెప్పింది నిజ మేనా?’’ ‘‘నిజమే ప్రభూ! నా గురించి నేను చెప్పు కోవడం బాగోదనే నేనింత వరకూ ఊరుకున్నాను. నా తండ్రి వరశక్తితో నేను వంతెన నిర్మిస్తాను. పటిష్టంగా నిర్మిస్తాను. అయితే వానరులంతా చెట్లూ, గుట్టలూ కొల్లలుగా తెచ్చి నాకు తోడ్పడేటట్టుగా వారిని మీరు ఆజ్ఞాపించాలి.’’ ప్రార్థించాడు నలుడు. ‘‘నీ ప్రజ్ఞాసామర్థ్యాలు అక్కరకు వచ్చి నందుకు సంతోషంగా ఉంది.’’ నలుణ్ణి అభినందించాడు రాముడు. కోట్లాది వానరవీరుల్ని చూశాడు. ‘‘వంతెన నిర్మాణానికి నలునికి సహకరించండి.’’ అని ఆజ్ఞాపించాడు.
రాముడి ఆజ్ఞ వెలువడడమే ఆలస్యం, వానర వీరులంతా అడవులకు పరుగులెత్తారు. రకరకాల వృక్షాలను వేళ్ళతో పెరికి తెచ్చారు. నలుడు చూపిం చిన ప్రదేశంలో వాటిని వరుసగా పేర్చారు. ఒక పక్క వృక్షాలు ఇలా తరలి వస్తోంటే మరో పక్క చిన్న చిన్న కొండల్ని పెరికి, నలుడు ఎక్కడ వేయమంటే అక్కడ సముద్రంలో వేయసాగారు వానరులు.
చకచకా వంతెన నిర్మాణం చేపట్టాడు నలుడు. వంతెన వంకరలు రాకూడదన్నాడతను. దారాలు పట్టి నిలిచారు వానరులు. అడుగున స్తంభాలు నిర్మించాలన్నాడు నలుడు. ఇట్టే నిర్మించి చూపించారు వానరులు. వంతెన మధ్యలో రంధ్రాలు ఏర్పడ్డాయి. వాటిని పూడ్చాలన్నాడు నలుడు. చెట్లతోనూ, గుట్టల తోనూ వాటిని పూడ్చి పెట్టారు వానరులు. బాట చదునుగా ఉండాలి. నడిచేందుకు వీలుగా ఉండాలన్నాడు నలుడు. అలాగే అన్నారు వానరులు. దారి పొడుగునా గడ్డి పరిచారు. వానరులందరి సహకారంతో మొదటి రోజు పద్నాలుగు, రెండవ రోజు ఇరవై, మూడవ రోజు ఇరవై ఒకటి, నాలుగవ రోజు ఇరవై రెండు, అయిదవ రోజు ఇరవై మూడు యోజనాల చొప్పున మొత్తం నూరు యోజనాలు గల పొడవైన వంతెనను, పటిష్టమైన వంతెనను నిర్మించి ఊపిరి పీల్చుకున్నాడు నలుడు.
నిర్మించిన వంతెనకు శత్రువుల వల్ల ఎలాంటి ప్రమాదమూ సంభవించకుండా రాత్రింబవళ్ళు మంత్రులు సహా విభీషణుడు మారువేషాలు వేసుకుని కాపలా కాశాడు. వంతెనకు ఎక్కడా ఎలాంటి ప్రమా దమూ లేదనీ, రాదనీ రామునికి విన్నవించాడు. విభీషణుడు చెప్పిన మీదట కోదండాన్ని ధరించి రాముడు వంతెనపై నడచి ముందుకేగుతోంటే అతన్ని లక్ష్మణ సుగ్రీవులు అనుసరించారు. గంతులు వేస్తూ, కేరింతలాడుతూ వానరులూ వారిని అనుసరించారు. శూరులు కొందరు ఆకాశంలో ఎగురుతూ రాముణ్ణి అనుసరిస్తోంటే... మరి కొందరు సముద్రంలో ఈదుతూ కోలాహలంగా అనుసరించారతన్ని. అంతా లంకా తీరానికి చేరుకున్నారు.
ఉత్తరం నుండి దక్షిణదిక్కుకు వెలుగులు చిమ్ముతూ సముద్రమధ్యంలో స్వాతీపథంలా మెరుస్తోన్న వంతెనను ఆకాశం నుండి అమర సిద్ధ చారణగణాలు చూశాయి. ఆశ్చర్యపోయాయి. లంకాతీరానికి చేరిన రాముణ్ణి సమీ పించాయి. పవిత్రజలాలతో అతన్ని అభిషేకించాయి. ‘‘రామా! శత్రుసంహారకుడివై చిరకాలం ఈ భూమండలాన్ని పాలించు.’’ అని ఆశీర్వదించాయి. మహామహుల ఆశీస్సులందుకుని, కోదండపాణి అయ్యాడు రాముడు.
No comments:
Post a Comment